బిడ్డ ఏడుపు విని తల్లి ఎలా పరిగెడుతుందో, ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు నాయకులు అలా పరిగెత్తాలి, వారే నిజమైన ప్రజా సేవకులు అన్నారు లోవెల్. అటువంటి అరుదైన లక్షణాలున్న నాయకుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. అనుకోని విపత్తులు ఎదురైనప్పటికీ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సమర్థంగా విపత్తు నిర్వహణ చర్యలు చేపట్టడం, బాధితులకు భరోసా కలిగేలా స్వయంగా తానే ప్రజాక్షేత్రంలో పర్యటించటం కేసీఆర్ పనితీరు. గతంలో కరోనా విపత్తు సమయంలోనూ ఇది చూశాం.
రాష్ట్ర ఆవిర్భావం మొదలు నేటి వరకు ఏ విపత్కర పరిస్థితుల్లోనైనా ప్రజలను ఆదుకుంటున్నారు సీఎం కేసీఆర్. ప్రస్తుత వరదలు, వర్షాల్లోనూ ఆయన అదే విధంగా ప్రజల వద్దకే వెళ్లి వారికి ధైర్యం చెప్పారు. ప్రతికూల పరిస్థితులను సైతం లెక్కచేయకుండా క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఏరియల్ సర్వే ద్వారా గోదావరి నది ఉధృతిని, ముంపు ప్రాంతాల పరిస్థితిని అంచనా వేశారు. దాదాపు ఒకటిన్నర కిలోమీటర్లు బురద నీటిలో నడిచి వరద ప్రభావిత ప్రాంతాలను, కరకట్టలను పరిశీలించారు. కుటుంబ పెద్దలాగా పునరావాస కేంద్రాల్లో బాధితులతో మాట్లాడి, వారి యోగక్షేమాలు, కల్పిస్తున్న వసతులను గురించి తెలుసుకున్నారు. మెరుగైన వసతుల కల్పనకు అధికారులకు సూచనలిచ్చారు. బాధ్యతాయుతమైన ప్రభుత్వాధినేతగా,ప్రజల సంక్షేమం పట్ల సీఎం కేసీఆర్ తపన ఈ పర్యటన సందర్భంగా మరోసారి స్పష్టంగా కనిపించింది.
వారం రోజులు గోదావరి బేసిన్లో కురిసిన భారీ వర్షాలు తెలంగాణ సమాజాన్ని అతలాకుతలం చేశాయి. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు తీవ్ర నష్టాలను చవిచూశాయి. సాగునీటి ప్రాజెక్ట్‌లు పూర్తిగా నిండి ప్రమాదకర స్థాయికి చేరాయి. దీంతో వందలాది గ్రామాలు, లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. దాదాపు 22 వేల మందికి పైగా ప్రజలు ఒక్క కొత్తగూడెం జిల్లాలోనే పునరావాస కేంద్రాలకు తరలించబడ్డారు. ఈ విపత్తు నుంచి ప్రజలు బయటపడేందుకు గత వారం రోజులుగా సమీక్ష సమావేశాల ద్వారా స్థానిక నాయకత్వానికి, అధికార యంత్రాంగానికి, దిశా నిర్దేశం చేసిన సీఎం కేసీఆర్ చివరగా తానే రంగంలోకి దిగారు.
ఊహించని పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రభుత్వాలు అవలంబించే విపత్తు నిర్వహణ విధానాల మీదనే ప్రజల భవితవ్యం ఆధారపడుతుంది. గతంలో పనిచేసిన ప్రభుత్వాలు ఈ విషయంలో వైఫల్యం చెందాయి. కానీ రాష్ర్టావతరణ తర్వాత పరిస్థితిలో గణనీయంగా మార్పు వచ్చింది. ప్రజలకు అన్ని వేళలా.. వెన్నంటే ఉంటూ భరోసా కల్పిస్తున్నది ప్రభుత్వం. ప్రణాళిక బద్ధంగా సహాయ కార్యక్రమాలు చేస్తూ, మెరుగైన వసతులు కల్పించడంలో, నష్ట నివారణలో కీలకంగా వ్యవహరించింది.
వరద ప్రాంతాల పర్యటనలో కేసీఆర్ ప్రజల సకల సమస్యలనూ పరిష్కరించేందుకు తగు సూచనలు, కార్యాచరణ ప్రకటించారు. ముంపు ప్రాంతాల్లో మెరుగైన వసతుల కల్పనకు తక్షణ సహయం కింద ములుగుకు 2.5 కోట్లు, భద్రాద్రికొత్తగూడెంకు 2.3 కోట్లు, జయశంకర్ భూపాలపల్లికి 2.0 కోట్లు, మహబూబాబాద్‌కు 1.5 కోట్ల నిధులు కేటాయించారు, అవసరమైతే మరింత వెచ్చించేందుకు కూడా సిద్ధమని ప్రకటించారు. సహాయ చర్యల కోసం ఏటూరునాగారం, భద్రాచలంలో రెండు హెలికాప్టర్లు అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. ప్రజలను కడుపులో పెట్టుకొని చూడటం అంటే ఏమిటో చూపారు.
వరదలు వచ్చిన ప్రతిసారి గత పాలకులు తాత్కాలిక మరమ్మతులతో ప్రజాధనాన్ని వృథా చేశారు తప్పితే, శాశ్వత పరిష్కారం దిశగా ఏనాడు ఆలోచించలేదు. సీఎం కేసీఆర్ గోదావరి తీర ప్రాంత ప్రజల కష్టాలకు శాశ్వత పరిష్కార మార్గం చూపే దిశగా నిర్ణయం తీసుకున్నారు. కాళేశ్వరం నుంచి కొత్తగూడెం వరకు కరకట్టను బలోపేతం చేయనున్నట్టు, భవిష్యత్తులో 100 అడుగుల నీటిమట్టం నమోదైనా ముంపునకు గురి కాకుండా ఏంచేయాలో ప్రణాళికల రూపకల్పనకు ఆదేశించారు.
అవసరమైతే ఉత్తరాఖండ్ వంటి రాష్ర్టాల్లో అవలంబిస్తున్న విధానాలను అధ్యయనం చేయడంతో పాటు, నిష్ణాతుల సేవలను వినియోగించుకుంటామని అనడం సమస్య నిర్మూలన పట్ల ముఖ్యమంత్రి దూరదృష్టికి నిదర్శనం.
అయితే, ఇక్కడ రాజకీయ స్వార్థంతో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు హాస్యాస్పదంగా ఉన్నాయి. కాళేశ్వరం కారణంగానే వరదలు సంభవించాయనే ఆరోపణలు చేస్తున్నారు. కానీ కాళేశ్వరం బ్యాక్ వాటర్‌తో ముంపునకు గురైన దాఖలాలు ఎక్కడా లేవు. పోలవరం నిర్మాణం అశాస్త్రీయంగా ఉన్నదని, డిజైన్ మార్చి ఎత్తు పెంచడం ద్వారా భవిష్యత్తులో తెలంగాణ, ఏపీ సరిహద్దు ప్రాంతాలు ముంపునకు గురవుతాయని గతంలోనే అభ్యంతరాలు లేవనెత్తినా ఆంధ్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. సరిహద్దు వివాదాల్లో పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్రం సైతం సమస్య పరిష్కారం దిశగా కృషి చేయలేదు.
వరద కారణంగా చాలా గ్రామాల్లో విద్యుత్ సమస్యలు ఏర్పడ్డాయి. రోడ్లు తెగిపోయాయి, బ్రిడ్జిలు కూలిపోయాయి. వాటి పునరుద్ధరణకు తక్షణమే చర్యలు తీసుకునేలా అధికారయంత్రాంగాన్ని సీఎం కేసీఆర్ ఆదేశించారు. గత అనుభవాల దృష్ట్యా అంటు వ్యాధులు వ్యాపించకుండా బ్లీచింగ్ చేయించాలని, మెరుగైన వైద్య సదుపాయాలు విస్తృతపరచాలని ఆరోగ్యశాఖ సిబ్బందిని ఆదేశించారు. దీంతో ప్రతీ మండలానికి ఒక జిల్లా ఆరోగ్య శాఖ అధికారి, మలేరియా అధికారి ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్‌లు నిర్వహిస్తున్నారు. సురక్షిత మంచినీరు అందించేందుకు కృషి చేస్తున్నారు.
ముంపుపై అవగాహన లేకపోతే అది కలిగించే కష్టాలు, నష్టాలు అధికంగా ఉంటాయి. ఎక్కడి నుంచి వరద వస్తుందో, ఎంత ఎత్తున వస్తుందో తెలిస్తే కొంత మేర నష్టాన్ని నివారించేందుకు ఆస్కారం ఉంటుంది. ఆ అంశంలో ప్రజల్లో అవగాహన కలిగించేందుకు వరద పరిస్థితిని అధ్యయనం చేసి, భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా ఒక బుక్లెట్ రూపొందించాలని నీటిపారుదలశాఖను కేసీఆర్ ఆదేశించటం హర్షణీయం.
పునరావాస శిబిరాల్లో ఉన్న కుటుంబాలకు తక్షణ సాయం కింద ప్రతి ఇంటికి పదివేల రూపాయలతోపాటు, రానున్న రెండు నెలల పాటు ఒక్కో వ్యక్తికి 20 కిలోల చొప్పున బియ్యం ఉచితంగా పంపిణీ చేయనున్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా భద్రాద్రి జిల్లాలో సింగరేణి సౌజన్యంతో ఎత్తయిన ప్రదేశాలలో, అవసరం మేరకు రెండు మూడు వేల ఇండ్ల నిర్మాణంతో పాటుగా, ఆలయ పరిసరాలు, కరకట్ట మరమత్తులకు రూ.1,000 కోట్లు ప్రకటించి సీఎం కేసీఆర్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. దీంట్లో ఎటువంటి జాప్యానికి తావు లేకుండా, ఇండ్ల నిర్మాణానికి భూ సర్వే తక్షణమే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రప్రజలను తన కుటుంబసభ్యులుగా భావించి, ఒక కుటుంబపెద్దలాగా ఆదుకోవటం, విపత్తు సమయంలో వెంట నిలువటం ఆదర్శనీయం.
(వ్యాసకర్త: ఉపకులపతి, కాకతీయ విశ్వవిద్యాలయం)
-ప్రొఫెసర్
తాటికొండ రమేష్