Nidhhi Agerwal | తన కెరీర్లోనే ఇద్దరు టాప్ సూపర్‌స్టార్స్‌తో కలిసి నటించే అవకాశం రావడంతో హీరోయిన్ నిధి అగర్వాల్ మంచి జోష్‌లో ఉన్నారు. గతేడాది పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీరమల్లు సినిమాలో నటించిన నిధి, ఈ సంక్రాంతికి పాన్ ఇండియా సూపర్‌స్టార్ ప్రభాస్‌తో కలిసి ది రాజా సాబ్ చిత్రంలో కనిపించారు. ఈ రెండు సినిమాల బాక్సాఫీస్ ఫలితాలు ఎలా ఉన్నా.. తన కెరీర్‌కు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదని నిధి స్పష్టంగా చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీరమల్లు సినిమాలో అవకాశం రావడం ఆమె కెరీర్‌కు కీలక మలుపుగా మారింది.
పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ కావడం, ఇతర కారణాల వల్ల హరిహర వీరమల్లు షూటింగ్ ఆలస్యం అయ్యింది. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ ఎంతో శ్రమించి సినిమాను పూర్తి చేయగా, ప్రమోషన్ల బాధ్యతను ఎక్కువగా నిధి అగర్వాల్‌నే మోసినట్లు టాలీవుడ్లో చర్చ జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ నుంచి ఆమెకు ప్రశంసలు కూడా దక్కాయి.ఆ తర్వాత ప్రభాస్‌తో కలిసి నటించిన ది రాజా సాబ్ మూవీ విడుదలైంది. ఈ రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ విజయాలు సాధించకపోయినా.. నిధి అగర్వాల్ అందం, నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ది రాజా సాబ్ ప్రమోషన్ల సమయంలో హైదరాబాద్‌లోని ఓ మాల్లో జరిగిన ఈవెంట్లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం ఎదురైంది. అభిమానులు ఆమెను చుట్టుముట్టి అసభ్యంగా ప్రవర్తించడం తీవ్ర వివాదానికి దారి తీసింది. భద్రతా సిబ్బంది జోక్యంతో ఆమెను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న నిధి అగర్వాల్.. ఇండస్ట్రీలో జరుగుతున్న నెగిటివ్ క్యాంపెయిన్లపై, కుట్రలపై కీలక వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ స్టార్స్ కార్తీక్ ఆర్యన్, వరుణ్ ధావన్‌లపై జరిగిన దుష్ప్రచారాన్ని ప్రస్తావిస్తూ ఆమె స్పందించారు. ఇలాంటి నెగిటివ్ క్యాంపెయిన్లు జరగడం చాలా దారుణం. కొందరు ఇందుకోసం భారీగా డబ్బులు ఖర్చు చేస్తున్నారు. నటీనటులు చాలా సెన్సిటివ్, ఎమోషనల్‌గా ఉంటారు. ఇలాంటి ప్రచారాల వల్ల వారి కుటుంబాలు కూడా బాధపడతాయి. మేం సమాధానం చెప్పాల్సింది మా తల్లిదండ్రులకు మాత్రమే” అని నిధి అన్నారు. తనపై కూడా ఒకటి రెండు నెగిటివ్ క్యాంపెయిన్లు జరిగాయని, కానీ వాటిని తాను సమర్థవంతంగా ఎదుర్కొన్నానని నిధి అగర్వాల్ వెల్లడించారు. “కాశీకి వెళ్లి వచ్చిన తర్వాత నా జీవితం చాలా మారింది. దేవుడు, ఆధ్యాత్మికతతో మరింతగా కనెక్ట్ అయ్యాను. ఇలాంటి పరిస్థితులు వస్తే నేను ఎదుర్కొంటాను” అని ఆమె స్పష్టం చేశారు.