Amla Juice Or Amla | విటమిన్ సి ఎక్కువగా ఉండే వాటిల్లో ఉసిరి ఒకటి. ఉసిరి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న సంగతి మను తెలిసిందే. దీనిని అనేక సంవత్సరాలుగా ఆయుర్వేదంలో వివిధ రకాల అనారోగ్య సమస్యలకు ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ఉసిరి చిన్నగా ఉన్నప్పటికీ దీనిని తీసుకోవడం వల్ల మొత్తం ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. దీనిని రోజూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. వైద్యులు కూడా ఉసిరిని ఆహారంలో భాగంగా రోజూ తీసుకోవాలని సూచిస్తున్నారు. మనలో చాలా మంది ఉసిరిని రోజూ ఆహారంగా తీసుకుంటున్నారు. అలాగే కొందరు ఉసిరికాయ జ్యూస్ ను రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకుంటున్నారు.
అయితే ఉసిరిని నేరుగా తీసుకోవడం మంచిదా.. దీనిని జ్యూస్ రూపంలో తీసుకోవడం మంచిదా.. అన్న సందేహం మనలో చాలా మందికి వస్తుంది. అసలు ఉసిరిని పచ్చిగా తీసుకోవడం మంచిదా.. ఉసిరి రసాన్ని తీసుకోవడం మంచిదా.. దీని గురించి వైద్య నిపుణులు ఏమంటున్నారో.. ఇప్పుడు తెలుసుకుందాం. ఉసిరికాయ, ఉసిరి రసం రెండూ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి రెండు కూడా యాంటీ ఆక్సిడెంట్లను పుష్కలంగా కలిగి ఉంటాయి. అయితే ఉసిరికాయలో పీచు పదార్థం ఉంటుంది. దీనిని నేరుగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియకు మేలు కలుగుతుంది. మలబద్దకం సమస్య తగ్గుతుంది. ఉసిరి జ్యూస్ లో ఫైబర్ ఉండదు. కానీ ఇది శరీరానికి త్వరగా అందుతుంది, దీనిని తీసుకోవడం కూడా చాలా సులభం.
అలాగే ఉసిరికాయలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కొంచెం కూడా ఇవి వృథా కావు. ఉసిరి రసంలో పోషకాలు తగ్గే అవకాశం ఉంటుంది. గాలికి, వేడికి విటమిన్ సి తగ్గే అవకాశం ఉంటుంది. పచ్చి ఉసిరికాయలో ఉండే పోషకాలు శరీరానికి అందడానికి సమయం ఎక్కువగా పడుతుంది. ఉసిరి రసంలో ఉండే పోషకాలు వేగంగా రక్తంలోకి చేరతాయి. ఉసిరికాయలను నేరుగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. ఉసిరి రసాన్ని ఒకేసారి ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. ఇక ఉసిరికాయలు మనకు సీజన్ లో మాత్రమే దొరుకుతాయి. అన్ని వేళల్లా ఇవి దొరకడం కష్టం. కానీ ఉసిరి రసం మనకు అన్ని వేళలా లభిస్తుంది.
బరువు తగ్గాలనుకునే వారు, మలబద్దకం సమస్యతో బాధపడే వారు, షుగర్ వ్యాధితో బాధపడే వారు ఉసిరిని తీసుకోవడం మంచిది. రోగనిరోధక శక్తి కోసం, శరీర డిటాక్సిఫికేషన్, జుట్టు ఆరోగ్యం కోసం ఉసిరి రసాన్ని తీసుకోవడం మంచిది. అయితే ఉసిరికాయలను నేరుగా తినలేని వారు రోజూ 20 లేదా 30 ఎంఎల్ జ్యూస్ ను తీసుకోవడం మంచిది. మన శరీరానికి ఉసిరికాయలు, ఉసిరి రసం రెండూ మంచివే అయినప్పటికీ ఉసిరికాయలను నేరుగా తీసుకోవడం మరింత మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక ఉసిరి రసాన్ని తీసుకోవాలనుకునే వారు దీనిని ఇంట్లోనే తయారు చేసి తీసుకోవడం మంచిదని కూడా వారు తెలియజేస్తున్నారు.