వెనుకబడిన (బీసీ) కులాల ఆత్మగౌరవ భవన నిర్మాణాల కోసం రాష్ట్ర ప్రభుత్వం స్థలాలను కేటాయించడం అభినందనీయం. రాష్ట్ర ప్రజలు నలుమూలల నుంచి విద్య, వ్యాపార, వాణిజ్య, దవాఖాన పనుల కోసం హైదరాబాద్‌కు వచ్చేవారు ఒకరోజు రాత్రి హైదరాబాద్‌లో ఉండాల్సివస్తే నానా ఇబ్బందులు పడేవారు. దిక్కూ, దివానా లేక పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించి ప్రైవేటు లాడ్జిలలో ఉండేవారు. వారు పడే ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం వారికి నగరంలో సొంత భవనాలు ఉండాలని కోకాపేట్, ఉప్పల్ ప్రాంతాల్లో ఎకరం నుంచి ఐదెకరాల వరకు భూమిని కేటాయించారు. భవన నిర్మాణాల కోసం ఎకరానికి రూ.కోటి చొప్పున ఆర్థికసాయం చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకోవడం హర్షణీయం.
మొదటి దఫాలో 24 కులాలకు కోకాపేట్, ఉప్పల్ ప్రాంతాల్లో భవన నిర్మాణాలకు స్థలం, భవనం ప్రారంభించుకోవడానికి ప్రభుత్వం ఆర్థికసాయం కూడా చేసింది. వాళ్లు భవనాలు కూడా నిర్మించుకుంటున్నారు. రాష్ట్రంలోని అనేక వెనుకబడిన బీసీ కులాల అధ్యక్షులు ఏక సంఘంగా ఏర్పడి ట్రస్ట్‌లను ఏర్పాటుచేసుకొని రిజిష్టర్ కూడా చేసుకున్నారు. అలా చేసుకున్న సంఘాల్లో ఆరె కటిక కులం ఒకటి. ఆరె కటిక కులంలో 14, 15 సంఘాలు ఏర్పాటుచేసుకొని నేనంటే నేను అధ్యక్షుడిని అని, ఎవరికి వారు గ్రూపుల వారీగా సమావేశాలు పెట్టుకోవడం జరిగేది. దీంతో భవన నిర్మాణాల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు లేక కాలం గడిపేవారు.
రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఆత్మగౌరవ భవన నిర్మాణాలకు స్థలం కేటాయించడం, ఆర్థికంగా సహాయం అందిస్తామని చెప్పడంతో ఆరె కటిక కులంలోని అనేక సంఘాలు ఏకమై రిజిష్టర్ చేసుకున్నాయి. ట్రస్ట్ ఏర్పాటుచేసుకున్న కుల నాయకులు తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌కు, బీసీ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి బుర్ర వేంకటేశంకు నివేదిక ఇచ్చారు. ఇలాంటి ఐక్యత ఇంకా కొన్ని బీసీ కులాల్లో ఎంతకూ రాలేదు. దీంతో ప్రభుత్వమే ఆలోచించి, నిర్ణయం తీసుకొని బీసీ కులాలలో చురుకైన కార్యక్రమాలు, కులాభివృద్ధికి కృషిచేసే సంఘాలను గుర్తించి ఇటీవల ఆత్మగౌరవ భవన పట్టాలను అందించింది.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్‌గౌడ్ మంత్రి జి.నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు ప్రకాశ్, బసవరాజు సారయ్య తదితరులు ప్రసంగించారు. ఆత్మగౌరవ భవనాలు ఏ ఒక్క వ్యక్తికో, ఏ ఒక్క సంఘానికో, ఏ ఒక్క గ్రూపుకో సంబంధించిన వ్యవహారం కాదని, కులంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఆత్మగౌరవ భవనంలో అధికారం ఉంటుందని మంత్రులు తెలిపారు. ఈ భవనాలను రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి పనులపై నగరానికి వచ్చే ప్రజలు వాడుకోవచ్చని సూచించారు. కోట్ల రూపాయల విలువైన భూములను వెనుకబడిన ఆత్మగౌరవ భవన నిర్మాణాలకు కేటాయించడం అభినందించదగిన విషయంగా అభివర్ణించారు. ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం ఆంధ్రా ప్రజల పెత్తనమే తప్ప తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ అంటే ఏంటో కూడా తెలియని పరిస్థితి ఉండేదని, ఏడాదిలోపు రాష్ట్రంలో ఆత్మగౌరవ భవన నిర్మాణాలు పూర్తిచేసుకొని ఆత్మగౌరవంతో బతుకుదామన్నారు. ఈ భవనాల్లో విద్యార్థులకు ఉపయోగపడే వసతి గృహాలు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రజలకు ఉపయోగపడేవిధంగా ఉండాలని సూచించారు.
ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభు త్వం బీసీ కులాల కోసం ఆత్మగౌరవ భవనాలను నిర్మించడం హర్షణీ యం. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనుకబడిన కులాలు అభివృద్ధి సాధించడానికి అవసరమైన తోడ్పాటునందిస్తుందనడంలో సందేహం లేదు. ఆత్మగౌరవ భవనాలు తీసుకున్న 11 కులాలలో ఆరె కటికలు, ముదిరాజ్, వాల్మీకి బోయ, నాయీ బ్రహ్మణ, పద్మశాలి, రజక, గాండ్ల, బొందిలి, భూంజ్యా, కంచి, సంచార జాతులున్నాయి. ఆత్మగౌరవ భవనాల పట్టాలు తీసుకున్న బీసీ కులాల ప్రతినిధులు వీలైనంత త్వరగా భవన నిర్మాణాలు పూర్తిచేసుకుంటామని హామీ ఇవ్వడం అభినందనీయం.
డాక్టర్ ఎస్.విజయభాస్కర్
92908 26988