1948, సెప్టెంబర్ 17న హైదరాబాద్ రాజ్యం ఎవరి నుంచి ఏం విమోచనం పొందింది? అన్ని సంస్థానాల్లాగే హైదరాబాద్ సంస్థానం కూడా ఆ రోజు భారతదేశంలో కలిసి పోయింది. అది విలీనం కూడా కాదు. విమోచనమో, విలీనమో అనడానికి హైదరాబాద్ ఇతర దేశస్థుల పాలనలో లేదు.
స్వాతంత్య్రానికి పూర్వం భారత్‌లోని వందలాది సంస్థానాల్లో హైదరాబాద్, కశ్మీర్ రాష్ట్ర, దేశ ప్రతిపత్తి గల పెద్ద సంస్థానాలు. ఇవి ఢిల్లీలోని కేంద్ర పాలకుల సార్వభౌమత్వాన్ని అంగీకరిస్తూ, ఆంగ్లేయులకు పన్నులు చెల్లిస్తూ దేశంలో భాగంగానే ఉన్నాయి. కేంద్ర పాలకులు కూడా సమాఖ్య స్ఫూర్తిని గౌరవిస్తూ పరస్పర సహకారంతో పరిపాలన కొనసాగించారు. స్వాతంత్య్ర పోరాటంలో తెలంగాణ (హైదరాబాద్ సంస్థానం), జమ్మూకశ్మీర్ ప్రజలు సమధికోత్సాహంతో పాల్గొన్నారు. ఎంతోమంది ప్రజలు అసువులు బాసారు. వందలాది మంది జైళ్ల పాలయ్యారు. వీరంతా దేశంపై అపారమైన భక్తి ప్రపత్తులను
కలిగి ఉన్నవారే. హైదరాబాద్ సంస్థానం ముస్లిం రాజుల పాలనలో ఉంటే, కశ్మీర్ సంస్థానం హిందూ రాజుల పాలనలో ఉండేది.
భారతదేశాన్ని ముస్లింలు 8 వందల ఏండ్లకు పైగా పాలించారు. అసఫ్‌జాహీ వంశం నైజాం నవాబులు హైదరాబాద్ సంస్థానాన్ని 4 వందల ఏండ్లకు పైగా పాలించారు. అందరూ హిందూ సంస్థానాధిపతులు, రాజుల వలె నైజాం నవాబులు కూడా భూస్వామ్య సంస్కృతిని పెంచి పోషించినవారే. అయితే వారు కాకతీయుల నమూనాలో ఊరూరుకు చెరువులు, కుంటలు తవ్వించి వ్యవసాయాన్ని అభివృద్ధి చేశారు. చార్మినార్, మక్కా మసీదు, ఓయూ, ఫలక్‌నుమా ప్యాలెస్, సాలార్జంగ్ మ్యూజి యం, నిజాంసాగర్, గండిపేట చెరువు, హుస్సేన్‌సాగర్, ఉస్మానియా దవాఖాన లాంటి అనేక చారిత్రక కట్టడాలను కట్టించారు. తమ మత ప్రచారం చేసుకున్నా హిందూ మతాన్ని అడ్డుకోలేదు. తమ ప్రార్థనాలయాలు, మసీదులు కట్టుకున్నా హిందూ దేవాలయాలు కట్టుకోవడాన్ని నిరోధించలేదు. ఉర్దూను రాజభాష చేసినా తెలుగు చదువడాన్ని అడ్డుకోలేదు. కులమతాలు, పేద, ధనిక వర్గాలకతీతంగా అందరికీ చదువుకునే అవకాశాలు ఇచ్చారు.
భారత స్వాతంత్య్ర పోరాటంలో ముస్లింలు వీరోచిత పోరాటం చేశారు. దేశం కోసం ప్రాణాలర్పించారు. అందరూ సంస్థానాధీశుల్లాగే నిజాం నవాబు కూడా బ్రిటిష్ ప్రభుత్వానికి కప్పం కట్టి సామంత రాజుగా ఉన్నారు. టిప్పు సుల్తాన్ లాంటి రాజులు ఆంగ్లేయులకు సింహ స్వప్నమయ్యారు. ఆంగ్లేయులు ఈ దేశ సంపదను దోచుకొని బ్రిటన్‌కు తరలించారు. మన కోహినూర్ వజ్రాన్ని కూడా తీసుకెళ్లారు. స్వాతంత్య్ర సమయంలో హిందూ ముస్లింల మధ్య విభజించు-పాలించు సూత్రాన్ని అమలు చేసి పబ్బం గడుపుకొన్నారు. కానీ, కొందరు ముస్లింలు ఆంగ్లేయుల్లా స్వాతంత్య్రానంతరం వెళ్లిపోలేదు, ఇక్కడే స్థిరపడ్డారు. దేశ సంపదను పెంచారు. ఘోరి, గజనీల దండయాత్రల సమయంలో తప్ప దేశ సంపదనెప్పుడూ విదేశాలకు తరలించలేదు. ఎందుకంటే ఈ దేశ ముస్లింలంతా ఇక్కడివారే. విదేశీ మూలాలున్న ఒకటి, అర శాతం కూడా ఈ మట్టిని ప్రేమించి వందల ఏండ్లుగా ఇక్కడే ఈ దేశ పౌరులయ్యారు.
ఈ చరిత్రను అధ్యయనం చేసిన నాయకుడు కేసీఆర్. తాను హిందువునేనని సగర్వంగా చెప్పుకొంటూనే ముస్లిం, క్రైస్తవ మైనారిటీలను సబ్బండ వర్ణాలతో సమానంగా చూస్తున్నారు. బలహీన వర్గాలకు సాయం అందించే క్రమంలో సబ్బండ కులాలతో ముస్లిం, క్రైస్తవ మైనారిటీలకు సమానంగా సౌకర్యాలను కల్పిస్తున్నారు. ముస్లిం విద్య, వెనుకబాటుతనం, సామాజిక స్థితిగతులను మెరుగుపరిచే చర్యలు చేపడుతున్నారు. గత ఎనిమిదేండ్లుగా రాష్ట్రంలో మత కల్లోలాలు లేకుండా సురక్షితంగా కాపాడుతున్నారు. అందరి మత విశ్వాసాలను గౌరవిస్తూ మత సామరస్యాన్ని కాపాడుతున్నారు. కానీ మతాలను రెచ్చగొడుతూ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బీజేపీ శతవిధాలా ప్రయత్నిస్తున్నది. కేసీఆర్‌ను ముస్లిం పక్షపాతిగా చిత్రిస్తూ హిందూ ఓట్లను పొందాలని చూస్తున్నది. సెప్టెంబర్ 17ను కూడా తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోజూడటమే ఇందుకు తాజా ఉదాహరణ. సెప్టెంబర్ 17ను విమోచన దినంగా పాటించాలని రచ్చ చేస్తున్నది.
1948, సెప్టెంబర్ 17న హైదరాబాద్ రాజ్యం ఎవరి నుంచి ఏం విమోచనం పొందింది? అన్ని సంస్థానాల్లాగే హైదరాబాద్ సంస్థానం కూడా ఆ రోజు భారతదేశంలో కలిసిపోయింది. అది విలీనం కూడా కాదు. విమోచనమో, విలీనమో అనడానికి హైదరాబాద్ ఇతర దేశస్థుల పాలనలో లేదు. 1948, సెప్టెంబర్ 17న పోలీస్ చర్య జరిగినప్పుడు, నిజాం నవాబు ముందు బెట్టు చేసినా చివరికి భారత సైన్యానికి లొంగిపోయి పాలన నుంచి తప్పుకొన్నారు. కశ్మీర్ సంస్థానాధీశుడిలా ప్రత్యేక ప్రతిపత్తిని కాని, మరే సౌకర్యం కాని కోరుకోలేదు.
నిజాం చివరి రోజుల్లో విజృంభించిన రజాకార్ల దురాగతాలను మినహాయిస్తే నిజాం నవాబులు తెలంగాణను ఇతర ఫ్యూడల్ రాజుల కంటే మేలైన విధానంలో పాలించారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేసినవారు గ్రామాల్లోని పెత్తందార్లు అయిన భూస్వాములే. అందుకే తెలంగాణలో సాయుధ పోరాటం అవసరమైంది. లక్షలాది ఎకరాల భూ పంపకాలు జరిగాయి. ఆ పోరాటాన్ని అణచివేయడానికే నెహ్రూ సైన్యం హైదరాబాద్‌కు వచ్చింది. నైజాం లొంగిపోవడమనేది అతి చిన్న చర్య మాత్రమే. సాయుధ పోరాటాన్ని నైజాం వ్యతిరేక పోరాటంగా కుదించడం కమ్యూనిస్టులు, బీజేపీ నాయకులు చేసిన, చేస్తున్న చారిత్రక తప్పిదం.
చాణక్య రాజనీతిని జీర్ణించుకున్న కేసీఆర్ ప్రభుత్వం బీజేపీ ఎత్తుగడలను చిత్తు చేస్తూ సెప్టెంబర్ 17ను విమోచన దినంగా కాకుండా ‘జాతీయ సమైక్యతా దినం’గా జరుపుతున్నది. అవును, సెప్టెంబర్ 17 ఎవరి నుంచి ఎవరూ విమోచనం పొందిన దినం కాదు. ఏదో ఒక మత ప్రజలను రెచ్చగొట్టడం, దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందే దినంగా కాకుండా సెప్టెంబర్ 17ను ‘జాతీయ సమైక్యతా దినం‘ (మత సామరస్య దినంగా) జరపడం కేసీఆర్ విజ్ఞతకు ఉదాహరణ.
-డాక్టర్ కాలువ మల్లయ్య
91829 18567