Pawan Kalyan | టాలీవుడ్లో వరుస హిట్లతో సక్సెస్ఫుల్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అనిల్ రావిపూడి మరోసారి వార్తల్లో నిలిచారు. ‘పటాస్’ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనిల్, ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోకుండా బాక్సాఫీస్ వద్ద సక్సెస్‌ల మీద సక్సెస్‌లు సాధిస్తూ తనదైన బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్నారు. గత ఏడాది విక్టరీ వెంకటేష్‌తో తెరకెక్కించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం భారీ విజయాన్ని అందుకోగా, అదే ఊపుతో ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవితో రూపొందించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో మరో సెన్సేషన్ క్రియేట్ చేశారు. వింటేజ్ చిరు ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు పండగ చేసుకుంటున్న ఈ చిత్రం మాస్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా విపరీతంగా ఆకట్టుకుంటోంది.
బ్లాక్‌బస్టర్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమా చిరంజీవి కెరీర్లోనే తొలిసారిగా రూ.300 కోట్ల కలెక్షన్లను సాధించి కొత్త రికార్డు సృష్టించింది. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై తెరకెక్కిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరీలియో సంగీతం అందించగా, నయనతార హీరోయిన్గా మెప్పించారు. విక్టరీ వెంకటేష్ గెస్ట్ అప్పియరెన్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ విజయోత్సాహంలో మీడియాతో మాట్లాడిన అనిల్ రావిపూడి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా చేసే అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు తాను పవన్ కళ్యాణ్‌ను ప్రత్యక్షంగా కలవలేదని, ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఆయన బిజీ షెడ్యూల్లో ఉన్నారని తెలిపారు. రాజకీయాలతో పాటు ఇతర బాధ్యతలు ఉండటంతో పవన్ రెగ్యులర్‌గా సినిమాలు చేయడం లేదని వ్యాఖ్యానించారు.
అయితే, పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయాలనే ఉత్సాహం తనకు ఖచ్చితంగా ఉందని, ఒకవేళ తమ కాంబినేషన్ కుదిరితే చాలా సంతోషంగా ఉంటానని అనిల్ స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలని అన్నారు.ఇదిలా ఉంటే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ, మరోవైపు తాను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ ఏడాది వరుసగా రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్, ‘హరిహర వీరమల్లు’ చిత్రంతో కొంత నిరాశపరిచినా, ‘ఓజీ’ సినిమాతో మాత్రం భారీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రానికి సంబంధించిన తన షూటింగ్ పార్ట్‌ను ఇప్పటికే పూర్తి చేశారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రథమార్థంలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.