వాషింగ్టన్, జనవరి 17: తనకు వచ్చిన నోబెల్ శాంతి బహుమతిని వెనెజువెలా విపక్ష నేత మరియా కొరినా మచాడో గురువారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు అందజేయడం పట్ల విస్తృతంగా చర్చ జరుగుతున్నది. తనకు వచ్చిన నోబెల్ బహుమతిని మరొకరికి ఆమె ఇవ్వవచ్చా? అధికారికంగా అది చెల్లుతుందా? దీనిని నోబెల్ కమిటీ అంగీకరిస్తుందా? అంటూ పలువురు దీనిపై చర్చకు తెరతీయడంతో నోబెల్ కమిటీ తన మౌనాన్ని వీడింది. నోబెల్ శాంతి బహుమతిని ఎవరైతే గెల్చుకున్నారో వారికి శాంతి బహుమతితో విడదీయరాని సంబంధం ఉంటుందపి పేర్కొంటూ ట్రంప్ ఆమె నుంచి పతకాన్ని పొందడాన్ని చిన్నది చేసి చూపింది.
‘ఈ పతకం, డిప్లొమా, ప్రైజ్ మనీ వేరొకరి స్వాధీనంలోకి వచ్చినప్పటికీ శాంతి బహుమతి ఎవరికి ఇచ్చామో అది మారదు’ అని పేర్కొంది. నోబెల్ శాంతి బహుమతి గ్రహీతలపై, వారు అనుసరిస్తున్న రాజకీయ కార్యకలాపాలపై తాము వ్యాఖ్యానించబోమని స్పష్టం చేసింది. బహుమతి గ్రహీతలు తమకు వచ్చిన బహుమతి, పతకం, నగదు వినియోగంపై కమిటీ ఎలాంటి ఆంక్షలు, పరిమితులు విధించదని పేర్కొంటూ, గతంలో పలువురు గ్రహీతలు తమకు వచ్చిన పతకాన్ని అమ్మడం, వేలం వేయడం, ఇతరులకు ఇవ్వడాన్ని ప్రస్తావించింది.