Sanjay Leela Bhansali | భారతీయ సినిమా ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన అగ్ర దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలీ ఒకరు. కథనం, దృశ్య వైభవం, సంగీతం, భావోద్వేగాల మేళవింపుతో ఆయన రూపొందించిన సినిమాలు ప్రేక్షకులను ఎప్పటికీ ఆకట్టుకుంటూనే ఉన్నాయి. అలాంటి ప్రతిభావంతుడైన దర్శకుడికి ఇప్పుడు భారత ప్రభుత్వం తరఫున అరుదైన గౌరవం లభించనుంది. ఇది కేవలం భన్సాలీ వ్యక్తిగత విజయమే కాకుండా, భారతీయ సినిమాకే గర్వకారణంగా చెప్పుకోవచ్చు.వందేమాతరం పాట ప్రారంభమై 150 సంవత్సరాలు పూర్తవుతున్న ప్రత్యేక సందర్భంగా ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలు మరింత వైభవంగా జరగనున్నాయి.
ఈ నేపథ్యంలో జనవరి 26న జరిగే ప్రధాన కార్యక్రమంలో భారతీయ సినిమా ప్రతినిధిగా సంజయ్ లీలా భన్సాలీ పాల్గొననున్నారని సమాచారం. ఆ సందర్భంగా సినిమా నేపథ్యంతో కూడిన ప్రత్యేక శకటాన్ని ప్రదర్శించనున్నట్లు నివేదికలు వెల్లడించాయి. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ భన్సాలీతో కలిసి పనిచేయనుంది. ఇది భారతీయ సినీ పరిశ్రమకు లభించిన అత్యున్నత గుర్తింపుల్లో ఒకటిగా భావిస్తున్నారు.భన్సాలీ సినిమాల విషయానికి వస్తే, కథను కేవలం చెప్పడమే కాదు, దాన్ని అద్భుతమైన విజువల్ ఎక్స్పీరియెన్స్గా మార్చడంలో ఆయనకు ప్రత్యేకమైన స్థానం ఉంది.
‘హమ్ దిల్ చుకే సనమ్’, ‘దేవదాస్’, ‘బ్లాక్’, ‘బాజీరావు మస్తానీ’, ‘పద్మావత్’, ‘గంగూబాయి కతియావాడి’ వంటి చిత్రాలు ఆయన ప్రతిభకు నిదర్శనాలు. ప్రతి సినిమాలోనూ సాహిత్యం, సంగీతం, కళా దర్శకత్వం సమపాళ్లలో కలిసివచ్చి భన్సాలీ సినిమాలను ప్రత్యేకంగా నిలబెట్టాయి.దర్శకుడిగానే కాకుండా నటుడు, నిర్మాత, రచయిత, సంగీత దర్శకుడిగా కూడా భన్సాలీ తన సత్తా చాటుకున్నారు. ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పూర్వ విద్యార్థిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ‘భన్సాలీ ప్రొడక్షన్స్’ పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించి, కొత్త కథలు, కొత్త ప్రతిభను ప్రోత్సహించడంలో కూడా ముందున్నారు. తన తల్లి లీలా భన్సాలీకి గుర్తుగా తన పేరులో ‘లీలా’ అనే పదాన్ని చేర్చుకోవడం ఆయన వ్యక్తిత్వానికి మరో ఉదాహరణ.