‘నాకుఁన్ జెప్పరె వలపు నలుపో తెలుపో…’
అంటారు పదకవితా పితామహుడు అన్నమయ్య.
అట్లా నలుపు తెలుపుల్లో కాదు గానీ, చాలా గ్రే ఏరియాల్లో, బిట్వీన్ ది లైన్స్‌లో చూడగలిగితే వలపు విలువ తెలుస్తది. వలపు అంటే ప్రేమ. ఇదేదో ఫిబ్రవరి 14న పనీపాటా లేని భజరంగదళ్ వీరంగం వేసే ప్రేమ కాదు. నేను చెప్తున్నది విశ్వజనీన ప్రేమ. అనంతమైన ప్రేమ. అజెండాలు లేని ప్రేమ.
విద్య, వైద్యం, నీళ్లు, నిధులు, నియామకాలు జరుగుతూనే ఉన్నయి కదా?
ఎన్నో అభివృద్ధి సూచీల్లో తెలంగాణ ఎవరికీ అందనంత వేగంగా ప్రగతి బాటలో ఉన్నది కదా? ఉద్యమ లక్ష్యాల సాధన సాగుతూనే ఉన్నది కదా? అందరు మెచ్చిన పాలన దేశవ్యాప్తం చేయాలా, వద్దా? పైన చెప్పినట్టు ప్రజల నడ్డి నడ్డా పార్టీ విరుస్తూ ఉంటే ఊకుందామా? పోరాట వీరునికి మద్దతు ఇవ్వవద్దా?
విభజన చట్టం ప్రకారం మన రాష్ర్టానికి రావాల్సిన హక్కుల ఊసేదీ? మీలో ఎవరైనా ఒక్కసారి జంతర్ మంతర్ వద్ద కూచున్నరా? ఎందుకు మీ అందరికీ తెలంగాణపై దుగ్ధ? దేశంలోని 19 రాష్ర్టాల్లో ఏం ఉద్ధరిస్తున్నదని బీజేపీ తెలంగాణలో గద్దె ఎక్కాలి? మీ అంతర్గత సమావేశాల్లోనైనా ఎపుడన్న చర్చ పెట్టిన్రా? కేసీఆర్‌పై వ్యక్తిగత కక్షలో, కుల/మత పంచాయితీలో తప్ప మీ ఆగ్రహం ప్రజల కోసమా? తటస్థంగా ఉన్న ఉద్యమకారులకు, పలు సంస్థలు/ సంఘాలవారికి కూడా ఇవే ప్రశ్నలు.
మొన్న ప్రెస్మీట్లో కేసీఆర్ అన్నరు గుర్తుం దా- ‘నేను మీ బిడ్డని, నన్ను ప్రేమించండి’ అని. ఆ ప్రేమ! అవును మనం ఇపుడు కేసీఆర్‌ను ప్రేమిద్దాం. ఎందుకంటే… Every battle is won before its ever fought : Sun Tzu (Art of war). పైకి కనపడే యుద్ధాలు, వాటి ఫలితాలు ముందే రాసి ఉంటాయి అని స్థూలంగా అర్థం. తెలంగాణ మోడల్‌ను దేశవ్యాప్తం చేసే యుద్ధపు ఫలితం రాసిపెట్టి ఉంది. అందుకే అన్ని పార్టీలకు దడగా ఉన్నది. గల్లీలోనూ, ఢిల్లీలోనూ తెలంగాణపై విషం కక్కినవారు దింపుడుగల్లం ఆశతో తమ ప్రయత్నాలకు మరింత పదును పెడుతున్నరు. అందులో బొక్కబోర్లా పడుతనే ఉన్నరు.
గత వారం పది రోజులుగా రాష్ట్రంలో హైడ్రామా నడుస్తున్నది. ఢిల్లీ నుంచి వచ్చిన పగటి వేషగాళ్ళు; విజయవాడ కేంద్రం నడిపించే ఏజెంట్లూ; వీరికితోడు రాష్ట్రంలోని మరికొందరు కేసీఆర్‌పై వ్యక్తిగత కోపంతో తెలంగాణపై విషం కక్కడం నిరంతరం చేస్తూనే ఉన్నరు. వీరు ఎవరైనా దేశ ప్రజల జీవితాలను పిప్పి చేస్తున్న బీజేపీని విమర్శించడం విన్నారా? రాష్ర్టాన్ని ముప్పుతిప్పలు పెడుతున్న మోదీ-షాలను ఎపుడైనా నిలదీసిన్రా? ఎప్పుడూ లేనంత నిరుద్యోగం, పేదరికం తాండవిస్తూ ఉంటే, ప్రజలు 170 శాతం పెరిగిన ధర చెల్లించి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గ్యాస్ సిలిండర్ కొనడం శ్రేష్ట్ భారత్‌కు నిదర్శనమా అని అడిగిన్రా? పెరుగు, లస్సీ, మజ్జిగ, మాంసం, పనీర్, తేనె, చేపలపై కూడా 5 శాతం పన్ను వేస్తే నోరు మెదపరేమి? స్కూల్ పిల్లలు వాడే పెన్సిల్స్, షార్ప్‌నర్ పైన 18 శాతం ఎందుకు? సామాన్యులకు విద్యను భారం చేస్తరా? ఎండు చిక్కుళ్ళు, గోధుమ పిండి, బెల్లం, ఉబ్బిన బియ్యం, సేంద్రీయ ఆహారంపై కొత్తగా 5 శాతం బాదుడు ఎందుకు? నిత్యావసర వస్తువులపై ఎడాపెడా బాదేసి; వజ్రాలపై మాత్రం 1.5 శాతం, బంగారంపై 3 శాతం మాత్రమే ఎందుకు? లక్షల కోట్ల కుంభకోణాలు, ఎన్నడూ లేనంత రూపాయి పతనం, ఏడాదికి 1.30 కోట్ల ఉద్యోగాల కోత, 8.3 శాతం నిరుద్యోగం. 38 శాతం పరిశ్రమలు మూత… ఇవి ఎప్పుడైనా మిమ్మల్ని నిద్రపట్టకుండా చేసినయా?
బీజేపీ దళిత రాష్ట్రపతి ఏ మాత్రం దళితుల హక్కులు కాపాడిండు తన హయాంలో? ద్రౌపది ముర్ముకు ఎంత గౌరవం ఇస్తున్నరో నరేంద్ర మోదీ ఫొటో మాత్రం వేసిన ద్రౌపది ముర్ము వెల్కం ఫ్లెక్సీ తెలియజేసింది! మొత్తం లోక్‌సభ, రాజ్యసభల్లో బీజేపీకి 315 మంది ఎంపీలు ఉంటే అందులో ఒక్క ముస్లిం కూడా లేరు. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో బీజీపీ ఒక్క ముస్లింను అసెంబ్లీకి పంపలేదు. ఇంక ‘సబ్ కా సాథ్ సబ్ కా వికాస్’ ఎట్లా సాధ్యం? ఇపుడు ముక్తార్ అబ్బాస్ నఖ్వీకి ఉప రాష్ట్రపతి ఇస్తే అది ముస్లింలకు గౌరవమా? దళితులను, ఆదివాసీలను, బీసీలను అందలం ఎక్కిస్తున్నం అని బీజేపీ అనడం ఎలాంటిదంటే… సర్దార్ పాపారాయుడు సినిమాలో ‘భారతీయులకు అవమానం జరుగుతున్నది’ అని ఎన్టీఆర్ అంటే, తెల్లదొర మోహన్‌బాబు అంటడు – ‘మీ భారతీయులు మా స్నేహితులు.
మా వంటవాడు భారతీయుడు, మా తోటవాడు భారతీయుడు, మా పనివాడు భారతీయుడు, మా దీపాలు ముట్టించేవాడు భారతీయుడు’ అని. అట్లా! ఇంకా 30 ,40 ఏండ్లు బీజేపీ ప్రభుత్వమే ఉంటుందంటున్నడు అమిత్ షా. ఇంకో పదేండ్లయ్యాక ఈ దేశం అంతా అదానీ, అంబానీల పరం అయిపోయాక మీరు పాలించడానికి శ్మశానాలే మిగిలి ఉంటాయి. ‘పిశాచాల ఏలికో శ్మశానాలు ఏలుకో’ అని వేటూరి పాట పాడుకోవాల్సిందే ఇక. మరొక వికారమైన విషయమేమంటే మొన్న అల్లూరి జయంతి రోజున మోదీ-షా సహా బీజేపీ నేతలు విప్లవం, తిరుగుబాటు అంటూ మాట్లాడిన్రు. ఎంత నగుబాటు! దేశమంతా నిరసన గొంతులను తొక్కేసి, జైళ్లల్లో కుక్కేసిన మీరు ‘విప్లవం’ అంటూ శ్లాఘిస్తరా? మీ మాటలు అల్లూరి స్ఫూర్తికే విరుద్ధం. కీర్తిశేషులకు ఆత్మఘోష కలిగించే ఈ తంతు ఎందుకయ్యా, తగలెయ్యనా?
మొన్న హైదరాబాద్ సభలో కొందరు నాయకులు ‘భాగ్యనగర్ భాగ్యనగర్’ అంటూ ఆపసోపాలు పడటం వాళ్ల అజెండా లేమికి తార్కాణం. ప్రజలకు సంబంధించినదేమీ వద్దు వారికి. ఆ రెండు రోజుల బీజేపీ, టీఆర్ఎస్ల బ్యానర్ అడ్వర్టయిజ్‌మెంట్స్ చూస్తే అర్థమవుతుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం గత ఎనిమిదేండ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చెప్పుకొంటే, బీజేపీ ప్రకటనల్లో మోదీ ఫొటో తప్ప మరో అంశమూ లేదు, అజెండా లేదు. వాళ్లు దేశమంతా వెలగబెట్టిందేమీ లేదు సరే, రాబోయే రోజుల్లో ఏమి చేయగలరని కూడా చెప్పలేని దౌర్భాగ్యం. అందుకే ఈ పేర్ల మార్పు వేషాలు.
మేము పేర్లు మార్చము. ఈ నేలకు పేరు తెస్తాం.
మేము రక్తం మడుగులు కట్టం, రక్తం ధారపోస్తాం.
ఇది తెలంగాణ-దేశపు కొత్త ఆశ!
‘హైదరాబాద్ నగరం ప్రతిభకు పట్టం కడుతున్నది. యాదాద్రి నరసింహస్వామి, అలంపూర్ జోగులాంబ, వరంగల్లు భద్రకాళిలతో కూడిన పవిత్ర భూమి తెలంగాణ. వారి ఆశీస్సులు దేశం మొత్తానికి ఉంటయి. ప్రతాపరుద్రుడు, రాణి రుద్రమదేవి నుంచి కొమురం భీమ్ వరకూ తెలంగాణ పరాక్రమానికి ప్రతీకలు. భద్రాచలం రామదాసు నుంచి పాల్కుర్కి సోమనాథుడి వరకూ సాహితీ సౌరభాలు వెదజల్లినవారే, భారతదేశానికి ఎనలేని నిధి వంటివారే. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, వాస్తు శిల్పకళలు అందరికీ గర్వకారణం. తెలంగాణ ప్రజలు దేశ వికాసానికి పనిచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సేవలందించి దేశ సంపద పెంచుతున్నారు’ అన్నరు నరేంద్ర మోదీ మొన్న హైదరాబాద్ సభలో.
Then what is your problem? why are you here?! ఇవన్నీ సాధించుకున్నది మేము. మీ లొట్టపీసు పాత్ర అక్కర్లేదు. బీజేపీ మాటలు యూట్యూబ్ థంబ్‌నెయిల్స్ లాంటివి. తెరచిచూస్తే ఏమీ ఉండదు. పైన పటారం లోన లొటారం.
దేవుళ్ల పేరుతో గోల తప్ప బీజేపీకి విధానాల్లేవు. మొన్నొక మిత్రుడు అంటున్నరు Nordic hybrid model, latin american modelని పరిశీలించి భారత్ అవసరాలకు ఓ విధానం రూపొందించుకొని జనాల్లోకి వెళ్లకపోతే ఇక్కడి Leftకి సమస్యే. ఈ విషయంలో ప్రాంతీయ పార్టీలు కాస్త దగ్గరలో పనిచేస్తున్నయి. కానీ, Political economy మీద అధ్యయనం చేసే విభాగాలు ఆయా పార్టీల్లో ఉంటే ఇంకా మేలు. అపుడు దేశం ఇదే ఎన్నిక రాజకీయం ద్వారానే ముందడుగు వేయగలదు. BRS బాగా అధ్యయనం చేసి సరైన మోడల్ తేగలిగితే దేశానికి ఓ ప్రత్యామ్నాయం దొరికినట్టే. కూటమి కన్నా ఈ పార్టీని నిలబెట్టే కసరత్తు జరగాలి. దక్షిణాది నుంచి కేంద్ర అధికారం నడిచే రోజుకోసం ఎదురుచూస్తున్నాం.ఇదిగో, ఈ కారణాల వల్ల మనమంతా కేసీఆర్‌ను ప్రేమించాలి. ఉత్తుత్తి ప్రేమ కాదు. మనసంతా నిండిన దేశాభివృద్ధి కాంక్షతో ప్రేమిద్దాం. కలిసి నడుద్దాం.
‘నీళ్ళు కిందకు దూకడం వింత కాదు, అది గ్రావిటీ అనే సైన్స్’ అని అస్కార్ వైల్డ్ సెటైర్ వేస్తరు నయాగరా ఫాల్స్ చూసి. నీళ్లు fall కాదు, rise అవడం గొప్ప అని ఆయన ఉద్దేశం. అప్పటికి అది సాధ్యమని వైల్డ్‌కు తెలియదు, ఎందుకంటే అప్పటికింకా కేసీఆర్ పుట్టలేదు, కాళేశ్వరం కాలేదు కాబట్టి!! ఇవిగో, ఇలాంటి ఎన్నో అద్భుతాలు స్వప్నించి, సాక్షాత్కారింపజేసిన కేసీఆర్‌ను ప్రేమించకుండా ఎట్లా సాధ్యం? ‘అద్భుత ప్రగతి సాధిస్తున్న రాష్ర్టాలను అడ్డుకోకండి. అది దేశ ప్రగతిని అడ్డుకోవడమైతది. అభివృద్ధి చెందిన తెలంగాణ లాంటి రాష్ట్రం నుంచి వస్తున్న ఆదాయంతో బాగుపడుతున్న ఉత్తరాది రాష్ర్టాలు కూడా దివాళా తీస్తాయి’ అని ఆవేదన చెందిన కేసీఆర్‌ను ప్రేమించకుండా ఎట్లా ఆగడం?
కేసీఆర్ అంటే వ్యక్తిగత కక్ష ఉన్నవాళ్లను సూటిగా అడుగుతున్నా గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉండే సమస్యల గురించి లోతైన అవగాహన, పరిష్కార మార్గాలు మాత్రమే కాదు, విశ్వంలోనే భారత్‌ను సమున్నతంగా నిలుపగలిగే లక్ష్యసిద్ధి, దార్శనికత ఉన్నవారు మీ ఎరుకలో ఉన్నరా? ఒక్క పేరు చెప్పగలరా? అందుకే అంటున్నాం.. విప్లవకారకమైన ప్రత్యామ్నాయ అజెండా తయారుచేస్తున్న కేసీఆర్‌కు దన్నుగా నిలబడదాం. జాగృతమవుదాం. మాస్ మూవ్మెంట్ తెద్దాం. అందుకోసం భేషజాలు వదిలిపెట్టి, పదవుల కోసం పోరాటం ఆపేసి, ఆయనను ప్రేమిద్దాం. సమీప భవిష్యత్తులో ఇలాంటి నాయకుడు మరి రాడు!
‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన ఈ వ్యాసం, ఇలాంటి వ్యాసాలు కేసీఆర్ పట్ల భజన అని అనుకునేవారి కోసం ఒక్కమాట. ఎక్కడెక్కడి నుంచో, ఎవరెవరో సంప్రదిస్తూ ఉన్నరు గతంలో వచ్చిన వ్యాసాలు చదివి. తొంభై ఏండ్లు దాటిన విద్వత్ గలవారు, బీఎస్ఎన్ఎల్ లాంటి ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేసేవారు, ఎక్స్-సర్వీస్‌మెన్, కాంగ్రెస్, టీజేఎస్ లాంటి పార్టీల్లో ఉండేవారు, టీచర్లు, ప్రైవేట్ వ్యాపారంలో ఉన్నవారు, బీజేపీ అనుబంధ సంఘాల్లో పనిచేసేవారు ఎందరో చదువుతున్నరు, స్పందిస్తూ ఉన్నరు. ఒక సైన్యంగా ఏర్పడుతామంటున్నరు. ఒక వ్యక్తి కోసమో, ఒక పార్టీ కోసమో కాదు, దేశం కోసం, ధర్మం కోసం ఇపుడు కేసీఆర్ వెంట నడుస్తామంటున్నరు. అట్లా అంటున్నవారిని ఈ వ్యాసం చదివినవారు ఎవరైనా కలుస్తామంటే, ఆ ఏర్పాటూ చేయగలం. అందుకే, మజ్రూ సుల్తాన్‌పురి లాగా అడుగుతున్న- ‘ప్యార్ మాంగా హై తుమ్హి సే, దునియా కె లియే’! నమ్మకం ఉంచండి.
దేశాన్ని గట్టెక్కించడం ఒక్కటే లక్ష్యంగా పనిచేద్దాం. అందుకు కేసీఆర్ నేతృత్వంలో కదులుదాం. You wont regret. Thats the promise.
-శ్రీశైల్ రెడ్డి పంజుగుల 90309 97371