గత 200 ఏండ్ల చరిత్రలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంతో పోల్చదగిన ఉద్యమం మరొకటి లేదు. ఆధునిక చరిత్రలో రాచరికానికి, భూస్వా మ్య దోపిడీకి వ్యతిరేకంగా సాగి వెట్టి చాకిరి రద్దుకు, భూమి పంపిణీకి పోరాడిన అద్వితీయ పోరాటమది. నాడు కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో సాగిన సాంఘిక, రాజకీయ, ఆర్థిక పోరాటాలు తెలంగాణ సమాజాన్ని గొప్ప ముం దడుగు వేయించాయి.
భారత్కు 1947, ఆగస్ట్ 15న స్వాతం త్య్రం వచ్చిన తర్వాత నిజాం రాజు హైదరాబాద్ రాజ్యాన్ని భారత్లో విలీనం చేయడానికి అంగీకరించలేదు. అయితే కమ్యూనిస్ట్ సాయుధ దళాలు తమ గెరిల్లా పోరాటాలతో రాజు మూల స్తంభాలైన భూస్వామ్య జాగీర్దార్లను కూలదోశాయి. పది లక్షల ఎకరాల భూమిని సామాన్యులు, పేదలకు పంపిణీ చేశాయి. తెలంగాణ అంతటా కమ్యూనిస్టులు గ్రామ రాజ్యాలు ఏర్పాటు చేసుకున్నారు. నిజాం రాజుని హైదరాబాద్కు పరిమితం చేశారు. సాయుధ సమర సేనాని రావి నారాయణ రెడ్డి సాయుధ దళాలు, ప్రజా మద్దతు 1948 ఆగస్టు నాటికి రాచరికాన్ని కూలదోసి ప్రజా రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి కమ్యూనిస్ట్ పార్టీ సంసిద్ధమైందని ప్రకటించారు. ఈ పరిణామాలను కమ్యూనిస్ట్ వ్యతిరేకి అయిన అప్పటి హోమ్ మంత్రి వల్లభాయ్ పటేల్ గమనించి, నిజాం రాజుతో ఎప్పటికప్పుడు చర్చిస్తూ గెరిల్లాల అణచివేతకు కావాల్సిన ఆయుధ సహాయాన్ని అందిస్తూ వచ్చారు.
కానీ కమ్యూనిస్టుల ప్రాబల్యం పెరగడం చూసిన తర్వాత నిజాం తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు. రష్యా విప్లవంలో జార్ చక్రవర్తులకు జరిగిన పరాభవం తనకు ఎదురు కావచ్చని తెలుసుకుని, తన రాజ్యం భారత్ లో విలీనమైందని, భారత రాజ్యాంగం తన రాజ్యంలో అమల్లోకి వస్తుందని ఒక ఫర్మానా జారీ చేశారు.
హైదరాబాద్ రాజ్యం భారత్లో ఐక్యం అయ్యాక సర్దార్ పటేల్ జాగీర్దార్లకు నగదు ప్రతి ఫలం ఇచ్చారు. హత్యలు, మాన భంగాలు చేసిన హిందూ భూస్వాములు, రజాకార్లపై చర్యలు తీసుకోలేదు. రజాకార్ నేత ఖాసీం రజ్వీ కోర్టు కేసును ప్రభుత్వ న్యాయవాదితో వాదింపచేసి అతడిని విడుదల చేయించారు. పోలీస్ చర్య అనంతరం నిజాంను బలహీనపరచిన కమ్యూనిస్టులను గౌరవించకపోగా వారిని నిర్మూలించే ప్రయత్నం చేశారు. పటేల్ ద్వేషం కారణంగా భారత సైన్యం చేతిలో సామాన్యులు, కమ్యూనిస్టులు ప్రాణాలు కోల్పోయారు. స్వాతంత్య్ర సమర యోధురాలు సరోజినీ నాయుడు కుమార్తెలు భారత సైన్యం అకృత్యాలను నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు నివేదించారు.
ప్రజల్లో కమ్యూనిస్టుల ప్రాబల్యాన్ని తగ్గించడానికి నెహ్రూ జాగీర్దార్ వ్యవస్థను రద్దు చేశారు. కౌలుదారులకు భూమిపై హక్కులను కల్పించారు. భారత ప్రభుత్వం సోషలిస్టు విధానాలను అమలు చేస్తామని ప్రకటించింది. భూ సంస్కరణ చట్టాలను రాజ్యాంగంలో చేర్చింది. దీంతో ప్రజ ల్లో పోరాట సంసిద్ధత తగ్గింది. ఈ విషయాన్ని గ్రహించి అక్టోబర్ 21, 1951లో కమ్యూనిస్ట్ పార్టీ సాయుధ పోరాటాన్ని విరమించింది. తమ పార్టీని నిషేధించిన కాలంలో కమ్యూనిస్ట్ పార్టీ పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ పేరుతో ఎన్నికల్లో పోటీచేసీ అత్యధిక స్థానాలు గెలుచుకుంది.
‘సెప్టెంబర్ 17’ వెనుక ఉన్న ఇలాంటి అద్వితీయ తెలంగాణ గత చరిత్రను ఉమ్మడి రాష్ట్రంలో కప్పి పెట్టారు. తెలంగాణ విలీన ఘనతను కాంగ్రెస్కు, సర్దార్ పటేల్ కు కట్టబెట్టారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా ఆ చేదు అనుభవాలకు క్షమాపణ చెప్పాలి. చరిత్ర ఇలా ఉంటే పోరాటాల వారసత్వం కాని, భాగస్వామ్యం కాని లేని మతోన్మాద అతి జాతీయవాదులు విలీన చరిత్రకు మసి పూసే ప్రయత్నాలకు తెగబడుతున్నారు. ఈ పోరాటాన్ని హిందూ-ముస్లిం పోరాటంగా చిత్రీకరించి కొందరిని రెచ్చగొట్టి ఓట్లను దండు కోవాలని చూస్తున్నరు.
8 ఏండ్ల పాలనలో ధరల అదుపు, నల్ల ధనం వెలికితీత, ఉద్యోగాల కల్పన ఇంకా అనేక రంగాలలో మోడీ ప్రభుత్వం విఫలమైంది. ఫాసిస్ట్ స్వభావంతో గుత్త పెట్టుబడిదారీ వర్గాన్ని ప్రోత్సహిస్తున్నది. ఈ వర్గాలకు కార్పొరేట్ పన్నును తగ్గించి లక్షల కోట్ల ప్రయోజనాన్ని చేకూరుస్తున్నది. రూ.లక్ష కోట్లకు మించని నిరు పే దల జీవన భద్రతకు ఉపయోగపడే ఉచితాలను రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నది. ఈ చర్యలతో బీజేపీకి ప్రజాదరణ తగ్గిపోయి ఇప్పుడున్న లోక్సభ స్థానాల్లో సగం కోల్పోయే పరిస్థితి వచ్చింది. తెలంగాణ ఏర్పాటును అపహాస్యంగా మాట్లాడిన మోడీ తెలంగాణకు ప్రయోజనకరమైన పనులు ఒక్కటి కూడా చేయలేదు. చరిత్ర వక్రీకరిస్తున్న బీజేపీని నిలువరించాల్సిన బాధ్యతే తెలంగాణ సమాజానిదే. ఎప్పటిలాగే మనం అప్రమత్తంగా ఉంటే మన రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది. అనేక తెలంగాణాలు దేశమంతటా ఏర్పడటానికి స్ఫూర్తిని ఇస్తుంది.
(వ్యాసకర్త: అస్నాల శ్రీనివాస్ , 96522 75560, అధ్యక్షులు, దొడ్డి కొమురయ్య ఫౌండేషన్)