Sorghum | తృణ ధాన్యాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. మనం ఆహారంగా తీసుకునే తృణ ధాన్యాల్లో జొన్నలు కూడా ఒకటి. జొన్నలను ప్రపంచవ్యాప్తంగా 5వేల సంవత్పరాలకు పైగా సాగు చేస్తున్నారు. వీటిని జొవార్ అని కూడా పిలుస్తారు. పూర్వకాలంలో జొన్నలు ప్రధాన ఆహారంగా ఉండేవి. జొన్నలకు ఉన్న ప్రాధాన్యతను, వాటి పోషక విలువలను, వాటి ప్రయోజనాలను తెలుసుకున్న ఈ తరం వారు ఆధునిక వంటకాల్లో కూడా జొన్నలను ప్రధానంగా ఉపయోగిస్తున్నారు. అద్భుతమైన పోషకాలు, బహుళ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న కారణంగా జొన్నలు సూపర్ ఫుడ్ గా ప్రజాదారణ పొందాయని చెప్పవచ్చు. జొన్నలను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్యప్రయోజనాలను పొందవచ్చు. జొన్నలను తీసుకోవడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
జొన్నలు అధిక కరువును తట్టుకుంటాయి. జొన్నలు ఇతర ధాన్యాల కంటే దాదాపు 30 శాతం తక్కువ నీటిని ఉపయోగించుకుంటాయి. అలాగే ఐరన్ లోపాన్ని తగ్గించడంలో జొన్నలు ముఖ్యపాత్ర పోషిస్తాయి. జొన్నల్లో ఇతర ధాన్యాల కంటే అధిక మొత్తంలో ఐరన్ ఉంటుంది. ఉడికించిన జొన్నల్లో 100గ్రాములకు గాను 2.25 మి.గ్రా. నుండి 4.4 మి.గ్రా మధ్య ఐరన్ ఉంటుంది. జొన్నలను తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. అంతేకాకుండా జొన్నల్లో ఇతర చిరుధాన్యాల కంటే ఫినోలిక్ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. లుటియోలినిడిన్, అపిజెనినిడిన్ వంటి ప్రత్యేకమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న ఆహారాల్లో జొన్నలు ఒకటి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వాపు, ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడంలో సహాయపడతాయి.
జొన్నలను తీసుకోవడం వల్ల స్థిరమైన శక్తిస్థాయిలు అందుతాయి. శరీర జీవక్రియ మెరుగుపడుతుంది. రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు పేగుల ఆరోగ్యం పెరుగుతుంది. జొన్నలు సహజంగానే గ్లూటెన్ రహిత ఆహారాలు. కనుక వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి కూడా జొన్నలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. జొన్నల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల మలబద్దకం సమస్య తగ్గుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా జొన్నలు మనకు దోహదపడతాయి. జొన్నలను తీసుకోవడం వల్ల చర్మం, జుట్టు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. ఈ విధంగా జొన్నలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వీటిని తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. జొన్న రొట్టెలను, జొన్న అన్నాన్ని, జొన్న ఉప్మా, జొన్న ఇడ్లీ వంటి వాటిని ఆహారంగా తీసుకోవడం వల్ల జొన్న వల్ల కలిగే ప్రయోజనాలను మనం పొందవచ్చని వైద్యులు తెలియజేస్తున్నారు.