దేశాన్ని పునర్నిర్మించుకోవాలంటే అట్టడుగుస్థాయి నుంచి బడుగు బలహీనవర్గాలు అభివృద్ధి
చెందాలని మహాత్మా గాంధీజీ అన్నారు. గ్రామస్థాయి నుంచే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన భావించారు. ముఖ్యంగా గ్రామ పరిపాలనలో వికేంద్రీకరణ జరిగితేనే గ్రామాల ప్రగతి విరాజిల్లుతుందని గాంధీజీ బలంగా నమ్మారు. నాడు మహాత్మాగాంధీ అన్న మాటలు నేడు తెలంగాణలో ఆవిష్కృతమవుతున్నాయి. ఫలితంగా గాంధీ మార్గంలోనే తెలంగాణలో గ్రామీణ పరిపాలన కొనసాగుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో కొనసాగుతున్న దార్శనిక పాలనకు పలురంగాల్లో కేంద్రం ఏటా ప్రకటిస్తున్న అవార్డులే గీటురాయిగా నిలుస్తున్నాయి.
తెలంగాణ ఆవిర్భావ అనంతరం రాష్ట్రంలోని గ్రామాలు ఊహించనివిధంగా మార్పు చెందాయి. ముఖ్యంగా నెర్రెలు బారిన బీడు భూములు ఇప్పుడు పచ్చగా కళకళలాడుతున్నాయి. 1.34 కోట్ల ఎకరాల్లో రైతులు తమ భూములను సాగు చేస్తున్నారు. ఇది సీఎం కేసీఆర్ దార్శనిక పాలన వల్లే సాధ్యమైంది. కాగా, గత ఐదేండ్లలో తెలంగాణ రాష్ట్రం ‘రైస్ బౌల్ ఆఫ్ ఇండియా’గా అవతరించింది. రాష్ట్రంలో వ్యవసాయరంగం పురోగతి చెందిన కారణంగా వ్యవసాయానుబంధ రంగాలకు సైతం ప్రాధాన్యం పెరిగింది. ఫలితంగా కులవృత్తులపై ఆధారపడేవారికి నేడు చేతినిండా పని దొరుకుతున్నది.
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘పల్లె ప్రగతి’ కార్యక్రమం ద్వారా గ్రామాలు అభివృద్ధికి నోచుకున్నాయి. అందుకే కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ‘పల్లె ప్రగతి’ అవార్డుల్లో తెలంగాణ రాష్ట్రం అగ్రభాగాన నిలుస్తున్నది. ప్రధానంగా ప్రతి గ్రామపంచాయతీకి ‘ట్రాక్టర్’, ‘ట్రాలీ’, ‘ట్యాంకర్’, ‘వైకుంఠధామం’, ‘డంపింగ్‌యార్డ్’, ‘నర్సరీ’, ‘పల్లె ప్రకృతి వనం’ వంటి సదుపాయాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. గ్రామీణ ప్రజలకు విద్యుత్ నిరంతరాయంగా అందుతున్నది.
రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ సమగ్రాభివృద్ధికి ప్రతి నెల రూ.227.50 కోట్లు గ్రాంట్లుగా విడుదల చేస్తున్నది. వీటిలో గ్రామ పంచాయతీలకు రూ.210.44 కోట్లు, మండల పరిషత్‌లకు రూ.11.37 కోట్లు, జిల్లా పరిషత్‌లకు రూ.5.69 కోట్లు అందుతున్నాయి. ఈ నిధులతో అభివృద్ధి పనులు సాఫీగా సాగుతున్నాయి. దీనిఫలితంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో, కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ‘సన్సద్ ఆదర్శ్ గ్రామ్ యోజన’ కింద పది ఉత్తమ గ్రామాలను ప్రకటించింది. అందులో తెలంగాణ నుంచే ఏడు గ్రామాలుండటం అభినందనీయం. అలాగే కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ప్రకటించిన వార్షిక అవార్డుల్లోనూ 19 గ్రామాలు జాతీయ అవార్డులను కైవసం చేసుకున్నాయి.
గతంలో కరీంనగర్ జిల్లాలోని సైదాపూర్ మండలంలోని వెన్నంపల్లి గ్రామం ‘సన్సద్ ఆదర్శ్ గ్రామ్ యోజన’ కింద మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నది. సిరిసిల్ల ఉత్తమ జిల్లా పరిషత్ అవార్డును, చందాపూర్, వనపర్తి-బాల స్నేహపూర్వక గ్రామ పంచాయతీ అవార్డు (2020-21) గెలుచుకున్నది. ఉత్తమ జిల్లా పరిషత్ అవార్డు సిరిసిల్ల, ఉత్తమ మండలాలుగా పర్వతగిరి (వరంగల్), పెద్దపల్లి, తిరుమలగిరి (సూర్యాపేట), కొడిమ్యాల (జగిత్యాల) నిలిచాయి. అంటే ‘పల్లె ప్రగతి’లో భాగంగా పరిశుభ్రత, మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టిసారించడం ద్వారానే గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయి. దీని ఫలితంగా తెలంగాణ గ్రామ పంచాయతీలకు ‘దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయతీ సశక్తికరణ్ పురస్కార్’, ‘చైల్డ్ ఫ్రెండ్లీ గ్రామ పంచాయతీ అవార్డు’, ‘గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక అవార్డు’, ‘నానాజీ దేశ్‌ముఖ్ రాష్ట్రీయ గౌరవ్ గ్రామసభ పురస్కారం’ అనే నాలుగు విభాగాల కింద అవార్డులు రావడం తెలంగాణ సర్కారు పనితీరుకు నిదర్శనం.
రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి సైతం బడ్జెట్లో పెద్దపీట వేస్తున్నది. ప్రభుత్వం ప్రవేశపెట్టే మొత్తం బడ్జెట్లో 2022-23 ఆర్థిక సంవత్సరంలో గ్రామీణాభివృద్ధికి రూ.8,557 కోట్లను కేటాయించింది. ఇది గత ఏడాదిలో గ్రామీణ అభివృద్ధికి కేటాయించిన నిధుల కంటే 18 శాతం అధికం. అందులో ఏకంగా రూ.1,460 కోట్లు ‘మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ’ పనులకు కేటాయించడం గొప్ప విషయం. గ్రామాల అభివృద్ధిలో ప్రభుత్వంతో పాటు అధికారులు, ప్రజల సహకారం కూడా అవసరం. ఆ దిశగా రాష్ట్రంలోని గ్రామాలు అభివృద్ధి చెంది మరిన్ని అవార్డులు కైవసం చేసుకోవాలని ఆశిద్దాం.
(వ్యాసకర్త: తెలంగాణ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు)
-గుండెకారి రంగారావు
99493 04591