PSL : టీ20 క్రికెట్లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) పలు దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఫ్రాంచైజీ క్రికెట్‌కు ఆదరణ పెరగడంతో అందరూ ఐపీఎల్ తరహాలోనే వేలాన్ని నిర్వహిస్తున్నాయి. ఇప్పుడు పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) కూడా మన ఐపీఎల్‌నే కాపీ కొడుతోంది. ఇన్నాళ్లుగా అనుసరిస్తున్న లాటరీ (డ్రాఫ్ట్) విధానానికి స్వస్తి పలికి.. వేలం ప్రక్రియకు నాంది పలుకనుంది. వచ్చే సీజన్ నుంచే యాక్షన్ ద్వారా ఆటగాళ్లను కొనే పద్ధతిని పీసీబీ అనుసరించనుంది.
పాకిస్థాన్ సూపర్ లీగ్‌లోని ఫ్రాంచైజీలు ఇప్పటివరకూ ఆటగాళ్లను లాటరీ విధానం(డ్రాఫ్ట్)లో తీసుకునేవి. 2016లో లీగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఇదే పద్ధతిని పాటిస్తున్నాయి. ఇకపై వేలం ద్వారా క్రికెటర్లను కొనబోతున్నాయి.వచ్చే పదకొండో సీజన్ నుంచి పీఎస్ఎల్ సరికొత్తగా ఉండనుందని సోమవారం పీఎస్ఎల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సల్మాన్ నసీర్ వెల్లడించాడు.
Draft out, auction in!
After 10 seasons, PSL to change player system from 2026 👀 pic.twitter.com/NI2JRS54FD
— Cricbuzz (@cricbuzz) January 19, 2026
‘పీఎస్ఎల్లో భారీ మార్పు రాబోతోంది. ఇన్నాళ్లు లాటరీ ద్వారా ఆటగాళ్లను తీసుకునేవాళ్లం. ఇకపై వేలం విధానాన్ని అనుసరించబోతున్నాం. ఫలితంగా పారదర్శకతతో పాటు పోటీతత్వం కూడా పెరుగుతుంది’ అని సల్మాన్ నసీర్ తెలిపాడు. అంతేకాదు 1.3 మిలియన్ యూఎస్ డాలర్లుగా ఉన్న ఫ్రాంచైజీల పర్స్‌ను 1.6 మిలియన్ యూఎస్ డాలర్లకు పెంచుతున్నామని ఆయన వెల్లడించాడు.
ఐపీఎల్ తరహాలో వేలం ద్వారా ఆటగాళ్లను కొనే ప్రక్రియకు పచ్చజెండా ఊపిన నిర్వాహకులు.. ఎంతమందిని అట్టిపెట్టుకోవాలనే విషయంపైనా కసరత్తు చేశారు. ప్రతి ఫ్రాంచైజీ గరిష్టంగా నలుగురిని రీటైన్ చేసుకునేందుకు అనుమతించారు. ఇంతకుముందు ఎనిమిది మందిని అట్టిపెట్టుకునే వీలుండేది. అంతేకాదు.. మెంటర్, బ్రాండ్ అంబాసిడర్, రైట్ టు మ్యాచ్ నిబంధనలను కూడా రద్దు చేసింది. మార్చి 26వ తేదీ నుంచి పీఎస్ఎల్ పదకొండో సీజన్ షురూ కానుంది. ఆలోపే వేలం ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ప్రస్తుతం ఈ లీగ్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్, కరాచీ కింగ్స్, లాహోర్ క్యాలండర్స్, ముల్తాన్ సుల్తాన్స్, పెషావర్ జల్మీ, క్వెట్టా గ్లాడియేటర్స జట్లు పాల్గొంటున్నాయి.