అరవై ఏండ్లు ఉమ్మడి పాలనలో చిక్కిశల్యమైన తెలంగాణ ఇప్పుడిప్పుడే స్థిరాభివృద్ధి వైపు పయనిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. తాగు, సాగునీరు లేక అల్లాడిన తెలంగాణ నేడు కాళేశ్వర జలాలతో కళకళలాడుతున్నది. రైతుబంధుతో విరాజిల్లుతున్నది. రైతుబీమాతో ధీమాగా బతుకుతున్నది. నాడు కాలువ కిందికి కూలీకి పోయి గింజలు తెచ్చుకున్న తెలంగాణ నేడు ధాన్యపు సిరులతో తళుకులీనుతున్నది.
కరోనా కాలంలో ఉపాధి కోల్పోయిన వందలాది కుటుంబాలు పల్లెలకు చేరుకున్నయి. కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు పేరిట ఎకరానికి రూ.10 వేలు ఇచ్చే పెట్టుబడితో తమకున్న భూముల్లో పంటలు పండించుకుంటున్నా యి. పక్క రాష్ర్టాల్లో డిపాజిట్లు కూడా రాని పార్టీ నాయకులు కేంద్రంలో చక్రం తిప్పుతూ నిధులు తెచ్చుకొని వారి రాష్ర్టాల అభివృద్ధికి పాటుపడుతున్నారు. కానీ, తెలంగాణ ప్రతిపక్ష నాయకులు రాష్ర్టాభివృద్ధి కోసం కాకుండా ప్రశాంతంగా ఉన్న రాష్ర్టాన్ని అగ్ని గుండంలోకి నెట్టడానికి శత విధాలా ప్రయత్నిస్తున్నారు. కేంద్రంలో పూర్తిగా విఫలమైన మోదీ నేతృత్వంలోని కార్పొరేట్ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని ఏనాడో మరిచిపోయింది.
రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నది. ఉప ఎన్నికలను ఎరగా చూపి ఢిల్లీ నుంచి వచ్చే రాబందులకు తెలంగాణ గద్దలు తోడై రాష్ట్రంలో మత విద్వేషాలకు ఆజ్యం పోస్తున్నాయి. కానీ తెలంగాణ నేల హిందూ-ముస్లింల ఐక్యతకు చిహ్నం. సాయుధ పోరాట సమయంలో తల్లిదండ్రులు అజ్ఞాతంలోకి వెళ్తే వారి పిల్లలకు పాలిచ్చి పెంచిన ముస్లిం తల్లులున్న మానవత్వపు నేల ఇది. హిందువుల ఇండ్లలో శుభకార్యాలకు వచ్చే తమ ముస్లిం సోదరులకు హలాల్ చేసిన విందు భోజనం వడ్డించే మమతానురాగాల నేల నా తెలంగాణ. ఈ మట్టి లో పుట్టిన ఏ బిడ్డా మత రాజకీయాలను సహించడు.
ఫ్లోరైడ్ రక్కసితో ఇరవై ఏండ్లకే కాళ్లు చేతులు పడిపోయి అంపశయ్యపై ఉన్న ప్రజల నోటిలో జీవ గంజిపోసిన నాయకుడు కేసీఆర్. అరవై ఏండ్లలో ఏ పార్టీ నాయకుడు తీర్చలేని సమస్యను తీర్చి ఖలేజా ఉన్న నాయకుడనిపించుకున్నారు. ఈ నిజాలు ఒప్పుకోవడానికి ప్రతిపక్షాలకు మనసు రావడం లేదు. ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది మాకు కేసీఆర్ ఉన్నాడనే ధీమాతో జీవిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఈ రోజు దేశ ప్రజలందరు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నా రు. మనమెందుకు తినే తిండిలో మన్ను పోసుకోవాలి. ఈ గద్దలు, రాబందుల నుంచి ఈ రాష్ర్టాన్ని కాపాడే శక్తి ఒక్క కేసీఆర్‌కే ఉంది. అందుకే ఆయన వెంట మనమందరం నడువాలి.
(వ్యాసకర్త: ప్రభుత్వ ఉపాధ్యాయురాలు)
-పి.లీల
94913 69529