ధర్మం అనే మాటకు స్వభావం అని అర్థం. సూర్యుడు తూర్పున ఉదయించడం, నీరు పల్లానికి ప్రవహించడం స్వభావ లక్షణాలు. అలాగే మానవ జీవితం సుఖ సంతోషాలతో ఉండాలని ప్రాచీన కాలం నుంచి మహనీయులు ఆలోచించి కొన్ని పరిష్కారాలు తెలిపారు. ధర్మం వల్ల సుఖం, అధర్మం వల్ల దుఃఖం కలుగుతాయి. లౌకికంగా ధర్మం ఆచార వ్యవహార రూపమైనది.‘యద్య దాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః’ అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు, పెద్దలు దేనిని ఆచరిస్తారో దాన్నే పిల్లలు అనుసరిస్తారు. అంటే పెద్దలు ధార్మికులు అయితే తర్వాతి వారు పెద్దల్ని అనుసరించి ధర్మాన్ని అనుసరిస్తారు అని దీని అర్థం.
చదవడంలో, సంపాదించడంలో, జీవనం గడపడంలో మనిషి ధర్మం పరిధిని దాటి ప్రవర్తించరాదన్న పెద్దల మాటను మనం అనేక పురాణాల ద్వారా తెలుసుకున్నాం. ‘ధర్మే సర్వం ప్రతిష్ఠితం’- అంటే ధర్మంలోనే అన్నీ ఇమిడి ఉన్నాయి అని చెప్పడమే కాకుండా, అర్థకామాల కంటే ధర్మం చాలా గొప్పదని కూడా చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో పురోభివృద్ధి సాధించాలంటే, కొన్ని నీతి నియమాలను పాటించాలి. అప్పుడే మనిషి మనీషిగా మారతాడు. శ్రీరాముడు మానవుడిగా పుట్టి ధర్మాన్ని అనుసరించి ఆదర్శ పురుషుడు అయ్యాడు. అందుకే ‘రామో విగ్రహవాన్ ధర్మః’ అన్నారు. అలాంటి ధర్మపరులే మన రుషులు. వారు ధర్మాన్ని అనుసరించి తెలిపిన సూత్రాలే ధర్మ నియమాలు. పరాశరుడు, శంఖుడు, లిఖితుడు, యాజ్ఞవల్క్యుడు మొదలైన వారు ఎన్నో ధర్మసూత్రాలను తెలియజేశారు. వారు రాసిన గ్రంథాలే ధర్మశాస్ర్తాలు. వీటినే మనం ‘స్మృతులు’ అంటున్నాం.
అందరూ సుఖం కావాలనుకుంటారు. సుఖం శాంతిలో ఉంది. శాంతి సామరస్యంలో ఉంది. సామరస్యం ధర్మంలో ఉంది. ధర్మం పుణ్యం వల్ల వస్తుంది. ధర్మం కానిది అధర్మం. దీనివల్ల పాపం వస్తుంది. ‘అష్టాదశ పురాణానాం వ్యాసస్య వచన ద్వయం, పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం’ అంటే పరోపకారం ధర్మం. పరుల్ని హింసించడం అధర్మం. ‘ధర్మేణహీనాః పశుభిస్సమానః’- అంటే ధర్మం లేనివాడు పశువుతో సమానం. యుక్తాయుక్తాలు తెలుసుకొని ధర్మమార్గంలో నడిచే వాళ్లకు ఈ లోకంలో కీర్తి, పరలోకంలో ఉత్తమగతి లభిస్తాయి. ‘ధర్మ ఏవహతోహంతి, ధర్మో రక్షతి రక్షితః’ అని మనుస్మృతిలో చెప్పినట్లు, ధర్మాన్ని మనం చెరిస్తే అది మనల్ని చెరుస్తుంది. అలాగే ధర్మాన్ని మనం కాపాడితే, ధర్మం మనల్ని కాపాడుతుంది.
– వేదార్థం మధుసూదన శర్మ, 90638 87585