తెలంగాణ ప్రభుత్వం అవలంబించే విధానాలను కేంద్రంతో పాటు, ఇతర రాష్ర్టాలు కూడా అమలుపరుస్తున్నాయి. కేవలం ఎనిమిదేండ్ల స్వల్ప వ్యవధిలోనే తెలంగాణ స్థిరమైన ఆర్థికప్రగతిలో మెరుగైన రాష్ట్రంగా అవతరించింది. నేడు దేశ తలసరి ఆదాయం కంటే రాష్ట్ర తలసరి ఆదాయం రెట్టింపు స్థాయిలో ఉన్నది. తలసరి విద్యుత్ వినియోగంలోనూ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. ధాన్యం కొనుగోళ్లలో మొదటి స్థానంలో ఉన్నది. నిరంతర ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ లాంటి ఎన్నో వినూత్న పథకాలు, విప్లవాత్మక సంస్కరణలతో వ్యవసాయరంగం సుసంపన్నమైంది. మొత్తంగా దేశానికే తెలంగాణ అన్నపూర్ణగా నిలిచింది.
ఈఎనిమిదేండ్లలో పారిశ్రామిక, ఐటీ రంగాలు అభివృద్ధిలో పరుగులు తీశాయి. ప్రపంచ దిగ్గజ కంపెనీలకు మన రాష్ట్రం గమ్యస్థానమైంది. ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలైన యాపిల్, గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ తమ కార్యకలాపాలను విశ్వనగరమైన హైదరాబాద్‌లో విస్తృతపరిచాయి. స్టార్టప్ సంస్థల వేదికలైన టీ-హబ్, వీ-హబ్‌లు దేశానికే ఆదర్శమయ్యాయి. సేల్స్‌ఫోర్స్, ఉబర్, మైక్రాన్, స్టేట్ స్ట్రీట్, ఫియట్ క్రిజ్లర్, మాస్, ఇంటెల్, ప్రావిడెన్స్, యూబీఎస్, ఎంఫసిస్, పెప్సీ, లిగాటో, ఎఫ్-5 కంపెనీలు కూడా ఏర్పాటయ్యాయి. ప్రభుత్వం-నాస్కామ్ భాగస్వామ్యంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్‌గా హైదరాబాద్ నిలిచింది. నాస్కామ్ అంచనాల ప్రకారం జాతీయస్థాయిలో 2020-21లలో ఐటీ రంగంలో ఉపాధి పొందిన వారి సంఖ్య 1.38 లక్షలు. దీంట్లో 33 శాతం ఉపాధి కల్పనకు తెలంగాణ భాగస్వామ్యాన్ని అందించింది. ప్రభుత్వం రాష్ట్రంలోని ద్వితీయశ్రేణి నగరాలకు ఐటీ పరిశ్రమను విస్తరింపజేస్తున్నది. తెలంగాణ ఐటీ ఎగుమతుల మొత్తం విలువ రూ.1,45,522 కోట్లు. 2020-21 గణాంకాల మేరకు కొత్తగా 46 వేలపై చిలుకు ఉద్యోగాలను ఏటా పెంచు తూ దాదాపు 6,28,615 మందికి ఈ రంగం లో పనిచేసేందుకు అవకాశం కల్పించింది.
తెలంగాణలో నీటిపారుదల రంగానికి వస్తే.. ప్రపంచంలోని ఎత్తిపోతల ప్రాజెక్టుల్లో కాళేశ్వరం అతిపెద్ద ప్రాజెక్టు. దశలవారీగా భారీ ఎత్తిపోతలను ప్రభుత్వం రికార్డు సమయంలో నిర్మించింది. ఈ ప్రాజెక్టుతో ఒకప్పటి కరవు జిల్లా పాలమూరు పచ్చలహారంగా మారింది. నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, నిజాంసాగర్ తదితర పాత ప్రాజెక్టుల కాల్వలను ప్రభుత్వం ఆధునికీకరించింది. రాష్ట్రవ్యాప్తంగా నదులు, వాగులు, వంకల పునరుజ్జీవం కోసం రూ.3,825 కోట్లతో 1200 చెక్‌డ్యాంల నిర్మాణం జరుగుతున్నది. పాలమూరు-రంగారెడ్డి, సీతారామ, డిండి, గట్టు ఎత్తిపోతల, చనాఖా-కొరాట తదితర ప్రాజెక్టుల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.1.52 లక్షల కోట్లు వెచ్చించి సాగునీటి పారుదల సౌకర్యాలను మెరుగుపరిచింది. వైద్య, ఆరోగ్య రంగంలోనూ రాష్ట్రం గణనీయమైన పురోగతి సాధించింది.
కరోనా సృష్టించిన సంక్షోభం నుంచి తెలంగాణ తొందరగా కోలుకున్నదని ‘భారత ఆర్థిక సర్వే 2020-21’ అభినందించడం తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ దక్షతకు దక్కిన గుర్తింపు. దళితులను ఆర్థికంగా బలోపేతం చేయాలని, సామాజిక వివక్ష నుంచి వారికి విముక్తి కలిగించాలనేది కేసీఆర్ ఆకాంక్ష. దళితులంతా స్వశక్తితో, స్వావలంబనతో జీవించాలన్నదే ప్రభుత్వ సంకల్పం. అందులో భాగంగానే ప్రభుత్వం ‘దళితబంధు’ పథకాన్ని ప్రా రంభించి అమలు పరుస్తున్నది. ఈ పథకం కింద ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నది.
ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త కొత్త సంక్షేమ పథకాలను ప్రారంభిస్తూ విజయవంతంగా అమలుచేస్తున్నది. దీంతో అన్నివర్గాల ప్రజల మన్ననలు అందుకుంటున్న టీఆర్ఎస్ పార్టీకే మూడోసారి కూడా ప్రజలు పట్టం కడుతారని పలు సర్వేలు తెలుపుతున్నాయి. రాష్ట్ర ఆవిర్భావం నుంచి ప్రభుత్వం చేసిన అభివృద్ధి కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తున్నది. దేశంలోనే అతి ప్రభావవంతమైన ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్… దేశ రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించనున్నది. కేంద్రంలోని అసమర్థ ప్రభుత్వం కారణంగా దేశ ఆర్థికవ్యవస్థ దెబ్బతిని, ఆకలి, పేదరికం, నిరుద్యోగంలాంటి సామజిక, ఆర్థిక సమస్యలు మరింత పెరుగుతున్నాయి. ఈ సమయంలో ఇతర జాతీయ పార్టీల కంటే రాష్ర్టాల్లోని ప్రాంతీయ పార్టీలకే పట్టం కట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. తెలంగాణ విషయానికి వస్తే ప్రభుత్వం అమలుచేస్తున్న విధానాలు, సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ పార్టీకి శ్రీరామరక్ష.
(వ్యాసకర్త: జి.రాజేష్ , 96035 79115 , పరిశోధక విద్యార్థి, ఓయూ)