సంక్రాంతి అంటేనే సందడి. ముగ్గులు, గొబ్బెమ్మలు, రేగుపళ్లు, చలి మంటలు, పశువుల అలంకరణలు, తీరొక్క అప్పాలు, నోములు, వాయనాలు, సెలవులు.. ఇవి మా ఊర్లో అయితే! వీటన్నిటితోబాటు రైలు ప్రయాణం, హైదరాబాద్ నుమాయిష్, పతంగులు.. మరెన్నో ఆటలు భాగ్యనగరంలో!
సంక్రాంతి పండుగ సెలవులు పది, పన్నెండు రోజులుండేవి. నేను హైదరాబాద్లో చదువుకోవడానికి ఉన్న రోజులు తప్ప.. మా పెళ్లిళ్లయ్యేదాకా దాదాపుగా ప్రతి సంవత్సరమూ సంక్రాంతి సెలవులకు అక్కా, నేనూ హైదరాబాద్కు వెళ్లి వారం పదిరోజులు ఉండి వచ్చేవాళ్లం. మేము మా ఊరి నుంచి పూరీ ప్యాసింజర్లోనో, నాగ్పూర్ ప్యాసింజర్లోనో వెళ్లి నాంపల్లి స్టేషన్లో దిగేవాళ్లం. అక్కడినుంచి గౌలిగూడలో ఉన్న పద్మ చిన్నమ్మ వాళ్లింటికి వెళ్లేసరికి సాయంత్రం అయ్యేది. రోజంతా రైల్లో ఉన్నట్టే అనిపించేది. మేము కారం ఎక్కువగా తినలేమని చిన్నమ్మ అప్పటికప్పుడు మా కోసం పక్కనే ఉన్న గజానన్ స్వీట్ హౌస్లో నుంచి నమక్ పేడాలు, స్వీట్లు తెప్పించి పెట్టేది.
మా ఊర్లో పాతింట్లో మిద్దె లేదు. ఇల్లు చతుశ్శాల భవంతి. పెద్దగానే ఉండేది గానీ, పైన ఇంకో అంతస్తు ఉండి.. ఒక్క హాల్ అయినా, కనీసం డాబా అయినా ఉంటే బావుండేదనేది మా కోరిక. మనకు ఏవి ఉండవో అవే కావాలనిపిస్తుంది కదా! అయితే లక్ష్మి వాళ్లింటికి వెళ్లినప్పుడు ఆ కోరిక తీరేది. గౌలిగూడలో వాళ్లిల్లు మూడంతుస్తులతో చాలా పెద్దది. మరీ పై అంతస్తులో ఓ హాలూ, రెండు రూములుండి.. మిగతా అంతా ఖాళీగా ఉండేది. ఆ రూముల్లో కూడా అన్నీ పాత సామాన్లే!
సీజన్లో ఆ చుట్టుపక్కల పతంగుల దుకాణాలు వెలిసేవి. రంగురంగుల పతంగులు చూస్తుంటేనే ఎంతో అందంగా ఉండేవి. ఒకరోజు లక్ష్మి వాళ్ల నాన్న దగ్గర డబ్బులు అడుక్కుని మా అక్కాచెల్లెళ్లిద్దర్నీ వాళ్లింటి రోడ్డు మీదనే ఉన్న పతంగుల దుకాణానికి తీసుకెళ్లింది. అతను తెల్సినవాడే. “అరె అమ్మా! అప్ క్యోమ్ ఆయే? బోల్ దియేతో మై లాతా థా” అన్నాడు. దానికి లక్ష్మి.. “ఫర్వా నై! ఖుద్ ఆయేతో దేఖ్ సక్తేనా!” అని ఓ రెండు పతంగులను, చర్ఖా, మాంజాలను కూడా కొన్నది. వాటి పేర్లు కూడా నేను మొదటిసారి విన్నాను. అప్పటికి చైనా మాంజాలు కూడా వచ్చాయి గానీ, మా చేతులు కోసుకుపోతాయని అతను ఇవ్వలేదు.
ఇంటికి రాగానే వాటిని ఎక్కడో దాచిపెట్టి.. సాయంత్రం కాగానే పైకి వెళ్లాం. ‘నాలుగ్గంటలు ఎప్పుడవుతుందా!?’ అని ఆరోజంతా భలే ఉత్కంఠ ఉండింది నాకు. మొత్తానికి మొదటిరోజే విజయవంతంగా మిద్దె మీద పతంగులకు మాంజా కట్టి.. ఒకళ్లు పట్టుకుని ఎగిరేస్తే, మరొకరం పతంగి ఎగరేసాం. అయితే, ఏ రహస్యాన్నయినా ఎక్కువకాలం దాచలేమన్నది ఆ మర్నాడే తెలిసిపోయింది. ఆడపిల్లలం పతంగులు ఎగరేస్తుంటే.. చుట్టుపక్కల వాళ్లు కొంచెం ఆసక్తిగా పైకి చూసేసరికి.. ఆనందన్న, దేవన్న ఇద్దరూ ‘సంగతేమిటా!?’ అని పైకి వచ్చి చూసి, చిన్నమ్మకు కంప్లయింట్ చేసారు. మా పాలిటి దేవత అయిన చిన్నమ్మ.. “ఏమైతది? వాండ్లు ఏమన్న బయిటికి పోతున్నరా? మన బంగ్లా మీదనే ఎగురేస్తున్నరు గద, అయితె మానే తియ్యండి” అన్నది.
అయితే ఆ మర్నాడే వాళ్లింటి ముందు ‘గురుద్వారా’లో ఉండే ఓ సిక్కుల వాళ్లబ్బాయి మా పతంగీని మాంజాతో కట్ చేసాడు. “వాడేందే.. మనం ఆడిపిల్లలం. లేకలేక పతంగి ఎక్కిస్తే కటాయించిండూ?” అని లక్ష్మి రుసరుసలాడింది. అంతే కాదు.. “ఆ సిక్కులోండ్ల పిలగాండ్లు గాజు వక్కలు నూరి మాంజా తయారు చేస్తరు. అది ఎట్లాటి దారాన్ని గూడా తెంపుతది. మనం గూడా అట్లాంటిది తెద్దామా?” అంది. “ఆడేంది, మొగేంది.. పతంగుల దగ్గర! నాలుగు రోజుల ముచ్చటకు వేరే మాంజా ఎందుకు?” అన్నది హైమక్క. “నువ్వయితే ఎప్పటికి బయిటోళ్లదే రైటు అంటవు” అన్నది లక్ష్మి. మొత్తానికి ఆ పిల్లాడి పేరు ప్రీతం సింగ్ అని తెలుసుకొని, ఆ మర్నాడు అడిగితే.. “అయ్యో అక్కా! అది మీదనుకోలే! అబ్ దూస్రే లాకే దేవూ క్యా” అన్నాడతను ఎంతో వినయంగా. కానీ, వాడి నవ్వు వెనుక కొంటెతనం కనిపిస్తూనే ఉంది.
మా ఊరికి పండుగకు వెనక్కు వచ్చేటప్పుడు నేనుకూడా రెండు మంచి రంగుల పతంగులు, మాంజా, చర్ఖా కొని తెచ్చాను. “గివ్వెందుకే? పైసలు దండుగ! ఎక్కడ ఎగురేస్తవు?” అన్నది అమ్మ. ఇలాంటప్పుడు నేను ఆపద్బాంధవుడు మా నాన్న వైపు చూస్తాను. ఇప్పుడూ అదే చేసాను. “ఏమైతది? ఇంట్లనే ఉండి ఎక్కిస్తది గద! బయిటికి పోతున్నదా?” అన్నాడు నాన్న. అమ్మ మాట్లాడలేదు. ఓ శుభముహూర్తాన సరంజామా అంతా తీసుకుని మిద్దె మీదికి పోయాను. అప్పటికింకా మా డాబాపైకి మెట్లు కట్టలేదు. ఓ నిచ్చెన వేసి ఉండేది. చేతిలో పతంగి చినిగిపోకుండా చూసుకుంటూ దాన్ని ఎక్కి.. ‘పద పదవే వయ్యారి గాలిపటమా! చల్ చల్రే పతంగ్ మేరీ చల్ రే’ అంటూ తెలుగు, హిందీ భాషల్లో పాడుకుంటూ రెండు మూడు రోజులు మజామజాగా మాంజా పతంగితో ఎంజాయ్ చేసాను.
అయితే ఒకరోజు విధి వక్రించింది. నా కలలన్నీ కరిగిపోయి ఆకాశంలో హాయిగా ఎగురుతున్న పతంగి దారం తెగి నా కళ్లముందే పసుపు, గులాబీ రంగుల్లో, రెండు కళ్లతో ఎంతో అందంగా ఉన్న పతంగి కంటికి కనిపించకుండా పోయింది. అంతే! నాకు ఏమీ తోచలేదు. గబగబా నిచ్చెన దిగి చెప్పులు కూడా తొడుక్కోకుండా ఆ తోకతెగిన పతంగి పోయిన వైపు దానిలాగే పరిగెత్తాను. మా ఇంటివెనుక ఉన్న ముదిరాజుల ఇండ్లు దాటి, కాలిబాట దాటి, పొలాల గట్లు దాటి మెయిన్ రోడ్డు దాకా ఉరికీఉరికీ పోయాను. అప్పుడే రైలు వస్తున్న చప్పుడు వినిపించింది. నేను నిలబడ్డ రోడ్డుకూ, రైల్వే ట్రాక్కూ మధ్యన కొన్ని ఇళ్లు ఉంటాయి.
అంటే చూసుకోకుండా ఎంతోదూరం వచ్చానని అర్థమైంది. ఒక్కసారి ఆగి చుట్టూ చూసాను. పాలకుర్తికి వెళ్లే దారిలో ఓ వైపుగా నిలబడ్డ ఓ పిల్లగాడి చేతిలో నా పతంగి కనిపించింది. పరిగెత్తి వాడి దగ్గరికి వెళ్లి నిలబడ్డాను. ఆ పిల్లగాడు బెదురుతూ పతంగి ఇవ్వడానికి చెయ్యి చాపి.. “గీడ బడ్డది. ఎవ్వలు కండ్లబడక పొయ్యెటాలకు కొంచబోదామని తీసుకున్న” అన్నాడు. నాలోని కరుణా సముద్రం ఉప్పొంగింది. “అయితె మానె తియ్యి! నీకు దొరికింది నువ్వే ఉంచుకో!” అని వెనక్కు తిరిగాను. ఇంటికొచ్చి కాలి ముళ్లు తీసుకుంటుంటే.. “ఎటు పోయినవే! కాళ్లు గింత గనం కొట్కపోయినయ్!” అని నానమ్మ అడుగుతుంటే, అమ్మ వినకూడదంటూసైగ చేసాను.
నెల్లుట్ల రమాదేవి
రచయిత్రి