రాష్ట్రంలో అవాంఛనీయ ఘటనలు జరుగుతున్నాయి. నాయకులు అనరాని మాటలంటున్నారు. ప్రతిపక్షాలైతే వింతవింతగా ప్రవర్తిస్తున్నాయి. ‘వీళ్లకేం మాయరోగమొచ్చింది?’ అని జనం నవ్వుకుంటున్నారు. ఇది మాయరోగం కాదు, మనుషులను మభ్యపెట్టే రోగం. అప్రమత్తంగా ఉండకపోతే.. ఎనిమిదేండ్లుగా కంటికి రెప్పలా కాపాడుకుంటున్న రాష్ట్ర ఉనికిని ప్రశ్నార్థకం చేసే మాయరోగం అది.
రాష్ట్రంలో ఇప్పుడు ‘మునుగోడు’ ఉప ఎన్నికపైనే సర్వత్రా చర్చ జరుగుతున్నది. ఇది అసహజమైన ఉప ఎన్నిక. సాధారణ పరిస్థితుల్లో వచ్చింది కాదు, స్వార్థం కోసం వచ్చింది. కాంగ్రెస్కు, ఎమ్మెలే పదవికి రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు. ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. సరే.. బీజేపీ నేతృత్వంలోని కేంద్రం రాజగోపాల్రెడ్డి కంపెనీకి రూ.21వేల కోట్ల బొగ్గు తవ్వే కాంట్రాక్టు ఇచ్చింది. ఆ కాంట్రాక్టు రావడానికి, ఈయన గారు బీజేపీలో చేరడానికి సంబంధం లేదని సెలవిచ్చారు. ఆయన ఏది చెప్తే అది నమ్మే పరిస్థితిలో జనం లేరనే విషయం రాజగోపాల్రెడ్డి తెలుసుకుంటే మంచిది.
బీజేపీ విధానాలే మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం. ఎవడో వచ్చి రాష్ట్రంలో అగ్గిరాజేస్తామంటే చూసుకుంట ఊకోదు తెలంగాణ. అక్రమార్కులను చేర్చుకుని, కండువా కప్పి పునీతులైపోయారని చెప్తున్న బీజేపీకి తెలియదేమో… ఇది ప్రగతిశీల, చైతన్యశీల తెలంగాణ. గడ్డిపోచలే గడ్డపారలై.. రాజరిక పాలనకు చరమగీతం పలికిన సమాజం. గిసొంటి సంఘ విద్రోహశక్తుల ఆటలో పావులుగా మారడం అసాధ్యం.
కాంగ్రెస్ సొంత ఎమ్మెల్యేను కాపాడుకునే పరిస్థితిలో లేదు. తిరిగి గెల్చుకునే పరిస్థితిలో అసలే లేదు. వాళ్ల అంతర్గత కుమ్ములాటలు.. వాళ్ల అంతర్గత విషయం. కానీ.. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా తాను ఒరగబెట్టిందేమీ లేదని స్వయంగా రాజగోపాల్ రెడ్డి బహిరంగంగా ప్రకటించారు. మరి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిస్తే గొప్పగా ఒరగబెట్టేదేముంటుంది..? బీజేపీలో ఇప్పుడు ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు… వాళ్ల అసెంబ్లీ నియోజకవర్గాలకు కేంద్రం నుంచి ఏమైనా మూటలు తీసుకొచ్చారా..? రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో రాష్ట్ర ప్రభుత్వ పథకాలే అమలు అవుతున్నాయి. కేంద్రం పెద్దలు రూపాయి ఇచ్చింది లేదు కానీ రుబాబు చేస్తున్నారు.
దేశంలో, తెలంగాణలో జరుగుతున్న పరిణామాలను జనం గమనించాలి. అలయి-బలయి సంస్కృతి గల తెలంగాణలో నిప్పు పెట్టేందుకు బీజేపీ నేతలు కుట్రలు చేస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయి? రాజగోపాల్రెడ్డి ఎందుకు రాజీనామా చేశారు? బీజేపీ నుంచి గెలిచి మునుగోడుకు చేయగలిగేదేంటి? బీజేపీకి దేశవ్యాప్తంగా ఉన్న గొర్రెల గుంపులో ఇదొక గొర్రెగా మారడం తప్ప, చేసేదేముంది? మునుగోడులో ఢిల్లీ గులాములు గెలువాలో.. తెలంగాణ ఆత్మగౌరవ బావుటా ఎగరేసే మొనగాడు గెలవాలో ప్రజలే తేల్చుకోవాలి. ఇవే మునుగోడు ప్రజల ముందున్న ప్రశ్నలు. జై తెలంగాణ.
-డాక్టర్ బండారు వీరబాబు , 99488 21220