భారతదేశం సువిశాలమైనది. మన దేశ సంస్కృతి చాలా గొప్పది. భిన్న మతాలు, భిన్నకులాలు, భిన్నజాతుల నిలయం ఈ దేశం. ఎంతోమంది అమరుల త్యాగఫలం మన స్వాతంత్య్రం. ఎందరో మేధావులను తయా రుచేసిందీ నేల. కానీ ఈ దేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఎందుకున్నదో మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. దేశం రాజకీయ క్రీడలకు వేదికై అల్లాడుతూ అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచిందనే విషయాన్ని గ్రహించాల్సిన అవసరం ఉన్నది.
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా దేశంలో ప్రధాని మోదీ ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరుతో ఉత్సవాలను ప్రకటించారు. దేశ ప్రజలుగా ఈ ఉత్సవాల్లో అందరూ భాగస్వాములు కావాలసిం దే. ఈ దేశ పౌరులుగా అది మన కర్తవ్యం. అదే సమయంలో మన దేశ పరిస్థితి, దేశ ప్రగతి గురించి కూడా ఆలోచించాలి. దేశం అన్ని రంగా ల్లో అభివృద్ధ్ది చెంది, ప్రశాంతమైన వాతావరణం ఉంటే దేశం విలువ మరింత పెరుగుతుంది. నిజంగా నేడు ఈ దేశంలో ఆ పరిస్థితి ఉన్న దా..? దేశ ప్రగతిఫలాలు ప్రజలకు అందుతున్నాయా..? ప్రజలు సంతోషంగా ఉన్నారా.. అంటే లేదని చెప్పాలి. దేశం పట్ల ప్రజలకు అపార గౌరవం ప్రేమలున్నాయి. లేనిదల్లా దేశ పాలకులకే.
గత ఎనిమిదేండ్లుగా బీజేపీ దేశంలో చేసిన అభివృద్ధి ఏముందంటే ప్రజలను మతాల పేరిట చీల్చడం, అభివృద్ధి మరిచి అడ్డదారుల్లో అధికారాలు కొల్లగొట్టడం. ఇవి తప్ప వాళ్లు చేసిందేమీ లేదు. నరేంద్ర మోదీ అధికారం చేపట్టిన నాటి నుంచి నేటివరకు దేశ ప్రగతి, ప్రతిష్ఠ తగ్గుతూ వస్తున్నాయి. రూపాయి విలువ తీవ్ర పతన దశకు చేరింది. నల్లధనం తీసుకొస్తానంటూ నోట్లు రద్దుచేసి గరీబోన్ని ఇబ్బందులు పెట్టి కార్పొరేట్ కుబేరుల బ్లాక్ మనీనంతా వైట్ చేశా రు ప్రధాని. ప్రభుత్వరంగ సంస్థలైన ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్ లాంటి పలు సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి ఉద్యోగుల జీవితాలను నెట్టి వారు రోడ్డున పడేలా చేసిందీ ప్రభుత్వం. కరోనా కాలంలో వలస కార్మికులు కాళ్ళకు రక్తం కారేలా నడుచుకుంటూ వెళ్తుంటే కనీసం పట్టించుకున్న పాపానపోలేదు. దేశానికి అన్నం పెట్టే రైతన్న వ్యవసాయ నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ ఏడాది పాటు ఢిల్లీ వీధు ల్లో పోరాటం చేస్తే వాళ్లను తీవ్రవాదులుగా పోల్చి వందల మంది రైతుల మరణానికి కారణమైంది కేంద్రం. బీజేపీ అధికారంలోకి రాకముందు రూ.450లుగా ఉన్న గ్యాస్ ధర నేడు రూ.1105కు చేరింది. పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీ మార్కును దాటేశాయి. తద్వారా రవాణా ఖర్చులు పెరిగాయి, నిత్యావసర ధరలు పెరిగాయి. నిత్యావసరాలపై జీఎస్టీ పేరుతో పేదల నడ్డి విరిచింది. మత విద్వేషాలు రేపుతూ, అనాలోచిత మాటలతో ఎంతో ఉన్నత విలువలు గల ఈ దేశ పాలకులు మన ప్రతిష్ఠను విదేశాల ముందు పలుచన చేశారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలను కూలదోసి తమ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయటం, ప్రజాస్వామ్యయుతంగా రాష్ర్టాల హక్కులను కాలరాస్త్తూ అధికారాలను తమ గుప్పిట్లోకి బదలాయించుకోవడం, ఇదేమిటని ఎదురుతిరిగితే వారిపై ఐటీ, ఈడీ రైడ్స్ అంటూ ముప్పుతిప్పలు పెడుతున్నారు.
దేశంలో తెలంగాణ పరిస్థితి భిన్నంగా ఉన్నది. సమర్థవంతమైన నాయకత్వం ఉండి స్వాతం త్య్ర ఫలాలను ప్రజలకు ఎలా పంచవచ్చో సీఎం కేసీఆర్ నిరూపిస్తున్నారు. 75 ఏండ్లలో జరగని అభివృద్ధ్దిని రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఎనిమిదేండ్లలో చేసి చూపించారు. అనతికాలంలోనే దేశం గర్వించేలా తెలంగాణ ప్రగతిపథంలో దూసుకు వెళ్లింది. నిజమైన స్వాతంత్య్ర ఫలాలను రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అందించారు.
రైతుకు కరెంటు గోస తీరుస్తూ దేశంలో ఎక్కడా లేనివిధంగా 24 గంటల ఉచిత విద్యుత్తును అందించారు. రైతుకు పెట్టుబడి సాయంగా రైతుబంధు, ఇంటిపెద్ద చనిపోతే ఆ కుటుంబానికి రైతుబీమా ఏర్పాటు చేశారు. మారుమూల పల్లెలను, తండాలను గ్రామపంచాయతీలుగా మార్చి అభివృద్ధ్దికి రాచబాట వేశారు. దేశం గర్వించదగ్గ ఇరిగేషన్ వండర్ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును కేవలం మూడేండ్లలో నిర్మించి అద్భుతాలు సృష్టించారు. మిషన్ కాకతీయతో తాంబాళం వలె ఉన్న చెరువులు తమ బరువులు దించుకొని సంబురపడుతున్నాయి. మిషన్ భగీరథ ద్వారా ప్రతీ గడపకు నీళ్లిచ్చి ఫ్ల్లోరైడ్ రక్కసిని పొలిమేరల దాకా తరిమేశారు. పేదింటి ఆడపిల్ల పెళ్లికి కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, జిల్లాకో మెడికల్ కళాశాల, పేదల కోసం బస్తీ దవాఖానలు, దళితబంధు ఇలా ఎన్నో గొప్ప పథకాలతో తెలంగాణలో నిజంగా పండు గ వాతావరణం నెలకొన్నది.
దేశాన్ని వందేండ్లు వెనక్కి తీసుకువెళ్తుతున్న బీజేపీ పాలనలో ఎవరు సంతోషంగా ఉన్నారంటే బ్యాంకులకు అప్పులు ఎగవేసిన కార్పొరేట్ శక్తులు, అదానీ, అంబానీలు. ఇలాంటి ప్రజల అభివృద్ధి పట్టని, దేశ ఉన్నతిపై అవగాహన లేని పాలకులను ప్రజలు తిరస్కరిస్తేనే నిజమైన స్వాతంత్య్ర ఫలాలు ప్రజలకు అందుతాయి.. అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది.
ఈ దేశం మనది కాపాడుకుందాం. మనదేశ ఖ్యాతిని, గౌరవాన్ని మరింత పెంచుకుందాం. దేశాన్ని అభివృద్ధ్దిలో నడిపించే వారికి అవకాశం ఇచ్చి దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేద్దాం.
-తెలంగాణ విజయ్, 94919 98702