భూస్వామ్య దోపిడీ వ్యవస్థపై సమర శంఖం పూరించి కడవెండి, భైరాన్ పల్లి, కూటిగల్లు, ధర్మపురం, విసునూరు, మొండ్రాయి, గుండాల, దేవరుప్పుల, నర్మెట, గొలనుకొండ, కామారెడ్డి గూడెంలలో సాగిన రైతాంగ పోరాటానికి ఐలమ్మ వెన్నుదన్నుగా నిలిచారు. ఆమె పేరు ప్రస్తావించకుండా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్ర లేదనడంలో అతిశయోక్తి లేదు.
భూమి కోసం, భుక్తి కోసం ప్రజలను కూడగట్టిన ఆమె పోరాట పటిమ స్ఫూర్తిదాయకం. తెలంగాణ ప్రజల తెగువను, దేశానికి చాటిన మహిళ ఆమె. భయంతో బతుకుతున్న నేటి తరానికి ఆమె మార్గదర్శి.
చాకలి ఐలమ్మ 1895లో వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలం కిష్టాపురంలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు ఓరుగంటి మల్లమ్మ, సాయిలు. ఆమెకు పదకొండేండ్లకే పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యతో పెళ్లయ్యింది. ఆ దంపతులకు ఐదుగురు కొడుకులు, ఒక కూతురు. ఐలమ్మ కుటుంబం ఆంధ్ర మహాసభలో సభ్యత్వం తీసుకోవడంతో పాటు తమ ఇంటిలోనే సంగం కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. పాలకుర్తిలో మల్లంపల్లి భూస్వామి కొండలరావు దగ్గర ఐలమ్మ 40 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని సాగు చేసింది. బహుజన కులానికి చెందిన ఐలమ్మ దొరల భూమిని సాగు చేయడం పట్వారీ శేషగిరిరావుకు నచ్చలేదు. తన పొలంలో కూలీ చేయాలని ఐలమ్మ కుటుంబానికి హుకుం జారీ చేశాడు.
పట్వారీ తాటాకు చప్పుళ్లకు వారు బెదరలేదు. దీంతో పట్వారీ ఈ విషయాన్ని విసునూరు దేశ్‌ముఖ్‌కు చేరవేశాడు. విసునూరు దేశ్‌ముఖ్ రామచంద్రారెడ్డి అరాచకాలకు పెట్టింది పేరు. ఆంధ్ర మహాసభ సభ్యురాలైన ఐలమ్మపై అతడు కక్ష పెంచుకున్నాడు. ఐలమ్మ కమ్యూనిస్టుల్లో చేరిందని దొంగ కేసులు పెట్టించాడు. కోర్టుకు విన్నవించుకోవడానికి హైదరాబాద్ వెళుతున్న ఐలమ్మపై దొర గూండాలతో దాడి చేయించాడు. తీవ్రంగా గాయపడినా ఐలమ్మ ఆత్మ ైస్థెర్యం కోల్పోలేదు. దొర బెదిరింపులకు లొంగకుండా అతడిపై న్యాయ పోరాటం చేసి గెలిచింది. ఇది సహించలేని విసునూరు దొర ఐలమ్మ పొలాన్ని తన పేర రాయించుకున్నాడు. అయితే ఐలమ్మ పోరాటంతో దొర, అతడి గూండాలు ఆమె పొలాన్ని స్వాధీనం చేసుకోలేకపోయారు.
ఐలమ్మ చేతిలో రెండోసారి దెబ్బతిన్న రామచంద్రారెడ్డి ఈసారి మరింత క్రూరమైన పథకం రచించాడు. రజాకార్లతో పాలకుర్తిపై దాడులు చేయించాడు. ఐలమ్మ ఇంటిని తగల బెట్టించాడు. ఆమె కూతురిపై లైంగికదాడి చేశారు. అడ్డొచ్చిన భర్తను, ఒక కొడుకును చంపేశారు. అయినా ఐలమ్మ వెనకడుగు వేయలేదు. ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడింది. పట్వారీ శేషగిరిరావు ఇంటిని కూల్చేసింది. ఆ ఇంటి స్థలంలో మక్కలు పండించింది. ఐలమ్మ భూ పోరాటం విజయ స్ఫూర్తితో పాలకుర్తి దొర ఇంటిపై కమ్యూనిస్టులు దాడి చేసి ధాన్యాన్ని, 90 ఎకరాల దొర భూమిని ప్రజలకు పంచారు. ఐలమ్మ పోరాటం సాయుధ రైతాంగ పోరాటానికి ఊపిరులూదింది. ఊపందుకున్న ఉద్యమం ఫలితంగా దొరల అధీనంలో ఉన్న దాదాపు పది లక్షల ఎకరాల భూమి సామాన్యుల సొంతమైంది. ఐలమ్మ ఆకాంక్ష మేరకు దొరల రాజ్యం పోయి గడీల్లో గడ్డి మొలిచింది. ఐలమ్మ 1985 సెప్టెంబర్ 10న మరణించారు. ఆమె పోరాటం తరతరాలకూ స్ఫూర్తిదాయకం.
(వ్యాసకర్తలు: పరిశోధక విద్యార్థి, ఓయూ;రాష్ట్రప్రధాన కార్యదర్శి,రజక విద్యార్థి సంఘం)
(నేడు చాకలి ఐలమ్మ వర్ధంతి)