తాత దండ్రులిచ్చిన సేనుశెల్కలు ఎన్నున్నా
బోర్లు, బావులు ఎండిపోయి ఎక్కిరిస్తాంటే
చినుకు కరువై.. చెరువు తెరువై బతుకు బరువై
నీటి సుక్కకోసం ఆకాశం దిక్కు సూసింది మర్వలే..
బీడువడ్డ దుక్కుల్ని జూసి దుక్కం ఆపుకోలేక
కలిసిరాని కాలాన్ని తిట్టుకుంట ఊర్లె ఉండలేక
ఎక్కెక్కి ఏడ్సుకుంట గొడ్డూ గోదా ఇడ్సివెట్టి
కాలే కడుపుతో కాలేరుకొచ్చింది మర్వలే..
లంకంత కొంపను పానమసొంటి పల్లెనొదిలేసి
కూలినాలీ చేసుకుందామని వలసబాట వట్టి
కన్నోళ్లను కట్టుకున్నదాన్ని పస్తులుంచలేక
ఏటీఎం సెంటర్ల సెక్యూరిటీ గార్డునైంది మర్వలే..
ఏండ్లకేండ్లు పాలన చేసి ఎవుసాన్ని దండుగ జేసి
నీళ్లు, కరెంట్ లేక పంటలెండి నష్టాల పాలై
వడ్డీలకు వడ్డీలు కట్టలేక పానం తీసుకుంటే
తెగిన పసుపుతాళ్లే ఉరితాళ్లయింది మర్వలే
ఎద్దేడ్సిన ఎవుసం రైతేడ్సిన రాజ్యం బోయి
మా రాజ్యపాలన మా చేతికొచ్చిన సంబురం
బీడువడ్డ భూములను సస్యశ్యామలం జేసి
కన్నీళ్లను తుడ్సిన కాళేశ్వరం నీళ్లను మర్వలే
గోదారి మట్టి పరిమళం రా..రమ్మని పిలిస్తే
పొలిమేరను ముద్దాడి నా పల్లెను చేరుకుంటే
దేశాన్ని అన్నపూర్ణను చేసిన రైతన్న మేలుకోరి
రైతుబంధుతో సాయం జేసింది మర్వలే
ఎండిన చెరువులన్నీ నిండుగా మత్తడి దుంకి
పడావువడ్డ భూములు పచ్చని రంగేసుకున్నట్లు
పండిన పంటరాసుల్ని ప్రేమగా గుండెకద్దుకొని
తొలి పంట సారుకు ముడుపుకట్టింది మర్వలే
బతుకు దెరువైన తెలంగాణ రైతుకు ఆసరై
రైతుబంధు, రైతుబీమాతో భరోసానిచ్చి
సాగుతో అన్నపూర్ణను అభిషేకించిన పెద్ద రైతు
రైతన్నంటే పానమన్న కేసీఆర్‌నూ మర్వలే..
-మధుకర్ వైద్యుల , 80966 77409