Border 2 | సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘బోర్డర్ 2’ విడుదల అయిన మొదటి రోజే అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకురాగా.. ముంబైలోని ప్రధాన మల్టీప్లెక్స్‌లలో సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడింది. సినిమాకు సంబంధించిన డిజిటల్ కంటెంట్ థియేటర్లకు చేరడంలో ఆలస్యం అవ్వడం దీనికి ప్రధాన కారణమని తెలుస్తుంది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ఫైనల్ కాపీలు సిద్ధం కాకపోవడంతో, ఉదయం 7:30 నుండి 9:00 గంటల మధ్య ప్రారంభం కావాల్సిన షోలను యాజమాన్యాలు రద్దు చేశాయి. భారీ అంచనాలతో థియేటర్లకు చేరుకున్న అభిమానులు షోలు రద్దు కావడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఉదయం 11:00 గంటల నుండి ప్రదర్శనలు యధావిధిగా ప్రారంభమయ్యే అవకాశం ఉందని థియేటర్ వర్గాలు వెల్లడించాయి.
మరోవైపు, ఈ చిత్రం గల్ఫ్‌లో వివాదంలో చిక్కుకుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్ వంటి గల్ఫ్ దేశాలలో ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేస్తూ అక్కడి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. చిత్రంలోని కొన్ని సన్నివేశాలు పాకిస్థాన్ వ్యతిరేక ధోరణిలో ఉన్నాయనే కారణంతో సెన్సార్ అనుమతి నిరాకరించబడినట్లు వార్తలు వస్తున్నాయి. వరుణ్ ధావన్, దిల్జీత్ దొసాంజ్, అహన్ శెట్టి వంటి భారీ తారాగణంతో అనురాగ్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, విడుదలైన ఇతర ప్రాంతాల్లో మాత్రం అద్భుతమైన స్పందనను రాబడుతోంది. క్రిటిక్స్ నుండి పాజిటివ్ టాక్ వస్తుండటంతో, సాంకేతిక సమస్యలు తొలిగిపోతే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రికార్డులు సృష్టించడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.