Mustard Oil | మనం మన వీలు, రుచిని బట్టి అనేక రకాల వంట నూనెలను వాడుతూ ఉంటాం. మనం వాడే వివిధ రకాల వంట నూనెలలో ఆవాల నూనె ఒకటి. దీనిని ఉత్తర భారతదేశంలో ఎక్కువగా వాడతారు. ఎంతోకాలంగా ఆవాల నూనెను వంటకాలల్లో వాడుతున్నారు. కొందరు దీనిని చర్మ సంరక్షణ కొరకు కూడా వాడతారు. అయితే వంటల్లో ఆవాల నూనెను వాడడం మంచిదేనా.. దీనిని దీర్ఘకాలం పాటు వాడడం వల్ల గుండె జబ్బులు వస్తాయా.. అన్న సందేహాలు కూడా మనలో చాలా మందికి వస్తూనే ఉంటాయి. ఫెడరల్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వంటి ఇతర దేశ సంస్థలు ఆవాల నూనె బాహ్య వినియోగానికే పనికి వస్తుందని చెబుతున్నారు. అయితే భారతీయ అధ్యయనాలు ఆవాల నూనె గుండెకు మంచిదని సిఫార్సు చేస్తూ ఉంటాయి. అసలు ఆవాల నూనె గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందా.. లేదా.. దీనిని ఆహారంగా తీసుకోవచ్చా.. అధ్యయనాలు దీని గురించి ఏం చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆవాల నూనెలో అధిక స్థాయిలో యురుసిక్ ఆమ్లం ఉంటుంది. దాదాపు 30 నుండి 50 శాతం వరకు యురుసిక్ ఆమ్లం ఉంటుంది. ఇది మోనో అన్‌శాచురేటెడ్ ఒమెగా 9 కొవ్వు ఆమ్లం. యురుసిక్ ఆమ్లాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మయోకార్డియల్ లిపిడోసిస్ కు దారి తీస్తుంది. ఇది గుండె కండరాల్లో కొవ్వు పేరుకుపోయే ఒక పరిస్థితి. ఇటువంటి వివాదం ఉన్నప్పటికీ భారతదేశంలోని కార్డియాలజికల్ కమ్యూనిటీ వారు చాలా కాలంగా ఆవనూనెను సమర్థిస్తున్నారు. ఆవనూనెను వంటలల్లో వాడడం వల్ల కరోనరీ హార్ట్ డిసీజ్ ప్రమాదం 70 శాతం వరకు తగ్గుతుందని తేలింది. ఆవనూనెలో అధిక MUFA కంటెంట్ ధమనుల నుండి చెడు కొలెస్ట్రాల్ ను తొలగించడానికి సహాయపడుతుంది. అథెరోస్క్లెరోసిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
అలాగే ఆవనూనె అధిక పొగబిందువును కలిగి ఉంటుంది. సుమారు 250 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు వేడి చేసినప్పటికి విషపూరిత సమ్మేళనలుగా విచ్చినం కాదు. ఇది భారతీయ వంటగదుల్లో వాడుకోవడానికి సురక్షితంగా ఉంటుంది. ఆవాల నూనెను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తనాళాల స్థిస్థాపక మెరుగుపడుతుంది. దీంతో రక్తపోటును నిర్వహించడంలో సహాయపడుతుంది. ఇలా ఆవాల నూనె గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. అయితే ఆవాల నూనె ప్రయోజనాలను అందిస్తున్నప్పటికీ దీనిని వాడడం వల్ల దుష్ప్రభావాలు లేకపోలేదు. దీని అధిక వినియోగం, సరికాని ఉపయోగం హానిని కలిగిస్తుంది.
ఆవాల నూనె వినియోగం మయోకార్డియల్ లిపిడోసిస్ మానవుల్లో రావడానికి ఆధారాలు తక్కువగా ఉన్నప్పటికీ గుండె జబ్బులు ఉన్న వ్యక్తులు దీనిని తీసుకోకపోవడమే మంచిది. ఆవాల నూనెలో అధికంగా ఉండే యురుసిక్ ఆమ్లం గుండెకు హానిని కలిగిస్తుంది. గుండె అనారోగ్యంతో బాధపడే వారు యురుసిక్ ఆమ్లం రకాల ఆవాల నూనెను ఉపయోగించడం మంచిది. సున్నితమైన చర్మం ఉన్నవారు, శిశువులకు ఆవాల నూనెను చర్మంపై రాయడం వల్ల ఎరిథెమా ( ఎర్రగా మారడం) లేదా బొబ్బలు రావడం జరుగుతుంది. ఇక ఆర్జిమోన్ నూనెతో కల్తీ చేయబడిన ఆవాల నూనె అంటువ్యాధి డ్రాప్సీకి కారణమవుతుంది. ఇది తీవ్రమైన గుండె వైఫల్యానికి దారి తీస్తుంది. ఆవాల నూనె మన గుండె ఆరోగ్యానికి మేలు చేసేదే అయినప్పటికీ దీనిని తక్కువ పరిమాణంలో తీసుకోవడం చాలా అవసరం. ఒక వ్యక్తి రోజుకు 15 నుండి 20 మి.లీ ఆవ నూనెను మాత్రమే తీసుకోవాలి. ఆవనూనె ఆరోగ్యకరమైన వంటనూనె అయినప్పటికీ దానిని తీసుకునే విధానం, నియంత్రణ, నూనె నాణ్యతను దృష్టిలో ఉంచుకోవడం కూడా అవసరమని నిపుణులు తెలియజేస్తున్నారు.