Inflammation | ప్రస్తుతం చాలా మంది గంటల తరబడి కూర్చుని పనిచేసే ఉద్యోగాలనే చేస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది వ్యాయామం చేయడం లేదు. ఫలితంగా అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా చాలా మంది ఇలా గంటల తరబడి కూర్చోవడం వల్ల చేతులు, పాదాల్లో వాపులు వస్తున్నాయి. కొందరికి ఇవే కాకుండా శరీరంలోని ఇతర భాగాల్లోనూ వాపులు వస్తున్నాయి. అలాగే తీవ్రమైన నొప్పులతోనూ ఇబ్బందులు పడుతున్నారు. ఇక నొప్పులు, వాపులు వచ్చేందుకు కేవలం ఈ ఒక్క అంశం మాత్రమే కాకుండా ఇంకా పలు ఇతర అంశాలు కూడా కారణం అవుతున్నాయి. ఆహారంలో అధికంగా ఉప్పును తీసుకోవడం, ప్రోటీన్లు ఉండే ఆహారాలను సరిగ్గా తినకపోవడం, గాయాలు లేదా దెబ్బలు తగలడం, పలు రకాల మందులను వాడడం, అధికంగా బరువు ఉండడం వంటి కారణాల వల్ల కూడా చాలా మందికి నొప్పులు, వాపులు వస్తున్నాయి. అయితే ఈ సమస్య నుంచి బయట పడేందుకు మనకు పలు ఇంటి చిట్కాలు ఎంతగానో దోహదం చేస్తాయి.
ఆలివ్ ఆయిల్లో మన శరీరానికి ఉపయోగపడే ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఈ నూనెలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అందువల్ల ఆహారంలో ఆలివ్ నూనెను చేర్చుకుంటే నొప్పులు, వాపులను తగ్గించుకోవచ్చు. ఈ నూనెలో ఉండే యాంటీ ఇన్ఫ్లామేటరీ లక్షణాలు నొప్పులు, వాపులను తగ్గిస్తాయి. టమాటాల్లో విటమిన్ సి, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వీటిలో యాంటీ ఇన్ఫ్లామేటరీ లక్షణాలు ఉంటాయి. అందువల్ల టమాటాలను రోజూ తింటే నొప్పులు, వాపులను తగ్గించుకోవచ్చు. మిరపకాయల్లోనూ యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లామేటరీ లక్షణాలు ఉంటాయి. అందువల్ల వీటిని రోజూ తీసుకుంటే నొప్పులు, వాపుల నుంచి బయట పడవచ్చు.
పసుపులో శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లామేటరీ లక్షణాలు ఉంటాయి. అందువల్ల దీన్ని రోజూ తీసుకోవాలి. రోజూ రాత్రి ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో కొద్దిగా పసుపు కలుపుకుని తాగితే సమస్యలను తగ్గించుకోవచ్చు. నొప్పులు, వాపులను తగ్గించడంలో గ్రీన్ టీ కూడా బాగానే పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లామేటరీ లక్షణాలు నొప్పులు, వాపులను తగ్గిస్తాయి. అలాగే ఈ సమస్య నుంచి బయట పడేందుకు ద్రాక్ష పండ్లు కూడా మేలు చేస్తాయి. ద్రాక్షల్లో రెస్వెరెట్రాల్ అనే సమ్మేళనం ఉంటుంది. అది మనకు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. వాపులను తగ్గిస్తుంది. ద్రాక్షలను రోజూ తింటున్నా నొప్పులు, వాపులను తగ్గించుకోవచ్చు. అలాగే అల్లం రసం కూడా మేలు చేస్తుంది. రోజూ ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఒక టీస్పూన్ మోతాదులో అల్లం రసాన్ని సేవిస్తుండాలి. లేదా అల్లాన్ని నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను కూడా తాగవచ్చు. ఇలా పలు చిట్కాలు మనకు మేలు చేస్తాయి.
అయితే నొప్పులు, వాపులు రావడం సహజమే అయినా వీటితోపాటు ఇంకొన్ని లక్షణాలు ఉంటే మాత్రం కచ్చితంగా వైద్యులను సంప్రదించాల్సిందే. వాపులు లేదా నొప్పులు ఉన్నట్లుండి తీవ్రతరం అయినా, ఛాతిలో నొప్పి వస్తున్నా, శ్వాస తీసుకోవడం కష్టంగా ఉన్నా, తీవ్రమైన జ్వరం లేదా ఒళ్లు నొప్పులు, వికారం, వాంతికి వచ్చినట్లు ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తున్నా కూడా నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే డాక్టర్ను సంప్రదించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఈ లక్షణాలు ప్రాణాంతక పరిస్థితులకు దారి తీసే అవకాశాలు ఉంటాయి. కనుక ఈ లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయకండి. ఇలా నొప్పులు, వాపుల పట్ల ప్రతి ఒక్కరు జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది.