బూత్ బంగ్లాలో ఒంటరిగా చిక్కుకొని భయంతో, జీరబోయిన గొంతుతో సాయం కోసం ‘హలో ఎవరైనా ఉన్నారా..’ అంటూ చేసే ఆర్తనాదం అనేక హారర్ సినిమాల్లో చూసిందే. వచ్చే ఎన్నికల్లో అధికారం తమదేనని ఇంతకాలం బీరాలు పలికిన బీజేపీ రాష్ట్ర నేతలకు ఎన్నికలు దగ్గర పడే కొద్దీ దిగులు పట్టుకుంది. అన్ని నియోజకవర్గాల నుంచి పోటీకి కనీసం అభ్యర్థులైనా దొరకాలి కదా అని.. ఎవరున్నారా అని వెతుకులాడుతున్నారు. బీజేపీ రాష్ట్ర ఇంచార్జీ తరుణ్ ఛుగ్ రెండు రోజులుగా జిల్లాల కోర్ కమిటీలతో సమావేశమై, ‘హలో! ఎవరైనా ఉన్నారా? పార్టీలో చేరికకు’ అని అన్ని జిల్లాల నాయకులను వాకబు చేశారు. ఇతర పార్టీలకు చెందిన కొందరు ముఖ్యుల పేర్లు ప్రస్తావిస్తూ, వారేమైనా బీజేపీలోకి వచ్చే అవకాశం ఉందేమో చూడండని సూచించారు. ‘పార్టీలో చేరడానికి 14 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలున్నారని చెప్పారు. మరి వారి సంగతి ఏమైంది?’ అని బండి సంజయ్‌ని తరుణ్ ఛుగ్ ఆరా తీసినట్టు సమాచారం. ఎవరైనా వస్తారేమోనని తాను కూడా ఎదురు చూస్తున్నానని బండి సంజయ్ చెప్పారట.