Daldal Trailer | బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘దల్ దల్’ (Daldal). ఈ సిరీస్‌కు అమిత్ రాజ్ గుప్తా దర్శకత్వం వహిస్తుండగా.. విక్రమ్ మల్హోత్ర, సురేష్ త్రివేణి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సిరీస్ జనవరి 30 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతుంది.
ఈ సందర్భంగా చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ ట్రైలర్ చూస్తుంటే.. ఈ కథ ముంబై క్రైమ్ బ్రాంచ్ కొత్త డిసిపిగా బాధ్యతలు చేపట్టిన రీటా ఫెరీరా అనే ధైర్యవంతురాలైన ఆఫీసర్ చుట్టూ తిరుగుతుంది. నగరాన్ని గజగజ వణికిస్తున్న ఒక క్రూరమైన సీరియల్ కిల్లర్‌ను పట్టుకోవడానికి ఆమె చేసే సాహసోపేతమైన ప్రయత్నాలు, ఈ క్రమంలో ఆమె ఎదుర్కొనే వృత్తిపరమైన సవాళ్లు మరియు ఆమె వ్యక్తిగత గతంలోని చేదు జ్ఞాపకాలను ఈ సిరీస్‌లో అత్యంత ఆసక్తికరంగా చూపించనున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ అత్యంత డార్క్ మరియు వయోలెంట్‌గా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఒక సీరియల్ కిల్లర్ తన బాధితుల నోట్లో మొబైల్ ఫోన్లు, మాంసం ముక్కలు కుక్కి అత్యంత కిరాతకంగా చంపే దృశ్యాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. ఈ చిత్రంలో భూమితో పాటు ఆదిత్య రావల్, సమర టిజోరి, గీతా అగర్వాల్, అనంత్ నారాయణ్, తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.