మురికి బతుకులన్న మాకు రానేరాదు కోపం మనసు విలువ తెలియదండి అది మీ లోపం కాలా సినిమాలో ఓ ర్యాప్ సాంగ్ సాహిత్యం ఇది. మురికివాడలు మురిసేలా పదం రాసి, పాట పాడిన ర్యాపర్ అభినవకవి ప్రణవ్ చాగంటి. పాశ్చాత్య దేశాలకు పరిమితమైన ర్యాప్ థీమ్‌తో రఫ్ఫాడిస్తున్న ఈ యువకుడు తన పాటలతో సమాజాన్ని ప్రశ్నిస్తుంటాడు. మాతృభాష తెలుగుపై ఉన్న మమకారంతో వినూత్న ప్రయోగాలు చేస్తున్నాడు. రెండంటే రెండే అక్షరాలతో ర్యాప్ సాంగ్ కట్టి జై కొట్టించుకున్నాడు. సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న అభినవకవి ఫిల్మ్ దునియాలోనూ సత్తా చాటుతున్నాడు. తన ర్యాప్ గీతాలతో తెలుగు పటిమను
చాటుతానంటున్న ర్యాపర్ ప్రణవ్ చాగంటి ప్రయాణం ఆయన మాటల్లోనే..
రణమున శరం అభినవకవి గళం ప్రమాదకరం అభినవకవి పథం..
ఇదీ నా ఫిలాసఫీ! ఎలక్ట్రిక్ ఇంజినీరింగ్ పూర్తికాగానే.. ‘మర్చంట్ నేవీలో కొలువులు పడ్డాయట. ముంబయికి పోతే ఇంటికి ఆసరా అయితవ్’ అన్నారు మా బాబాయి. ఆయన మాట మీద ముంబయికి వెళ్లి, ఉద్యోగంలో చేరాను. రెండేండ్లు చేశాను. కానీ, మ్యూజిక్ మీద ఇష్టంతో ఉద్యోగం మానేశాను. నేను పుట్టింది, పెరిగింది అంతా హైదరాబాద్‌లోనే. మా నాన్న మెడికల్ రిప్రజెంటెటివ్ పనిచేసేవారు. రోజూ మా ఇంటికి న్యూస్ పేపర్ వచ్చేది. దినపత్రిక చదవడం నాకు అలవాటు. ఓ రోజు పత్రికలో ‘తక్కువ ధరకే సీడీ ప్లేయర్, సీడీలు పొందండి’ అంటూ యాడ్ కనిపించింది. వెంటనే వెళ్లి కొనుక్కొచ్చాను. నేను తెచ్చిన సీడీల్లో అన్నీ ఏఆర్ రెహమాన్ పాటలే ఉన్నాయి. ఆ పాటలు వింటూ కొత్త ట్యూన్లు కట్టేవాణ్ని. అలా సంగీతం, సాహిత్యంపై ఇష్టం ఏర్పడింది. బీటెక్ చేసిన నేను.. ఉద్యోగంలో సెటిల్ అవుతానని అమ్మానాన్న ఆశపడ్డారు. కానీ, నేను మ్యూజిక్ మీద ఇష్టంతో ఉద్యోగాన్ని వదిలేశాను.
మ్యూజిక్ నేర్పిస్తూ
మ్యూజిక్ కోర్స్ నేర్చుకోవాలనుకున్నా. అందుకోసం చెన్నైకి వెళ్లి ఓ కోర్స్‌లో చేరాను. ఆరు నెలల్లో చేతిలో ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి. లాభం లేదనుకుని బెంగళూరుకు మకాం మార్చాను. అప్పటికే గిటార్, పియానో ప్లే చేయడం వచ్చు. బెంగళూరులో చిన్న పిల్లలకు గిటార్, పియానో నేర్పిస్తూ ఖర్చులు వెళ్లదీసుకునేవాణ్ని. ఇలా పనిచేస్తూనే ర్యాప్ పాటలు రాయడం మొదలుపెట్టాను. వాటిని రికార్డ్ చేయడం కోసం అక్కడి స్టూడియోలకు వెళ్లేవాణ్ని. అయితే, అక్కడివారికి మన భాష రాకపోవడంతో.. వారం వారం హైదరాబాద్‌కు వచ్చి పాటలు రికార్డు చేసుకుని.. వెళ్లిపోయేవాణ్ని. ఇలా ఎంతకాలం తిరుగుతామని హైదరాబాద్‌కు వచ్చేశాను.
నా కవిత్రయం వాళ్లే..
శాస్త్రీయ గీతాలలో కన్నా.. ర్యాప్ పాటల్లో మన ఆలోచనలు సూటిగా చెప్పొచ్చని నాకు అనిపించింది. అందుకే ర్యాపర్‌గా అవతారమెత్తాను. ముగ్గురు కవుల ప్రభావంతో నేను ఈ మార్గం ఎంచుకున్నాను. శ్రీశ్రీ, కాళోజీ, సిరివెన్నెల సీతారామశాస్త్రి… నాకు తెలిసిన కవిత్రయం వీళ్లు. ఈ ముగ్గురు చేసిన పద ప్రయోగాలు తెలుగు భాష గాంభీర్యాన్ని చాటి చెప్పాయి. వీళ్ల ఆలోచనల్లాగే నా ర్యాప్ పాటల ప్రస్థానం మొదలైంది. 2004లో ఢిల్లీలో ఓ యువతిపై యాసిడ్ దాడి జరిగిందని పేపర్లో చూశాను.
ఆ సంఘటన నన్ను కలిచివేసింది. ఆ సందర్భంగా ఓ పాట రాసుకున్నా. కానీ, బయటికి పాడలేదు. 2012లో నిర్భయ ఘటన జరిగినప్పుడు చలించిపోయాను. నా ఆవేదన పాటగా బయటికి వచ్చింది. అప్పట్నుంచి సామాజిక అంశాల కోణంలో ర్యాప్ సాంగ్స్ రాస్తూ, పాడుతున్నా. హైదరాబాద్ పానీపూరీ గురించి, ఇరానీ చాయ్‌పై చేసిన ర్యాప్ సాంగ్స్ నాకు గుర్తింపు తీసుకొచ్చాయి. పానీపూరీ పాట వైరల్ కావడంతో సినిమా అవకాశాలు వచ్చాయి. పైసా వసూల్’, హలో, యుద్ధం శరణం, అల వైకుంఠపురంలో, సరిపోదా శనివారం, బొమ్మ బ్లాక్ బాస్టర్, ఏ1 ఎక్స్‌ప్రెస్, కాంతా సినిమాల్లో ర్యాప్ పాటలు రాసి పాడాను. రజినీకాంత్ నటించిన ‘కాలా’ సినిమాలో నాలుగు పాటలు రాసి, పాడాను. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. నేను రాసిన వందకుపైగా పాటల్లో 30 వరకు విడుదలయ్యాయి. వాటికి మంచి ఆదరణ వచ్చింది.
ఐదుసార్లు పాడించుకున్నారు
సిరివెన్నెల సీతారామశాస్త్రి మీదున్న అభిమానంతో ఆయన గురించి ఓ పాట పాడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశా. అది వాళ్లబ్బాయి చూసి శాస్త్రిగారికి చూపించారట. ఆయన నన్ను ఒకసారి కలవమని చెప్పారు. ఆ పిలుపును గొప్ప అవకాశంగా భావించి కలిసేందుకు వెళ్లాను. నేను రాసిన పాటలను కొన్ని వినిపించాను. మద్యపానంపై రాసిన పాటను బాగా మెచ్చుకున్నారు. పదిహేను నిమిషాల్లోనే ఐదుసార్లు పాడించుకున్నారు. ‘కష్టపడితే యూత్ ఐకాన్ అవుతావ’ని ఆశీర్వదించారు. నేను చేసిన ‘ద్విక్షరి’ ప్రయోగం చాలా వైరల్ అయింది. రెండు అక్షరాలతోనే పాటంతా సాగుతుంది. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో కవి నంది తిమ్మన చేసిన ప్రయోగమిది. ప్రబంధ కవులు కూడా ఈ తరహా పద్యాలెన్నో కట్టారు. నా విషయానికి వస్తే.. ‘న’, ‘మ’ రెండు అక్షరాలనే తీసుకొని.. లవ్ బ్రేకప్ సాంగ్ రాశాను. ‘నీ నామ మననమ్మును నేను మాననేమైనా.. నీ మనమున నా నామ మననమ్మనుమానమైనా..’ ఇలా సాగిపోతుందా గీతం. సామాజిక మాధ్యమాల్లో ఈ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
విశ్వవ్యాప్తం కావాలని
వీడి జీవితం ఏమైపోతుందోనని అమ్మానాన్న చాలా భయపడ్డారు. ఎవరెన్ని మాటలు అన్నా.. నా మీద నమ్మకంతో ప్రోత్సహించారు. ఒకప్పుడు చిన్నచూపు చూసినవాళ్లే.. ఇప్పుడు ‘మావోడు’ అని చెప్పుకోవడం గర్వంగా అనిపిస్తున్నది. మన సాహిత్యంలోని మాధుర్యాన్ని జెన్ జీ తరానికి అందించాలన్న ఆలోచనతో ‘అభినవకవి’ పేరుతో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ అకౌంట్లు క్రియేట్ చేసి ర్యాప్ పాటలను పోస్ట్ చేస్తున్నా. సుమారు 3 లక్షల మంది ఫాలోవర్లు నన్ను నా పాటలను ఆదరిస్తున్నారు. తెలుగు ర్యాప్‌ను ప్రపంచవ్యాప్తం చేయాలన్నదే నా లక్ష్యం.
…? రాజు పిల్లనగోయిన