అధర్మం రాజ్యమేలినప్పుడు ధర్మస్థాపన కోసం దేవుడు మనిషి రూపంలో జన్మిస్తాడు. ఒక మనిషి జీవన పరిణామ క్రమాన్ని ఒక సినిమాగా తీస్తే అందులో నిమిషం మాత్రమే చరిత్ర ఉంటుంది. మిగతాది చరిత్ర పూర్వయుగం ఉంటుంది. లిఖిత ఆధారాలు, సజీవ సాక్ష్యాలు సాక్షాత్కరిస్తున్న చారిత్రక యుగం ఏదైనా ఉన్నదంటే అది, కొత్త రాష్ట్రంలో ఆవిష్కరించిన, ‘కలల కుంచె’తో తెలంగాణ చిత్రాలు మలిచిన ఉద్యమనేత కేసీఆర్ ప్రస్థానం. ఆయన జాతీయ రాజకీయ ప్రవేశంతో దేశ రాజకీయ ముఖచిత్రం మారనున్నది. ఎనిమిదేండ్లుగా అబద్ధాల పునాదుల మీద రాజ్యాన్ని అవహేళన చేస్తున్న బీజేపీ పాలకుల తీరుతో దేశం కొత్త నాయకత్వాన్ని కోరుకుంటున్నది. ఇది 140 కోట్ల ప్రజల ఆకాంక్ష.
దేశాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఫాసిస్టు పాలనకు చరమగీతం పాడాలి. రైతుల కన్నీళ్లు పోవాలంటే దేశం అభివృద్ధి వైపు పయనించాలి. మహాత్మా గాంధీ స్ఫూర్తితో ఏర్పడిన లౌకికరాజ్యాన్ని రక్షించుకోవాలి. ఈ క్రమంలో సకల శక్తులను కూడదీసుకోవాలి. బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ఆగడాలను ఎదిరించే నాయకుడు కేసీఆర్ ఒక్కడేనని దేశం విశ్వసిస్తున్నది. అందుకే కేసీఆర్‌ను ‘దేశ్ కీ నేత’గా చూడాలనే తపనతో 26 రాష్ర్టాల రైతుసంఘాల ప్రతినిధులు ఐక్యంగా ప్రగతి భవన్‌కు వచ్చి దేశ రాజకీయాల్లోకి ఆహ్వానించారు.
ఉద్యమనేత కేసీఆర్ నాయకత్వంలో కేవలం ఎనిమిదేండ్లలో తెలంగాణ సాధించిన ప్రగతిని విశ్లేషించుకుంటే మనం సాధించిన ఘన విజయాలెన్నో కండ్లముందు సాక్షాత్కరిస్తున్నాయి. అయితే బీజేపీ కబంధహస్తాల్లో చిక్కుకున్న దేశ ప్రజలకు ఇకపై కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ భరోసా ఇస్తుందనేది నిర్వివాదాంశం. జాతీయపార్టీ స్థాపించాలనే కేసీఆర్ ఆలోచనకు ఆజ్యం పోసింది ముమ్మాటికీ కేంద్రమే. దేశ ప్రజలు భావోద్వేగాల సుడిలో చిక్కి.. భయమనే జడిలో నక్కి.. తడబడుతున్న తరుణంలో ‘మన మార్గం ఇది కాదు, మన గమ్యం అభివృద్ధి, మన మార్గం మహనీయుల యాది’ అని గుర్తుచేస్తూ కేసీఆర్ దేశ రాజకీయ యవనికపై అడుగుపెడుతున్నారు.
‘ముంజేతికి కంకణం కట్టుకొని అద్దంలో చూసుకోవాల్సిన అవసరం లేదు’. కారణాలన్నీ సుస్పష్టమే, బహిరంగమే. అప్రజాస్వామిక పాలన కొనసాగిస్తూ, సమాఖ్యస్ఫూర్తిని దెబ్బతీసి, అదేపనిగా ఆర్థిక ఆంక్షల పేరుతో బీజేపీ ప్రభుత్వేతర రాష్ర్టాలపై పెత్తనం చెలాయిస్తున్నది. ఒంటెత్తు పోకడతో రైతుల నడ్డివిరిచే నల్ల చట్టాలు తెచ్చి పెట్టుబడిదారులకు కొమ్ముకాసే ప్రయత్నం చేసింది. ‘డబుల్ ఇంజిన్ సర్కార్’ పేరుతో దగా చేస్తున్నది. కానీ, ఇప్పుడు ఎవరి నోట విన్న ఒకే మాట ‘తెలంగాణ మోడల్’. దానిపైనే దేశమంతా చర్చ జరుగుతున్నది. ఈ అక్కసుతోనే కేంద్రం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక విషం చిమ్ముతున్నది. అధికారం కోసం కేంద్రం ఆడించే రాక్షస క్రీడలో రాజ్యాంగ వ్యవస్థలను పావులుగా వాడుకొని బీజేపీయేతర ప్రభుత్వాలపై కక్షగట్టి కూలదోస్తున్నది.
లొంగని నాయకులపై ఈడీ, సీబీఐ కేసులు మోపుతామంటూ భయపెట్టడం బీజేపీకి పరిపాటిగా మారింది. ఈ క్రమంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, శ్రామిక తిరోగమన విధానాలను తిప్పికొట్టేందుకు కేసీఆర్ నాయకత్వంలో చైతన్యవంతమైన పోరాటాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. సమకాలీన రాజకీయాల్లో మారుతున్న పరిస్థితులకు తగినట్టుగా ఉద్యమసూర్యుడు కేసీఆర్ రైతుల ఎజెండాగా ఉద్యమ కార్యాచరణ రూపకల్పన చేయాలి. అంబేద్కర్ కోరుకున్న నిజమైన ప్రజాస్వామ్యం అంటే సమాజ వనరులు సకలజనులకు సమానంగా పంపిణీ జరగడమే. కేసీఆర్ మార్గదర్శకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చుతున్నది. బీఆర్ఎస్ ద్వారా దేశంలో కూడా మరో చరిత్ర, నూతన అధ్యాయం ఆవిష్కృతమవుతున్నదనడంలో సందేహం లేదు.
దేశాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఫాసిస్టు పాలనకు చరమగీతం పాడాలి. రైతుల కన్నీళ్లు పోవాలంటే దేశం అభివృద్ధి వైపు పయనించాలి. మహాత్మా గాంధీ స్ఫూర్తితో ఏర్పడిన లౌకికరాజ్యాన్ని రక్షించుకోవాలి. ఈ క్రమంలో సకల శక్తులను కూడదీసుకోవాలి. బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ఆగడాలను ఎదిరించే నాయకుడు కేసీఆర్ ఒక్కడేనని దేశం విశ్వసిస్తున్నది. అందుకే కేసీఆర్‌ను ‘దేశ్ కీ నేత’గా చూడాలనే తపనతో 26 రాష్ర్టాల రైతుసంఘాల ప్రతినిధులు ఐక్యంగా ప్రగతి భవన్‌కు వచ్చి దేశ రాజకీయాల్లోకి ఆహ్వానించారు. విజయదశమి రోజున టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ జాతీయపార్టీగా ప్రకటించడం రైతన్నలకు వెయ్యేనుగుల బలాన్నిచ్చింది. ఈ దసరా భావిభారత చరిత్రలో నమోదయ్యే ఒక నూతన శకారంభానికి ఊపిరినివ్వబోయే ఉద్విగ్నభరిత ఘడియలకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే 70 శాతం వ్యవసాయం జీవనాధారంగా జీవిస్తున్న దేశంలోని రైతుల కన్నీళ్లు తుడిచేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది.
కల్లబొల్లి మాటలు, అబద్ధాలతో బీజేపీ నేతృత్వంలోని మోదీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు బలంగా ఉన్న కాంగ్రెస్ ఒక్కసారిగా బలహీనపడింది. దీంతో జాతీయ రాజకీయాల్లో శూన్యత ఏర్పడింది. బీజేపీకి బలమైన ప్రత్యామ్నాయమంటూ లేకుండాపోయింది. నాడు 1977లో ఇందిరను ఎదుర్కోవడానికి ఒకేఒక్కడు లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ మొదటి అడుగువేశారు. కేసీఆర్ ఒక్కడిగా మొదలై తెలంగాణ అస్తిత్వాన్ని పునఃప్రతిష్ఠించి.. ఆత్మగౌరవ జయపతాకను ఎగురవేశారు. అభివృద్ధి సవ్వడుల్లో తన ప్రాంతీయులను ఓలలాడించి పరిపాలన అంటే ఇదీ అని యావత్ దేశానికి చూపించిన భూమి పుత్రుడు కేసీఆర్. ముక్త్ బీజేపీ, ముక్త్ భారత్ నినాదంతో భారతదేశ రాజకీయ యవనికపై గులాబీ జెండా ఎగిరేందుకు ముందుకు కదులుతున్నారు. అందుకు దేశంలోని ప్రతి పౌరుడు చేయూతనందించాలి. కేసీఆర్ ‘బీఆర్ఎస్’ పార్టీకి మద్దతుగా దేశం నలుచెరుగులా తెలంగాణ శక్తిని ప్రదర్శించాలి.
(వ్యాసకర్త: జర్నలిజం విభాగాధిపతి, కేయూ)
-డాక్టర్ సంగని మల్లేశ్వర్
98662 55355