కొచ్చి: ఆర్ఎస్ఎస్, బీజేపీపై మళ్లీ విమర్శలు చేశారు రాహుల్ గాంధీ(Rahul Gandhi). దేశంలో అధికారాన్ని కేంద్రీకృతం చేసేందుకు ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు ఆయన ఆరోపించారు. కేరళలోని కొచ్చిలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఇవాళ ప్రసంగించారు. తమ పార్టీ వికేంద్రీకరణను విశ్వసిస్తుందన్నారు. మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ 73, 74వ రాజ్యాంగ సవరణ తీసుకువచ్చిందని రాహుల్ గాంధీ అన్నారు.
రాజ్యాంగాన్ని పరిరక్షించడం అంటే గ్రామీణ స్థాయిలో పరిపాలనను వికేంద్రీకరించడం అవుతుందని రాహుల్ గాంధీ తెలిపారు. దేశంలో నిశబ్ధ సంస్కృతి పెరుగుతోందని, దీని పట్ల జాగ్రత్తగా ఉండాలని మలయాళ రచయిత ఎం లీలావతి హెచ్చరించినట్లు కాంగ్రెస్ నేత పేర్కొన్నారు. ప్రజలు మౌనంగా ఉంటే కొందరు కార్పొరేట్లు దేశ సంపదను నియంత్రించే అవకాశం ఉంటుందని బీజేపీ విశ్వసిస్తుందని ఆయన ఆరోపించారు. కేరళ ప్రజల నోటిని నొక్కలేమని, ఎన్నికల ద్వారా సమాధానం ఇవ్వాలని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు.