‘దేవుడా రక్షించు నా దేశాన్ని/ సిద్ధుల నుండి/ సిద్ధాంత కేసరుల నుండి/ శ్రీమద్గురు పరంపర నుండి/ నీతుల రెండు నాలుకలు సాచే/ నిర్హేతుక కృపా సర్పాల నుండి (అమృతం కురిసిన రాత్రి)’… ఎప్పుడో అరవై ఏండ్ల కిందట దేవరకొండ బాల గంగాధర తిలక్ దేశంలోని పరిస్థితులను చూసి ఈ విధంగా ఆవేదన చెందారు.
నేటికీ ఆ పరిస్థితి మారలేదు. పై పెచ్చు మతోన్మాద ఫాసిస్టు శక్తుల విజృంభణ గతంలో కంటే ఎక్కువగా ఉన్నది. ఆ రాక్షస నీడ ఇవాళ తెలంగాణను నల్ల మబ్బులా కమ్ముకుంటూ వస్తున్నది. చెలరేగిపోతున్న మతోన్మాద శక్తులను చూస్తున్నప్పుడు ఒక విషాదగీతాన్ని గుండె నిండా బరువుతో ఆలపించాలనిపిస్తున్నది.
కళ్లముందు ఇష్టంగా కట్టుకున్న గూడు చెదిరిపోతున్నప్పుడు పడే బాధను పడుతున్నాను. సబ్బండవర్ణాల సబ్బండ కులాల ఐకమత్య గీతంగా ఉన్న నా ఊరు ఇప్పుడు ఎవరికి వారు బెర్రలు గీసుకొని అన్నదమ్ముల్లా ఉండేవాళ్లంతా శత్రు కూటములుగా విభజించబడటం మనసును పిండేస్తున్నది. మతాలన్నీ కలిసిపోయి కులాలన్నీ కష్టజీవుల సామూహిక కండలై సంపద సృష్టికర్తలుగా నిలిచినవేళ సామూహిక సహజ చేతులను విడగొట్టి విభజించి వేర్వేరుగా పరస్పర విద్వేషకులుగా మార్చేస్తున్న విష సంస్కృతిని ఊర్ల నిండా నింపేస్తుంటే సామూహిక సామాజిక గీతం గుక్కపెట్టి రోదిస్తుంటే చూడలేకపోతున్నాను.
‘కులమంటే కత్తిరా, మతమంటే మత్తురా కులమతాల ఎత్తులు అవకాశవాదుల జిత్తులు’ అని గొంతెత్తి పాడిన తెలంగాణ కంఠంపై కత్తులు దూస్తారా? అధికార కుర్చీల మార్పిడి కోసం తెలంగాణ మట్టిని మత ఘర్షణల దిబ్బగా మారణహోమంగా మార్చేస్తారా? తెలంగాణ నేల ‘గంగా జమునీ తహ్జీబ్’కు ప్రతీకగా నిలిచిందని, భారతదేశం ఈ స్ఫూర్తిని తీసుకోవాలని కీర్తించిన గాంధీ మహాత్ముని సందేశ స్థలాన్ని మతం మంటలు లేపి మారణహోమ స్థలిగా మార్చేస్తారా? స్వరాష్ట్ర సాధన కోసం ప్రపంచ పటంలో ఎక్కడా లేనివిధంగా అన్ని మతాలు, అన్ని కులాలు సబ్బండ వర్ణాలు కలిసి పద్నాలుగేండ్లు కలిసి సామూహిక గొంతుగా నిలిచి ఎన్నెన్నో కష్టాలు పడి త్యాగాలు చేసి అహింసా మార్గంలో రాష్ర్టాన్ని సాధించుకున్న తెలంగాణను కళ్ళముందే అల్లకల్లోలం చేస్తుంటే తెలంగాణ దుఃఖిస్తున్నది.
తెలంగాణ సమాజంలో ఇట్లా రాయాల్సి వస్తుందనుకోలే. గుండెనిండా నిండిన బాధతో రాయాల్సి వస్తుంది. ఎంతో నెత్తురు ధారపోసి ఎన్నెన్నో త్యాగాలను వెదజల్లి నిర్మించుకున్న తెలంగాణను కళ్లముందే మతం కులాధిపత్యాల కాళ్ల కింద తొక్కేయాలని చూస్తున్న ఉన్మాదశక్తుల వికృత చర్యలను చూస్తూనే అక్షరమవుతున్నాను. మా ఖలీల్, నేను కలిసి రంజాన్ పండుగ రోజు తాగిన సేమియాలు అట్లనే తియ్యటి బంధంగా మిగిలిపోవాలి. మా చిన్నప్పటి క్లాస్మెట్ జిల్లా దాసు చనిపోయాక అతడు దళితుడని తెలిసింది. పెద్ద మండపం కాడ శ్రీరామనవమి రోజు సామూహికంగా బెల్లం పానకంలో మునిగితేలిన అపురూప సామాజిక అనుబంధ చిత్రాలు మన తెలంగాణ రాష్ట్ర సంస్కృతికి నిదర్శనాలు. పీర్ల పండుగనాడు అందరం కలిసి ఆడిపాడిన ఆటలు పాటలు, సామూహిక సామరస్య పండుగలు మన తెలంగాణ సామాజిక తత్వానికి ప్రతిరూపాలుగా నిలుస్తాయి.
పైన చెప్పిన దేవరకొండ బాల గంగాధర తిలక్ తన కవిత చివరలో ‘దేవుడా ! నా దేశాన్ని నిండైన మనుషులతో నింపు’ అని ప్రార్థిస్తాడు. ఇప్పుడు తెలంగాణను అలాంటి నిజమైన మనుషులతో నింపడానికి బుద్ధి జీవులుగా, తెలంగాణ తల్లి బిడ్డలుగా మనమేం చేయా లో ఇప్పటికిప్పుడు నిర్ణయించుకోవలసిన సమయం వచ్చేసింది.