ఆధునిక కాలంలో విశ్వవిద్యాలయాలు అత్యంత గొప్ప ఆవిష్కరణలు. నిరంతర పరిశోధనలు, సృజనాత్మకమైన ఆలోచనలకు వేదికైన ఈ విద్యాలయాలు నవీన జీవన విధానానికి మార్గదర్శనం చేస్తాయి. విశ్వవిద్యాలయాలంటే వ్యవస్థాగతమైన భావ సముచ్ఛయాలు. విశ్వవిద్యాలయాలు ఆలోచనలకు కేంద్రం అనుకున్నప్పుడే ఒక జాతి మేధోపరమైన ఔన్నత్యం ద్యోతకమవుతుంది. అందువల్ల ఆలోచించే మెదళ్లను ప్రోత్సహిస్తేనే జాతి నైతిక, సాంస్కృతిక, మేధోపర ఔన్నత్యం విలసిల్లుతుంది. స్థూలంగా విశ్వవిద్యాలయాలు సృజనాత్మక భావాలు కలిగిన విభిన్నమైన ఆలోచనలకు అవకాశం ఇవ్వాలి.
కస్తూరి రంగన్ పొందుపరిచిన సాంకేతిక ఆలోచనలు, ప్రభుత్వ సరికొత్త విధానాల రూపకల్పనతో,మానవేతిహాసానికి పునాదులను నిర్మించాల్సిన వర్సిటీలు 2020 జూలై 28న కేంద్రం ప్రకటించిన నూతన విద్యా విధానం (ఎన్ఈపీ)లో ప్రొఫెసర్స్ ఆఫ్ ప్రాక్టీస్ వ్యవస్థతో మసకబారనున్నాయి.
కళ తప్పుతున్న విశ్వవిద్యాలయాలు: కేంద్ర ప్రభు త్వ నిర్లక్ష్యం వల్ల నేడు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఒకప్పటి మాదిరిగా ఉన్నతస్థాయి ఆలోచనలు సృష్టించే కేంద్రాలుగా కాకపోయినా, కనీసం సాధారణ ఆలోచనల పరంపరలకు వేదికలుగా ఉండకపోవడం విషాదం.
నూతన విద్యా విధానం విదేశీ సంస్థలకే ప్రాధాన్యం ఇస్తున్నది. ఈ క్రమంలో విశ్వవిద్యాలయాలను కాషాయీకరించడానికి ఉన్నత విద్యాలయాలను ఛాందసవాద భావజాల ఉత్పత్తి కేంద్రాలుగా తీర్చిదిద్దడానికి, తమ అనుకూల శక్తులను జొప్పించడానికి కేంద్రం యత్నిస్తున్నది. అందుకే జ్ఞానరహిత మేధావుల ను అంటే కేవలం స్వీయానుభవాల నైపుణ్యాల ఆధారంగా ప్రొఫెసర్స్ ఆఫ్ ప్రాక్టీస్ వ్యవస్థను ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాన్ని ముమ్మరం చేసింది. ఈ కొత్త కేటగిరీ ఫ్యాకల్టీ పోస్టుల కింద యూనివర్సిటీలు, కాలేజీలు త్వరలో పరిశ్రమ నిపుణులను నియమించుకోవచ్చని ఎన్ఈపీ పేర్కొన్నది. ఈ ముసాయిదాను ప్రజాభిప్రాయానికి పంపినా, ప్రజల అభిప్రాయాలకు కట్టుబడతామని ఎక్కడా వివరణ ఇవ్వలేదు. ఇంజినీరింగ్, సైన్స్, టెక్నాలజీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, సామాజిక, ఆర్థికశాస్ర్తాలు మొదలై సబ్జెక్టులు, కోర్సుల్లో ఆయా రంగాలకు చెందిన విశిష్ట నిపుణులను ఈ కొత్త ఫ్యాకల్టీ కేటగిరీలో తీసుకుంటారు.
అకడమిక్ అర్హత పరిగణనలోకి తీసుకోరు: కనీసం పదిహేనేండ్ల పాటు నిరూపితమైన, నైపుణ్యం కలిగిన నిపుణులు ఈ పోస్టులకు అర్హులు. అభ్యర్థికి ‘అనుకూలమైన’ వృత్తిపరమైన అభ్యాసం ఉంటే ఎటువంటి అధికారిక విద్యార్హతలు పరిగణనలోకి తీసుకోనవసరం లేదని మార్గదర్శకాలు సూచిస్తున్నాయి. ఈ నిపుణులు ప్రొఫెసర్ స్థాయిలో అధ్యాపకుల నియామకం కోసం నిర్దేశించిన ఇతర అర్హత ప్రమాణాల నుంచి కూడా మినహాయించబడతారు అని ముసాయిదా మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఇప్పటికే అధ్యాపక వృత్తిలో ఉన్నవారికి ఈ పోస్టులు అందుబాటులో ఉండవు.
ప్రాక్టీస్ ప్రొఫెసర్లను ఎంపిక చేసే విధానాన్ని వివరిస్తూ, సంస్థల అధిపతి ప్రముఖ నిపుణుల నుంచి నామినేషన్లను ఆహ్వానిస్తారని మార్గదర్శకాలు పేర్కొంటున్నాయి. ఇద్దరు సీనియర్ ప్రొఫెసర్లు, ఒక ప్రముఖ బయటి సభ్యునితో కూడిన ఎంపిక కమిటీ సూచనలను పరిశీలిస్తుంది. దాని సిఫారసుల ఆధారంగా, చట్టబద్ధమైన సంస్థలు నిర్ణయం తీసుకుంటాయని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ప్రాక్టీస్ ప్రొఫెసర్‌గా చేరిన ప్రారంభంలో ఏడాది వరకు ఉండవచ్చు, తర్వాత అది పొడిగించవచ్చు. ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ సర్వీస్ గరిష్ట వ్యవధి మూడేండ్లకు మించకూడదు. అయితే ఈ కొత్త రకం ప్రొఫెసర్ల వల్ల అకడమిక్ అర్హత ఉన్నవారికి అన్యాయం జరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతున్నది.
ఈ నిబంధనలు జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) 2020 అమలులో ఒక భాగమని, ఇది పరిశ్రమలు, దేశ ఆర్థిక అవసరాలను తీర్చడానికి నైపుణ్య ఆధారిత విద్యపై దృష్టిసారిస్తుందని యూజీసీ చైర్మెన్ జగదీష్‌కుమార్ వక్ర భాష్యం చెప్తున్నారు. ఒక అవ్యవస్థను వ్యవస్థీకృ తం చేయడానికి ఫాసిస్టు ప్రభుత్వాలు ఎప్పుడూ నిజం చెప్పవు. కనుకనే ప్రొఫెసర్స్ ప్రాక్టీస్ ఆఫ్ వ్యవస్థ పర్యవసానాలను బయటపెట్టకుండా ఎన్ఈపీ ద్వారా బీజేపీ సంఘ్‌పరివార్ శక్తుల దీర్ఘకాలిక ప్రణాళిక అమలుకు పూనుకున్నాయి. నిజానికి క్షేత్రస్థాయిలో ఉత్పన్నమయ్యే సమస్యల పరిష్కారానికి, శాస్త్రీయ పురోభివృద్ధికి కావలసిన భూమికను ఉన్నత విద్యాలయాలు పరిశోధనల ద్వారా చర్చించి సానుకూల పరిష్కారాలకు ఆవిష్కరించాల్సి ఉంటుంది.
దీనికి మేధోపరమైన జ్ఞానానుభవం ఎంతో కావాల్సి ఉండగా, కేవలం ఛాందసవాద హిందూత్వ భావజాల వ్యాప్తికి, కార్పొరేట్ దేశీయ బహుళజాతి కంపెనీల అభివృద్ధికి ఆయా రంగా ల్లో నిపుణుల పేర ఉన్నతస్థాయి విద్యాలయాల్లో తమవారిని నియమించుకొని తమ అనుకూల విధానాల రూపకల్పనలో వారిని ప్రధాన పాత్రధారులను చేయడానికే ఈ ప్రొఫెసర్స్ ఆఫ్ ప్రాక్టీస్ పోస్టుల సృష్టి అని మేధావి వర్గం గ్రహించాలి. ఈ వ్యవస్థ రూపకల్పనను ఆదిలోనే అడ్డుకోకపోతే విశ్వవిద్యాలయాలు రాజకీయ పాలకవర్గాల మేధో బానిసలతో నిండి దేశం శతాబ్దాల వెనుకబాటుతనానికి గురయ్యే ప్రమాదం పొంచి ఉన్నది.
(వ్యాసకర్త: అసిస్టెంట్ ప్రొఫెసర్, తెలంగాణ విశ్వ విద్యాలయం)
-డాక్టర్ ఎ.పున్నయ్య
99480 17934