వ్యక్త ప్రపంచం చిన్నది. దానికి ఆధారమై నడిపించే అవ్యక్త చైతన్య ప్రపంచం చాలా పెద్దది. ఇది ఆనాటి అంతర్ముఖీన రుషి హృదయం, ఈనాటి బహిర్ముఖీన విజ్ఞానం వక్కాణించే సత్యం. ఆ అవ్యక్త చైతన్యశక్తి విలాస ధర్మమే దైవత్వం. ఆ మౌలిక దైవత్వాన్నే సత్, చిత్, ఆనంద పరబ్రహ్మంగా, స్పందనాత్మక సదాశివ చైతన్యంగా, అంతర్యామి అయిన పరమాత్మగా పేర్కొంటుంది. ఇతర మతాలలో దానినే శూన్యమని, ధర్మమని, అధ్యాత్మమని, పరతత్త్వమని రకరకాలుగా వర్ణించారు.
భారతీయ సగుణ ఆరాధనలో ఆ మూలదైవత్వ ఆత్మీకరణను స్వీకరించే దైవాలు, వారిని కొలిచే ఆరాధనా విధానాలు అనేకం. ఈ ఆరాధన పూజగా బహిర్ముఖీనంగా సాగితే అర్చన. జపధ్యానాలుగా అంతర్ముఖీనంగా సాగితే తపస్సు. ఐహిక లబ్ధి కోసం చేస్తే దీక్ష. ఆత్మ సంపన్నత కోసం చేస్తే సాధన. భగవంతుడు భావనాగమ్యుడు. ఏ ఇష్టదైవమైనా.. స్వాభావికంగా అనంత సదాశివ చైతన్యశక్తే. అదే అనంత శివజ్ఞానం, అనంత శివప్రేమ, అనంత శివానందం. మనం కొలిచే దేవతామూర్తి మన జ్ఞాన, ఇచ్ఛ, క్రియాశక్తులను ఆనందప్రదంగా, పరమానంద అనుభవంగా వికసించడానికి గొప్ప ఆలంబనగా నిలుస్తాడు.
అయితే, నాస్తిక భావనతో చేసేది ఎంత గొప్ప పనైనా, లౌకికంగా అది ఇవ్వవలసిన గొప్పఫలాన్ని ఎంతగా ఇచ్చినా దాని ప్రభావం మన మనసుపై అల్పంగా ఉంటుంది. కారణం ఏమంటే, మన ఉనికికి సంబంధించిన మన అనుభూతి పదార్థస్థాయికి పరిమితం కావడమే! దాని కారణంగా ఆ ఫలం వల్ల కలిగే ఆనందం, సున్నితత్వపు విశాలత్వం, సంస్కారపు గాఢత పరిమితంగా ఉంటాయి. మన సూక్ష్మ శరీరాన్ని (సంస్కార శరీరాన్ని) మహత్తరంగా పరిణమింపజేయగలిగిన ప్రగాఢ ప్రభావాన్ని చూపలేనివిగా ఉంటాయి. కానీ, అదే పనిని ఆస్తిక్య భావనతో, పరమభక్తితో చేస్తే మన అనుభూతి పదార్థ పరిమితులను దాటి అమృత చైతన్యంలోకి విస్తరిస్తుంది. దాని ఫల ప్రభావం మనసును ఉద్ధరించేదిగా ఉంటుంది. మరింత ఉన్నత జన్మకు ప్రేరకంగా పనిచేస్తుంది. నాస్తిక భావంతో చేసే గొప్పపని పదిశాతం సంస్కార ఉన్నతిని ఇస్తే, ఆస్తిక భావనతో చేసే ఉత్తమ కార్యం తొంభైశాతం ఉన్నతిని కలిగిస్తుంది. ఫలితంగా మన వ్యవహారశైలి మరింత కృతజ్ఞతతో, కరుణతో, ధర్మనిష్ఠతో, ప్రకృతిని శివమయంగా సుసంపన్నం చేస్తుంది. ఆస్తిక్య కర్మల సమృద్ధ దైవత్వమే సంబుద్ధ శివత్వం అన్న సత్యాన్ని విశదపరుస్తుంది.
– యముగంటి ప్రభాకర్, 9440152258