Pomegranate | మనం ఆహారంగా తీసుకునే పండ్లల్లో దానిమ్మ పండ్లు కూడా ఒకటి. ఇవి తియ్యగా చాలా రుచిగా ఉంటాయి. దానిమ్మ పండ్లల్లో అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్స్, ఖనిజ లవణాలు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. దానిమ్మపండ్లను తినడం లేదా వాటి రసాన్ని తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య నుండి బయటపడవచ్చు. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ బారిన పడే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. బరువు తగ్గడంలో, ఆర్థరైటిస్ సమస్యను తగ్గించడంలో ఇలా అనేక రకాలుగా దానిమ్మ పండ్లు మనకు సహాయపడతాయి. దానిమ్మపండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తున్నప్పటికీ వీటిని తీసుకోవడం వల్ల కొందరిలో జీర్ణ సమస్యలు, అలర్జీలు వచ్చే అవకాశం ఉంది.
అలాగే ఇతర అనారోగ్య సమస్యలకు మందులు వాడే వారు కూడా దానిమ్మపండ్లను తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గర్భిణీ స్త్రీలు కూడా వారు వాడే మందులను బట్టి వీటిని తీసుకోవడం మంచిది. దానిమ్మపండ్లను ఎవరు తీసుకోకూడదు.. దీని గురించి వైద్యులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. దానిమ్మ పండ్లల్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల రక్తనాళాలు సడలించబడి రక్తపోటు తగ్గుతుంది. అయితే లో బీపీతో బాధపడే వారు వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటు మరింత తగ్గుతుంది. ఇది కొన్ని సందర్భాల్లో మైకం, మూర్ఛ, అస్పష్టమైన దృష్టి వంటి వాటికి దారి తీస్తుంది. రోజుకు 300 ఎంఎల్ దానిమ్మ రసం తాగడం వల్ల రెండు నెలల్లో సిస్టోలిక్ రక్తపోటు దాదాపు 5ఎంఎం హెచ్జి, డయాస్టోలిక్ రక్తపోటు 3ఎంఎం హెచ్జి తగ్గిందని పరిశోధనలలో వెల్లడైంది.
దానిమ్మ పండ్లు అధిక రక్తపోటు ఉన్న వారికి ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ తక్కువ రక్తపోటు ఉన్న వారు మాత్రం వీటిని తీసుకునే విషయంలో జాగ్రత్త వహించాలి. దానిమ్మ పండ్లు ఏసీఈ ఇన్హిబిటర్లు, స్టాటిన్స్, బీటా బ్లాకర్స్, యాంటీకోగ్యులెంట్స్ వంటి మందులతో సంకర్షణ చెందుతాయి. ఈ పండ్లల్లో ఉండే సమ్మేళనాలు కాలేయం ఈ మందులను ప్రాసెస్ చేసే విధానాన్ని నెమ్మదిస్తాయి. దీంతో ఈ మందులు పనిచేయడానికి సమయం ఎక్కువగా పడుతుంది. అలాగే దానిమ్మ రసం సీవైపీ3ఏ4, సీవైపీ2సీ9 వంటి ముఖ్యమైన కాలేయ ఎంజైమ్ లను నిరోధించగలవు. ఈ ఎంజైమ్ లు ఔషధాలను జీవక్రియ చేయడంలో సహాయపడతాయి. దీంతో శరీరంలో ఔషధ స్థాయిలు పెరుగుతాయి. గుండె రోగులకు లేదా దీర్ఘకాలిక మందులు తీసుకునే వారికి ఇది ప్రమాదకరంగా మారుతుంది.
ఇక శస్త్రచికిత్సకు ముందు కనీసం రెండు వారాల పాటు దానిమ్మ పండ్లను తీసుకోకూడదని వైద్యులు సలహా ఇస్తున్నారు. దానిమ్మ పండ్లు రక్తం గడ్డకట్టే విధానాన్ని ప్రభావితం చేస్తాయి. అంతేకాకుండా అనస్థీషియా మందులతో కూడా ఇవి సంకర్షణ చెందుతాయి. వీటిని తీసుకోవడం వల్ల శస్త్రచికిత్స సమయంలో అధిక రక్తస్రావం వంటి సమస్యల ప్రమాదం పెరుగుతుంది.
దానిమ్మ పండ్లల్లో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు మేలు చేసినప్పటికీ సున్నితమైన జీర్ణాశయం ఉన్న వారిపై ఇవి ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ పండులో టానిన్లు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల కొన్నిసార్లు ఉబ్బరం, విరేచనాల వంటి సమస్యలు తలెత్తుతాయి. అలాగే వీటిని అతిగా తినడం వల్ల కడుపు నొప్పి వచ్చే అవకాశం కూడా ఉంది.
దానిమ్మ పండ్ల అలర్జీని చాలా తక్కువ మందిలో మనం చూడవచ్చు. దురద, ముఖం లేదా గొంతు వాపు, దద్దుర్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలను మనం చూడవచ్చు. ఈ పండును తిన్న తర్వాత అసౌకర్యం, మంట, చర్మంపై చికాకు వంటి లక్షణాలను గమనించిన వెంటనే వాటిని తినడం మానేసి వైద్యున్ని సంప్రదించడం మంచిది. దానిమ్మ పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. కానీ దానిమ్మపండ్లు అందరికీ సరిపడవు. తక్కువ రక్తపోటు ఉన్నవారు, శస్త్ర చికిత్సలు చేయించుకునే వారు, సున్నితమైన జీర్ణక్రియ ఉన్నవారు వీటిని వైద్యున్ని సంప్రదించి తీసుకోవాలి. ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులైనా సరే వీటిని మితంగా తీసుకోవడం మంచిదని వైద్యులు చెబుతున్నారు.