– పందనపల్లి సర్పంచ్ అనిల్ రెడ్డి
కట్టంగూర్, జనవరి 16 : కట్టంగూర్ మండలంలోని పందనపల్లి గ్రామంలో అసైన్డ్ కమిటీ ద్వారా నిరుపేదలకు పంపిణీ చేసిన 214 సర్వే నంబర్లోని ప్రభుత్వ భూమిలో హద్దులు ఏర్పాటు చేయాలని ఆ గ్రామ సర్పంచ్ కుంభం అనిల్ రెడ్డి అన్నారు. అసైన్డ్ భూమిలో పట్టా కలిగిన వారికి హద్దులు ఏర్పాటు చేయాలని పట్టాదారులు, గ్రామస్తులతో కలిసి శుక్రవారం తాసీల్దార్ పుష్పలతకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హద్దులు ఏర్పాటు చేయక పోవడంతో కొంతమంది అక్రమ మార్గంలో అసైన్డ్ కమిటీకి సంబంధం లేకుండా రెవెన్యూ అధికారుల అండదండలతో మహాణి రికార్డుల్లో పేర్లు చేయించుకుని ధరణి పాసు పుస్తకాలు సంపాధించారని ఆరోపించారు.
అసైన్డ్ భూముల పంపిణీ సమయంలో హద్దులు ఏర్పాటు చేయకుండా ఇవ్వడంతో పట్టాదారులు, అక్రమదారుల మధ్య తీవ్రస్థాయిలో గొడవలు జరుగుతున్నాయన్నారు. అధికారులు మళ్లీ సర్వే చేసి అసైన్డ్ పట్టాదారులకు హద్దులు ఏర్పాటు చేసి న్యాయం చేయాలని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో గద్దపాటి దానయ్య, ఉప సర్పంచ్ గద్దపాటి వీరేందర్, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కోశాధికారి గజ్జి రవి. అసైన్డ్ పట్టాదారులు గద్దపాటి పూలమ్మ, నిమ్మల కోటి, పాపమ్మ, ఎల్లమ్మ, సుమతి, గద్దపాటి గణేష్ ఉన్నారు.