నల్లగొండ జిల్లా హుజూర్నగర్ మండలంలోని అమరవరం (అమరారం) అనే గ్రామంలో అమరేశ్వరాలయంలో ఒక శాసనం ఉన్నది. కాకతీయ రాజుల అనంతర కాలంలో వేయించిన ఈ శాసనకాలం శ.సం.1753 = క్రీ.శ.1831 వికృతి నామ సంవత్సరం ఫాల్గుణ శుద్ధ పంచమి.
మంత్రి ప్రగడ శి(శీ)న య్య, గోవ(ప) య్య, రంగయ్య, చిరిశి(శీ)నయ్య, సామయ్య, మటయ్య, లింగగిరి పరగణ జమీందారు అమరలింగేశ్వరస్వామి భూదానాన్ని చేసి శాసనం వేయించారు. మజుకూరిలో స్వామివారి నిత్య నైవేద్యం, దీపారాధన జరపడానికి బొచ్చవానికుంటలో కర్ణపు బళరెడ్డి కౌలు చేస్తున్న బావికింద ఖండుగలు 1,60 వృత్తుల వరి నాటే పొలం, శ్రీనివాసపురం తోవలో పొలిమేర మీద ఉన్న ఖ.3 ముత్తుం జొన్నలు ఇప్పించినట్లు చెప్పబడింది. దానం చేసిన వరి పొలానికి హద్దులు తూర్పున మాదిగవాని మాన్యం, దక్షిణాన దుబ్బ, ఉత్తరాన బావిదగ్గర ఉన్న బొలుగురాళమిట్ట అట్లవారి మాన్యం చెలక, తూర్పున బయినేని మాన్యం ఉన్నాయి. జొన్న చెలకకు దక్షిణాన జానల దుబ్బ, పడమర వీరుణిచాల్ను చింతమళ చెలక, ఉత్తరాన లింగగిరి పొలిమేరగా ఈ హద్దులు ఏర్పర్చారు.
కాబట్టి సదరు హిజాగాలు ఖిర్దు వరి ఇప్పించుకొని అందులోని ఫలం అనుభవించవలసింది. దీనికి సాక్ష్యంగా శీనయ్య, గోపయ్య, రంగయ్య, చినశీనయ్య, సోమయ్య, మటయ్యగారలు, మంత్రిప్రగడ అప్పయ్య కొమారుడు రామయ్య కులకరణి గారల వ్రాలు అని పేర్కొనబడింది. ఇంకా గ్రామంలోని రైతులు పండించే ధాన్యానికి ఘోరబ 1కి 0008 చొప్పున సమర్పించాలి. నవరాత్రుల్లో జరిగే ఉత్సవాలకు ఏటా రూ. 3 సమర్పించడం జరుగుతుంది. శాసనంలో చివరగా వుస్తెల వంశ విస్తార, జంన్నెకుల గోత్ర పవిత్రుడు ముత్యనామాత్య పుత్రజనని వోబల నామధేయుడు, స(సు)జనగురు కటాక్ష కరుణ సకల దూంతప్రియ ఆర్యులకు దాసానదాసుడైన అంకిరెడ్డి నామధేయుని పేరు పేర్కొనబడింది.
ఈ శాసనం తెలిపేదేమంటే… సామూహికంగా ఒక దేవాలయానికి దానం చేయడం, ఆ దాన గ్రహీత దాన్ని స్వీకరించి ఫలాన్ని అనుభవించాలని కోరుకోవడం విశేషంగా చెప్పవచ్చు. దానమిచ్చినవారు జమీందారు స్థాయివారు అయినప్పటికీ ఎంతో వినయంగా స్వామివారికి సమర్పించి, తాము దానం చేసినది చాలా పకడ్బందీగా చుట్టుపక్కల సరిహద్దులను కూడా పేర్కొన్నారు. దాన భూమి మరి ఇంకెవరూ ఆక్రమించకూడదనే ఉద్దేశంతో ఆవిధంగా సరిహద్దులను చెప్పారు.
– భిన్నూరి మనోహరి