జరిగిన కథ
కుసుమ శ్రేష్ఠి గురించిన ఒక ముఖ్య సమాచారం జయసేనునికి చెప్పలేక పోతుంది సౌగంధిక. మాధవుని మీద కత్తితో దాడి చేయబోయిన యువకుణ్ని అడ్డుకున్న పోటిసుడు.. అతనితోపాటు ఉన్న మిగతా వాళ్లందర్నీ ఏం కోరుకుంటున్నారో చెప్పమని అంటాడు. తర్వాత..
పోదన నగరంలో.. రోహ ఆవేదన తగ్గించేందుకు మరోమారు చల్లని నీళ్లు ఇచ్చింది అలసుద్ది. నీళ్లు తాగి, కొంచెం నెమ్మదించిన తర్వాత.. “అక్కా! ఏదైనా అనుకున్న వెంటనే జరిగిపోవాలంటే అది ప్రతిసారి సాధ్యం కాదు కదమ్మా! మాట వరసకు ఇప్పుడు.. ఇప్పటికిప్పుడు మామిడి పండ్లు కావాలంటే ఎక్కడ దొరుకుతాయి?” అంది అనునయిస్తున్నట్లుగా అలసుద్ది. “దొరకవు!” అన్నది రోహ. ‘హమ్మయ్య!’ అనుకున్నది సుద్ది. “కానీ, ఇప్పటికిప్పుడు వెళ్లాలంటే.. నువ్వు మల్లికాగిరికి వెళ్లవచ్చు!” మళ్లీ మొదటికే వచ్చింది రోహ. ఇక తప్పించుకోవడం అసాధ్యమని అర్థమైంది సుద్దికి. తప్పించుకోవడం సాధ్యం కానప్పుడు తప్పక కార్యం నెరవేర్చడమే సేవకులు చేయదగిన పని. అందుకే దృఢంగా అన్నది.. “సరే అక్కా! నీకోసం మల్లికాగిరికి పోతాను” అని. ఆనందంతో ఉక్కిరిబిక్కిరైంది రోహ. “నాకు తెలుసే! ఈ అక్క కోసం నీవు ఏమైనా చేస్తావని..” అంటూ ప్రేమతో సుద్దిని ఆలింగనం చేసుకున్నది. “నేను అక్కడికి పోయి ఏం చేయాలి అక్కా..” ‘అవును.. ఏం చేయాలి?’ తనలో తానే మననం చేసుకుంటున్నట్లు అన్నది రోహ. కొంచెంసేపు ఆలోచించుకొని.. “ఇక్కడ నేను ఎదుర్కొంటున్న అవమానాన్ని, అవస్థల గురించీ చెప్పు” “చెప్తే..” “మా నాయనగారు వస్తారు” “వచ్చి..” “వచ్చి.. వచ్చి..” “ఆఁ.. వచ్చి.. ఏం చేస్తారు?” “…” “ఇక్కడ మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెడుతున్నారు? ఎట్లా ఇబ్బంది పెడుతున్నారు? ఎవరు అవమానిస్తున్నారు? ఏమని అవమానిస్తున్నారు?..” “మరి నాకు ఎందుకింత బాధ కలుగుతున్నది? ఇంత దుఃఖం ఎందుకు?” “బుద్ధ దేవుడు అన్నట్లు దుఃఖానికి కారణం కోరికలే!
మీ కోరికలే మిమ్ములను దుఃఖపు నదిలోకి దొబ్బుతున్నాయి..” ఆలోచనలో పడిపోయింది రోహ. “అక్కా! ఇది నీ ఇల్లు! దీనికి నీవే రేపటి మహారాణివి. ఇంటి గుట్టును కడుపులో పెట్టుకొని, ఇంటిని చక్కబెట్టుకోవాల్సిన బాధ్యత నీదే! ఈ విషయం మీ అమ్మ గారింట్లో తెలిస్తే.. వాళ్లు మనస్తాపం చెందడం తప్ప ఏం చేయగలరు? అయినా చిన్నరాజా వారు తండ్రి రాలేని విషయం, వారిని తోలుకొని రావడానికి పోయిన పోటిసుని విషయం తెలియక ఎంతో తల్లడిల్లుతున్నారు. ఈ పరిస్థితుల్లో నీతో సుఖంగా గడుపగలరా? మనసు విప్పి మాట్లాడుకోగలరా? అందుకే తండ్రి గురించి తెలుసుకోవడానికి పోయినారు. ఈరోజు కాకపోతే రేపు తప్పక వస్తారు కదా! వచ్చేదాకా ఓపికతో ఎదురు చూడటం తప్ప మనం ఏం చేయగలం?” అలసుద్ది మాటల్లోని సత్యాన్ని గ్రహించేందుకు ప్రయత్నిస్తూనే.. “మరి, మా అత్త ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నది?” అన్నది రోహ. “అదే నాకు కూడా అంతు చిక్కడం లేదక్కా! ఈరోజు రాత్రి నేను ఇక్కడనే ఉంటాను. అణులచ్చి వెళ్లిన తర్వాత మహారాణి కంట పడతాను. నేను ఏమీ అడగకుండానే ఆమె అన్నీ నాకు చెబుతారు” రోహ హృదయం తేలికపడ్డది. “సుద్దీ.. ఎందుకో నాకు ఇక్కడ ఊపిరి ఆడుతున్నట్లు లేదే! నన్ను రేపు బయటికి వన విహారానికి తీసుకొని పో..” అన్నది. “సరే అక్కా! ఈ విషయం తేలనీ.. రేపు కాకపోతే ఎల్లుండి అయినా తప్పనిసరిగా వెళ్దాం. గౌతమీ నదీ తీరం చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది” అన్నది ఆనందంగా.
“అయితే సరే! మరి ఊళ్లో సంగతులు చెప్పు!” అన్నది ఉత్సాహంగా. ఆమెను అట్లా చూస్తుంటే అలసుద్దికి చాలా సంతోషంగా ఉంది. నిన్నటి పరిస్థితికి ఇప్పుడు చూస్తున్న దానికి ఎంతో తేడా ఉన్నది. అంతా కాల మహిమ! నిజంగానే కాలం ఎంతో శక్తివంతమైంది! “ఏందే? ఏదో చెప్తావు అనుకుంటే వెర్రిదానిలా నా మొఖం చూస్తున్నావ్?” అన్న రోహ మాటలకు ఉలిక్కిపడి, గబుక్కున తాను విన్న సంగతి ఇట్లా చెప్పడం ప్రారంభించింది అలసుద్ది. “నేను చెప్పే ఈ విషయం విని, నన్ను ఏమీ అనకూడదు మరి..” “సరే! ఏమీ అననులే.. చెప్పు!” “పడమటి వీధిలో దేవాంగ అనే కొత్త కోడలు ఉంది. కొత్తగా కాపురానికి వచ్చిందని ఆమెను ఇంట్లోనే పెట్టి, మిగతా వాళ్లంతా తెల్ల గోధుమ కోయడానికి రాత్రిపూట మలిజాము వేళనే చేనుకు వెళ్లినారు. ఆమె నిద్రపట్టక అటూ ఇటూ మసులుతున్నది. పక్క ఇంటిలో ఒక కాపు యువకుడు ఉండటం గమనించింది. అమాయకంగా అతనికి వినిపించేలా ఇట్లా అన్నదట దేవాంగ.. ఇంట నెవరు లేరు; ఒంటరి దానను! చీకటింట నొంట చేరె భయము. దొంగలెవ్వరైన దోచంగ వచ్చేరు కునుకు తీయవలదు కోడె కాడ! (ఇంట్లో ఎవరూ లేరు; చీకటి ఇంట్లో, ఒంట్లో భయం పేరుకొని పోయింది. దొంగలు ఎవరైనా దోచుకోవడానికి వస్తే నా పరిస్థితి ఏమవుతుంది?! అందుకే పక్కింట్లో ఉన్న యువకుడా! నీవు నిద్రపోవద్దు!)”.. పగలబడి నవ్వింది రోహ. ఎంతో సంతోష పడ్డది అలసుద్ది. వాళ్ల సంతోషం ఎంతకాలం నిలుస్తుందో చెప్పడం కష్టం.
“సౌగంధిక చాలా మంచిది కదా!” గుర్రాలు వేగం అందుకుంటూండగా అన్నాడు వామదేవుడు. “నిజమే దేవా! నీవుకూడా మంచివాడివే! లేకుంటే ఇప్పుడు నావెంట వచ్చేవాడివి కాదు కదా!” జరిగిన సంఘటనను నెమరు వేసుకుంటూ అన్నాడు జయసేనుడు. “రేపు నేను చిలుకవాడకు వచ్చి సౌగంధికను కలుసుకుంటాను. తను ఒప్పుకొంటే పెండ్లాడాలని ఉంది జయా!” మనసులో మాట బయట పెట్టినాడు దేవ. “తథాస్తు! మీ పెళ్లి నేనే దగ్గరుండి జరిపిస్తాను!” గుర్రాలు వేగం అందుకున్నాయి.. ఒకరి మాటలు మరొకరికి వినిపించడం లేదు. మరో గడియలో మల్లసు పర్వతం చేరుకున్నారు వాళ్లు. కానీ.. అక్కడి దృశ్యం వాళ్లను భయకంపితులను చేసింది. తీరంలో సరుకులతో ఉన్న ఓడ తగలబడి పోతున్నది. సముద్రపు దొంగలు సరుకులను దోచుకొని పోవడానికి వచ్చినారు. ఓడలోని సిబ్బంది తిరగబడ్డారు. భయంకరమైన పోరాటం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. కర్మచారులు ఒకపక్క మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తుంటే.. దొంగలు అందిన కాడికి దోచుకుంటున్నారు.
ఒక్క చూపులో అంతా గ్రహించినాడు జయసేనుడు. “దేవా! మనం ఇంకొంచెం ముందు వస్తే, ఈ నష్టం చాలావరకు నివారింపబడేది. అయినా పర్వాలేదు ఈ దొంగలు ఒక్కడు కూడా మిగలకూడదు. దొరికినోడిని దొరికినట్టు కత్తికి ఎర గావించాల్సిందే!” అంటూ ఒరలో నుండి కత్తి తీసి, కాలుతున్న ఓడ మీదికి దూకినాడు. పని వాళ్లలో ముఖ్యమైన వాడు జయసేనుణ్ని చూసినాడు. “అయ్యారే! చిన్నరాజా వారు వచ్చినారు. మనకు ఇంక భయం లేదు. దొంగలను ఒక్కడిని కూడా వదలకూడదు. జై కోదండ రామా!” దిక్కులు పిక్కటిల్లేటట్లు అరచినాడు. వాళ్ల ఉత్సాహం వందరెట్లు ఎక్కువయింది. అదే సమయంలో.. “దేవా! నాయన గారు కనిపిస్తారేమో.. నీవు అటువైపు వెతుకు. నేను వీళ్ల పని పడుతూనే నాయన గారిని ఈ వైపున వెతుకుతాను” అంటూ తన వాళ్లలో స్ఫూర్తి నింపుతూ.. దొంగలను దొరికిన వాణ్ని దొరికినట్లు కత్తికి ఎర గావిస్తున్నాడు జయసేనుడు. వాళ్ల హాహాకారాలతో సముద్రం ప్రతిధ్వనిస్తున్నది. తీరంలోని నీళ్లు ఎర్రగా మారుతున్నాయి. ఇదంతా నిస్సహాయుడై చూస్తున్న మరో వ్యక్తి కుసుమ శ్రేష్ఠి.. అక్కడే ఉన్నాడు!
కుసుమ శ్రేష్ఠిని స్వయంగా మహామంత్రి ఈసాణుడు తోడుకొని వచ్చినాడు. కాకపోతే, బందీగానే.. నిరాయుధుణ్ని చేసి, నలుగురు బలిష్టులైన భటులకు అప్పగించి, అమాత్యులు ఎక్కడికో వెళ్లినారు. కళ్లముందే తన సంపద అంతా బుగ్గి పాలవుతుంటే హఠాత్తుగా కుసుమ శ్రేష్ఠి మాట పడిపోయింది. శ్రేష్ఠి బలవంతుడే కానీ.. మూడు వారాలుగా నిరాహారంతో నీరసించిపోవడం అతణ్ని శారీరకంగా బలహీనుని చేయగా; రాచ మర్యాదల స్థానంలో ఒక నేరస్తుడిగా పరిగణించడం, తలకు మించిన సుంకం చెల్లించేటట్లు చేయడం అతని మీద మానసిక ఒత్తిడిని పెంచింది. ఇది చాలదన్నట్లు ఓడలోని సరుకులు అగ్నికి ఆహుతి కావడం చూసి తట్టుకోలేకపోయినాడు. నాడీ వ్యవస్థలోని అలజడి అతని మాట పడిపోయేటట్లు చేసింది! సరిగ్గా అప్పుడే జయసేనుడు, వామదేవుడు అక్కడికి వచ్చినారు. దొంగలపై దాడి చేసినారు. తనకోసం అణువణువు వెతుకుతున్న కొడుకు జయసేనుడు కళ్లముందే ఉన్నా పలకరించలేని దుస్థితిలో కన్నీరు మున్నీరైనాడు కుసుమ శ్రేష్ఠి. భటులను తప్పించుకొని వెళ్లగలిగే శక్తి లేక, వాళ్లకు చెప్పే అవకాశం లేక పెనుగులాడుతూ, విలవిల్లాడుతుండగానే జయసేనుడు తండ్రి కోసం గాలిస్తూ అక్కడి నుండి దూరంగా వెళ్లినాడు. మూగగా రోదిస్తూ కుప్పకూలినాడు కుసుమ శ్రేష్ఠి. ఆ వెంటనే స్పృహ కోల్పోయినాడు. అతణ్ని భటులు చిలుకవాడలో విశ్రాంతి తీసుకుంటున్న ఈసాణుడి వద్దకు తీసుకొని పోయినారు.
మునిపల్లెలో.. పోటిసుని మాటలతో, మాధవుని సంయమ శీలంతో వేదిక మీద ఉద్రిక్తత తగ్గింది. క్షత్రియ యువకునితోపాటు ఒక బ్రాహ్మణుడు, వణిక్ ప్రముఖుడు, వాళ్ల అనుయాయులు తమను పరిచయం చేసుకున్నారు. వరుసగా సమరణుడు (క్షత్రియుడు); కలసగంధుడు (బ్రాహ్మణుడు); సిరి రాయుడు (వ్యాపారి); ఖండుడు, విక్కిరుడు, కుల పుత్తుడు, పాలితుడు, సీహుడు అనుచరగణం. “మీ సందేహాలన్నీ నివృత్తి చేయడానికి గురువుగారు ఉన్నారు. ప్రశాంతంగా అడగండి! మాలో లోపాలుంటే మేము సవరించుకుంటాం. అంతిమంగా మేం కోరుకునేది మానవ జీవనం ఆనందమయం, శాంతి మయం చేయడమే!” అన్నాడు వాళ్లనుద్దేశించి సాధనానందుడు. ఆ మాటలకు పగలబడి నవ్వినాడు సమరణుడు. “మనం శాంతి మంత్రం చదువుతూ కూర్చుంటే శత్రువు ఊరుకుంటాడా? మన తల నరికి భూమికి రక్తాభిషేకం చేస్తాడు! మన ధనాన్ని, సంపదను దోచుకుంటాడు; స్త్రీలను అవమానిస్తాడు; మందిరాలను ధ్వంసం చేస్తాడు.. అప్పుడు వర్ణవ్యవస్థ నిర్వీర్యమై, ఆసురీతత్వం విజృంభించి, అల్లకల్లోలం చెలరేగుతుంది కదా!” అన్నాడు అరుస్తున్నట్లుగా. వేలాది మందిని ఆ మాటలు ఆలోచింప జేసినై. అంతవరకు ఆ క్షత్రియ యువకుణ్ని మూర్ఖుడిగా భావించిన వాళ్లే.. “నిజమే! నిజమే!” అని అభినందించ సాగినారు. మాధవుడు దీనికి ఏం సమాధానం చెబుతాడోనని అంతా ఎదురుచూస్తున్నారు.
కళ్లముందే తన సంపద అంతా బుగ్గి పాలవుతుంటే హఠాత్తుగా కుసుమ శ్రేష్ఠి మాట పడిపోయింది. శ్రేష్ఠి బలవంతుడే కానీ.. మూడు వారాలుగా నిరాహారంతో నీరసించిపోవడం అతణ్ని శారీరకంగా బలహీనుని చేయగా; రాచ మర్యాదల స్థానంలో ఒక నేరస్తుడిగా పరిగణించడం, తలకు మించిన సుంకం చెల్లించేటట్లు చేయడం అతని మీద మానసిక ఒత్తిడిని పెంచింది. ఇది చాలదన్నట్లు ఓడలోని సరుకులు అగ్నికి ఆహుతి కావడం చూసి తట్టుకోలేకపోయినాడు.