దేశం అప్పుల కుప్పగా మారింది. స్వాతం త్య్రం వచ్చిన నాటి నుంచి ఎప్పుడూ
పెరగనంత అప్పులు బీజేపీ పాలనలో పెరిగాయి. 2014 నుంచి నేటి వరకు దేశీయ అప్పు రెట్టింపైంది. 2022 మార్చి నాటికి రూ.133 లక్షల కోట్లు అప్పున్నది. ఇది స్థూల జాతీయోత్పత్తిలో 78 శాతం.
రత మాజీ ప్రధాన మంత్రులు 13 మంది 67 ఏండ్లలో రూ.55 లక్షల కోట్ల అప్పు చేస్తే, దేశ 14వ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కేవలం ఎనిమిదేండ్లలో రూ.80 లక్షల కోట్ల అప్పు చేశారు. అంటే ఏడాదికి రూ.10 లక్షల కోట్లు! రాష్ర్టాలకు వాటా ఇవ్వకుండా కేంద్రం పోగు చేసుకునే డబ్బు చాలా ఉంది. వివిధ పన్నుల మీద విధించే సర్ఛార్జీలు, సెస్‌లు, ప్రభుత్వరంగ సంస్థలు చెల్లించే డివిడెండ్లు కేంద్రానికే వెళ్తాయి. ఇవికాకుండా పెట్టుబడుల ఉపసంహరణ, సంస్థల అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం, రిజర్వు బ్యాంకు మిగులు నిధులు ఏటా లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వమే వినియోగించుకుం టున్నది. ‘పీఎం కేర్’ వంటి పథకాల ద్వారా కూడా వేల కోట్ల రూపాయలు సమకూర్చుకుంటూ లెక్కాపత్రం లేకుండా వాడుకుంటున్నది. దేశంలో చేసే అప్పులే గాక విదేశాల నుంచి వివిధ రూపాల్లో అప్పులు సేకరించి వాడుకుంటున్నది. ఈ విదేశీ అప్పు నేడు జీడీపీలో 20 శాతానికి చేరింది.
ఎఫ్ఆర్బీఎం నిబంధన దాటి ద్రవ్యలోటు పూడ్చుకునేందుకు కేంద్రం అప్పులు చేస్తున్నది. కానీ రాష్ర్టాలకు మాత్రం ఈ వెసులుబాటు ఇవ్వకుండా చేతులు కట్టేస్తున్నది. రాష్ర్టాల స్థూల ఉత్పత్తిలో మొత్తం అప్పు 50 శాతం దాటిందని చెప్పి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్నది. ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నది. ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక మూలాలను కేంద్రం దెబ్బ తీస్తున్నది. వాటిని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేవిధంగా ‘ఆర్థిక యుద్ధం’ చేస్తున్నది.
రాష్ర్టాలకు స్టాంప్ డ్యూటీల రూపంలో రిజిస్ట్రేషన్ల మీద వచ్చే ఆదాయం, వస్తు సేవలపై పన్ను, పెట్రో ఉత్పత్తులు తదితరాలపై వచ్చే పన్నులే ఆదాయ వనరు. అలాగే కేంద్ర పన్నుల నుంచి వచ్చే వాటా కూడా ప్రధాన ఆదాయం. జీఎస్టీ వచ్చిన దగ్గరినుంచి రాష్ర్టాలకు ఇవ్వాల్సిన సొమ్మును కేంద్రం సకాలంలో చెల్లించడం లేదు. 2022 మార్చి నుంచి జీఎస్టీ నష్ట పరిహారాన్ని రాష్ర్టాలకు చెల్లించబోమని కేంద్రం తెగేసి చెప్పేసింది. ఇది చాలక ఇప్పుడు ‘ఒకే దేశం-ఒకే రిజిస్ట్రేషన్’ అంటూ రాష్ట్ర పరిధిలోని భూమి, భవన రిజిస్ట్రేషన్ ఛార్జీలు, ఇతర ఫీజులను గుంజుకోవడానికి కేంద్రం దొడ్డిదారిన ప్రయత్నం చేస్తున్నది. 15వ ఆర్థిక సంఘం సిఫారసులను బూచిగా చూపుతూ బడ్జెటేతర అప్పులను రాష్ర్టాల మెడకు చుడుతున్నది. సంక్షోభ కాలంలో 2020-21 నుంచి తీసుకున్న బడ్జెటేతర రుణాలను 2022-23 ఆర్థిక సంవత్సరం అప్పుల పరిమాణంలో కలుపుతామని కేంద్రం అంటున్నది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ, కేంద్ర ప్రభుత్వం విష ప్రచారం చేస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటితో పోల్చి ఇప్పుడు రాష్ర్టాన్ని టీఆర్ఎస్ అప్పుల పాలు చేసిందని గోబెల్స్ ప్రచారం చేస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ, రైతుబంధు, దళితబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత, నాణ్యమైన కరెంటు, కల్యాణలక్ష్మి లాంటి సంక్షేమ పథకాల ప్రయోజనాల గురించి మాట్లాడటం లేదు. ప్రజా సంక్షేమంలో, సాగునీటి రంగంలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచినదాన్ని చూడటం లేదు. అత్యధికంగా అప్పులు చేసి కూడా అభివృద్ధికి నోచుకోని అనేక బీజేపీ పాలిత రాష్ర్టాల గురించి కేంద్ర ప్రభుత్వం మాట్లాడకపోవడం విడ్డూరం.
ఇదిలా ఉంటే… మోదీ పాలనలో దేశం వెలిగిపోతున్నదని బీజేపీ ఊదరగొడుతున్నది. కానీ, గత ఎనిమిదేండ్లుగా మోదీ పాలనను పరిశీలిస్తే.. భారతదేశాన్ని అంధకారంలోకి నెట్టివేస్తున్నట్టు అర్థమవుతున్నది. అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్లకు దేశ సంపదను దోచిపెట్టడమే మోదీ పని గా పెట్టుకున్నారు. దేశంలో అధికారం కోసం రాజకీయ సంక్షోభానికి తలపెడుతున్నారు. నయాన్నో, భయాన్నో రాష్ర్టా ల ఆర్థిక పరిస్థితిని దెబ్బ తీస్తూ లొంగదీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దేశాన్ని అప్పుల కుప్పగా మార్చిన బీజేపీ దేశాన్ని శ్రీలంక బాటలో నడిపిస్తున్నదని ప్రముఖ ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తుండటం ఆందోళనకరం.
(వ్యాసకర్త: విభాగాధిపతి,జర్నలిజం శాఖ, కేయూ)