దేశ భద్రతకు ఆయుధం ఎంత అవసరమో ఆహారం అంతకన్నా అవసరం. అందుకే విజ్ఞులైన పాలకులు గడ్డు పరిస్థితుల్లోనూ ప్రజలకు ఆహార కొరత లేకుండా చూసుకుంటారు. ధాన్య సంపదలో స్వయం పోషకత్వానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. పాలకుల అనాలోచిత నిర్ణయాల వల్ల శ్రీలంక ఎంత సంక్షోభంలో కూరుకుపోయిందో చూస్తూనే ఉన్నాం. మోదీ ప్రభుత్వ వ్యవహార సరళి కూడా ఇదే విధంగా ఉండటం, ప్రత్యేకించి ఆహార రంగంలో ముందు చూపు లేకుండా సంకుచిత రాజకీయ దృక్కోణంతో వ్యవహరించడం భయాందోళనలను కలిగిస్తున్నది. దేశంలో అహార ధాన్యాలు నాలుగేండ్లకు సరిపడేలా ఉన్నాయంటూ కేంద్ర మంత్రి ఒకరు బీరాలు పలికి ఎంతో కాలం కాలేదు. ఇప్పుడు హఠాత్తుగా కేంద్రం బియ్యం ఎగుమతులను తగ్గించడానికి సుంకం విధించడమే కాకుండా, నూకలపై ఏకంగా నిషేధాన్ని విధించడం అసమర్థ పాలనకు ప్రత్యక్ష తార్కాణం.
ఉమ్మడి రాష్ట్ర పాలనలో తెలంగాణ నిండా బీడు భూములుండేవి. కానీ రాష్ట్ర అవతరణ తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపు కారణంగా నేడు ఏ మూల చూసినా పుడమి పచ్చని పంటలతో అలరారుతున్నది. రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ రైతులను మనసారా అభినందించవలసిన కేంద్ర ప్రభుత్వం సంకుచిత రాజకీయాలకు దిగింది. ఒకవైపు ధాన్యం కొనకుండా మొండికేసింది. మరోవైపు బీజేపీ రాష్ట్ర శాఖ రైతులను పక్కదారి పట్టించి, రెచ్చగొట్టాలనే స్థాయికి దిగజారింది. రైతుల నుంచి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. అయినా బియ్యాన్ని సేకరించకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనే కుతంత్రమే తప్ప రైతు సంక్షేమం ప్రధానమనే విశాల దృక్పథం కేంద్రానికి కొరవడింది. ఈ నిర్వాకం చాలదన్నట్టు దేశవ్యాప్తంగా రైతులు వరి పంట మానుకునే విధంగా నిరుత్సాహపరిచింది. రాష్ట్ర ప్రభుత్వాలపై ఈ మేరకు ఒత్తిడి తెచ్చింది. ఈ అనాలోచిత నిర్ణయాల ఫలితంగానే ఇప్పుడు బియ్యం ఎగుమతులను కట్టడి చేయవలసిన పరిస్థితి.
మోదీ అధికారంలోకి రాకముందే మన దేశం ఔషధ రంగంలో వెలిగిపోతున్నది. కరోనా పెచ్చరిల్లినప్పుడు ఇతర దేశాలకు వ్యాక్సిన్లను సరఫరా చేసే సామర్థ్యాన్ని సంతరించుకోగలిగింది. ఇప్పుడు ప్రపంచంలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడ్డాయి. ధాన్యాలు సమృద్ధిగా ఉండి, ఆహార దౌత్యాన్ని అనుసరిస్తే మన దేశ ప్రతిష్ఠ పెరిగిపోయేది. కానీ మోదీ ప్రభుత్వ అల్పత్వం మూలంగా, ఉన్న ధాన్యాలనే కాపాడుకోవలసిన పరిస్థితి నెలకొన్నది. సమాజం ఎంత వృద్ధి చెందినా వ్యవసాయం ప్రాధాన్యం తగ్గదని సీఎం కేసీఆర్ గుర్తించడం వల్లనే ఇవాళ దేశానికి ఈ మాత్రం భరోసా లభిస్తున్నది. మేధావులు, రైతులు తదితర వర్గాలన్నీ కలిసికట్టుగా మోదీ అవకతవక విధానాలను అడ్డుకోకపోతే దేశం అన్ని రకాల సంక్షోభాలను ఎదుర్కోవచ్చు.