Inavolu : ఐనవోలు (హనుమకొండ): ఐనవోలు మల్లికార్జునస్వామి జాతర బ్రహ్మోత్సవాలను అధికార పార్టీ ఎమ్మెల్యే పట్టించుకోకపోయినా జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ నేతృత్వంలో అధికారులు విజయవతంతం చేశారు. కలెక్టర్ అదేశాల మేరకు ఆర్డీవో, డీపీవో, డీఎల్పీవో పర్యవేక్షణలో జాతర నోడల్ ఆఫీసర్ స్థానిక తహసీల్దార్ విక్రమ్ కుమార్, ఈవో కందులు సుధాకర్, ఎంపీడీవో నర్మద, ఎంపీవో రఘుపతిరెడ్డి ఆధ్వర్యంలో జాతరలో పారిశుద్ధ్య పనులు నిర్వహించారు.
ఐనవోలు, ధర్మసాగర్, హసన్ పర్తి మండలాల నుంచి సూపర్ వైజర్లు, సిబ్బంది సహా 170 మంది, వరంగల్ మున్సిపాలటీ నుంచి సూపర్వైజర్లు, సిబ్బంది సహా110 మంది మొత్తం 280 మంది పారిశుద్ధ్య కోసం షిఫ్టుల వారీగా ఆలయం, చుట్టు పరిసరాల ప్రాంతాలను 11 విభాగాలు విభజన చేసుకొని ఆయా శాఖలాధికారులు కేంద్రీకరించి, (స్థానిక గ్రామ పంచాయతీ నుంచి సుమారుగా రూ.3 లక్షలతో బ్లీచింగ్, సున్నం, 150 అఫ్రన్ కోట్లు, చెత్తకు పెద్ద డబ్బాలు కొనుగోలు చేసి) పనులు చేసి జాతరను క్లీన్ అండ్ గ్రీన్ గా మార్చారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చేశారు.
బందోబస్తు ఏర్పాటు విషయంలో వరంగల్ పోలీసు కమీషనర్ సన్‌ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ ఆధ్వర్యంలో 400 మందితో బందోబస్తు నిర్వహించారు. ఇద్దరు ఏసీపీలు మామునూర్ వెంకటేశ్, స్టేషన్ ఘన్ పూర్ భీంశర్మ, సీఐలు 06 మంది, ఎస్సైలు 26 మంది, పోలీసు సిబ్బంది 366 మందితో పర్వతగిరి సిఐ రాజగోపాల్, స్థానిక ఎస్సై శ్రీనివాస్
బందోబస్తు నిర్వహించారు. అదే విధంగా విద్యుత్ శాఖ ఏడీఈ పైడయ్య పర్యవేక్షణలో స్థానిక ఏఈ సురేశ్ ఆధ్వర్యంలో 30 మంది విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది జాతరలో విధులు నిర్వహించారు.
ఎండోమెంట్ శాఖ నుంచి సూపరింటెండెంట్ గౌరీశంకర్ పర్యవేక్షణ, ఈవో కందుల సుధాకర్, ఆలయా కమిటి చైర్మన్ కమ్మగోని ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో ఎండోమెంట్ అధికారులు శాశ్వత తాత్కాలిక సిబ్బంది 60 మంది నిధులు నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం మినీ వాటర్ ట్యాంకులు, ఆలయం చుట్టూ లైట్లు, క్యూ లైన్లలో మూత్రశాలలు వంటి ఏర్పాట్లతో జాతరను అధికారులు విజయవంతం చేశారు.