హైదరాబాద్ : బీఆర్ఎస్ ( BRS ) తెలంగాణ అస్థిత్వం, ఆత్మగౌరవమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ( Singireddy Niranjan Reddy ) అన్నారు.బీఆర్ఎస్ గద్దెలు కూల్చాలన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అర్థరహితం, అవివేకమని ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని వందమీటర్ల లోతున బొందపెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు.
గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మీద దుష్ప్రచారం, కాంగ్రెస్ పార్టీ హామీలు నమ్మి ప్రజల మోసపోయారని పేర్కొన్నారు. కాంగ్రెస్, టీడీపీ పాలనలో అసమానతలు, వివక్ష మూలంగానే తెలంగాణ ఉద్యమం మొదలయిం దని, వీరి మోసాల కారణంగానే తెలంగాణ బిడ్డలు అమరులయ్యారని వివరించారు. ప్రజలు కాంగ్రెస్ గద్దెలు కూల్చే సమయం ఆసన్నమైం దని మాజీ మంత్రి అన్నారు.
తెలంగాణలో ఉన్న కొద్దిమంది ఓట్ల కోసం టీడీపీ గురించి రేవంత్ రెడ్డి మొసలికన్నీరు కారుస్తున్నాడని విమర్శించారు. టీడీపీ ఇండియా కూటమిలో ఉందా ? బీజేపీ కూటమిలో ఉందా ? అసలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీయేనా ? టీడీపీ పార్టీనా ? తేల్చు కోవాలని సూచించారు.ఓట్ల కోసం నాటకాలు ఆడితే అన్ని సార్లు ప్రజలు నమ్ముతారు అనుకోవడం అవివేకమని తెలిపారు.
సీఎం హోదాలో ఉండి చిల్లరకూతలు కూయడం రేవంత్ రెడ్డి మానసిక స్థితికి అద్దం పడుతుందని ఆరోపించారు. సహచర మంత్రులతో ఉన్న విభేదాలతో ఏం చేయాలో పాలుపోక వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఈ వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నామని పేర్కొన్నారు.