దక్షిణ భారతమంటే మద్రాసే. ‘మద్రాస్ ఇడ్లీ, ఇమ్లీ కా పానీ బస్ అంతే..’ అన్న దాన్ని చెరిపేయడానికి ‘తెలుగుదేశం’ పేరిట (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్)లో 80వ దశకంలో ఓ రాజకీయ పార్టీ ఆవిర్భవించాల్సి వచ్చింది. ఆ సమయంలో కూడా హైదరాబాద్ గుర్తింపునకు ఏ ఢోకా లేకుండే.
అలాగని హైదరాబాద్ తెలంగాణ అంతటినీ రిప్రెజెంట్ చేయకుండే. అదిగో… అప్పుడే తెలంగాణ అస్తిత్వం కోసం పోరాటం చేయాల్సి వచ్చింది. ఉమ్మడి రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచీ ఈ పోరు మసలుతూనే ఉన్నా ఎందరో నేతలు ప్రత్యేక తెలంగాణను నినదించినా.., ఆ అవసరాన్ని ఓ విప్లవంలా మలచి, విజయం సాధించింది మాత్రం కేసీఆరే.
తెలుగువారంటే… ఇడ్లీ, ఇమ్లీకా పానీ స్థానంలో గుంటూరు గోంగూర, ఆత్రేయపురం పూతరేకులు తెలుగు వాళ్ల గుర్తింపుగా మారి.. తెలంగాణ ఐడెంటిటీ అడుగంటింది. దాన్ని పైకి తెచ్చి సకినం, సర్వపిండితో తెలంగాణ ఉనికిని దేశవ్యాప్తం చేసిండు కేసీఆర్. దాదాపు 58 ఏండ్లపాటు.. ఆ తిండి, ఆ తిండినిచ్చే పంటలు పండే నేల మీది భాష అవమానానికి గురయ్యాయి. ఈ ప్రాంతపు ప్రత్యేకమైన సంస్కృతి ఉనికి లేకుండా ఉండిపోయింది. ఈ రోజు సకినం.. సర్వపిండి అంటే తిండిని కాదు, తెలంగాణలో పండుతున్న పంటలను గుర్తుచేస్తుంది.తెలంగాణ ముఖ్యమంత్రి వ్యవసాయానికి, తద్వారా వ్యవసాయ కుటుంబాలు.. రాష్ట్ర ఆహార, ఆదాయ భద్రతకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో చెప్పడానికి రాష్ట్రంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు, రైతు సంక్షేమ పథకాలే కనిపిస్తున్న, అనుభవంలోకి వచ్చిన సాక్ష్యాలు. 2013 లో తెలంగాణలోని మొత్తం గ్రామీణ కుటుంబాల్లో వ్యవసాయ కుటుంబాల శాతం 51.5 ఉంటే, తెలంగాణ ఏర్పడ్డాక 2019లో గ్రామీణ వ్యవసాయ కుటుంబాల శాతం 54.2కు పెరిగింది. అంటే తెలంగాణ వచ్చిన ఐదేండ్లకే దాదాపు మూడు శాతం వృద్ధి రేటు కన్పించింది. ఇది నేషనల్ శాంపిల్ సర్వే నివేదికలో వెల్లడైంది. వ్యవసాయరంగం పట్ల కేసీఆర్‌కు ఉన్న విజన్, చూపిస్తున్న శ్రద్ధ ఫలితమే ఇది. ఇది దేశమంతటికీ తెలిసిన నిజం.
రాష్ట్ర ఆహార, ఆదాయ భద్రత విషయానికి వస్తే.. 2021-22 రాష్ట్ర బడ్జెట్లో మొత్తం 13.5 శాతం వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాలకు కేటాయించారు. దేశంలో మిగిలిన రాష్ర్టాలు వ్యవసాయ రంగానికి కేటాయించిన సగటు కేటాయింపుల శాతం 6.3 మాత్రమే. సంక్షేమ పథకాల విషయానికి వస్తే.. ‘రైతుబంధు’ పథకం రైతులకు భరోసాగా ఎలా మారిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలంగాణ అభివృద్ధి వెలుగుకు మరో దివిటీ విద్యుత్తురంగం. తెలంగాణ ఒక్కటే 25.92 లక్షల మంది రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటు ఇస్తున్నది.
ఇక పారిశ్రామిక రంగంలో కేసీఆర్ తన వాగ్దానాలను ఒక్కొక్కటే నెరవేరుస్తూ వస్తున్నారు. పరిశ్రమల స్థాపనలో పాలనాపరమైన అడ్డంకులను అధిగమించి కేవలం 15 రోజుల్లో కొత్త పరిశ్రమలకు అనుమతులు లభించేలా ‘టీఎస్ ఐపాస్’ చట్టాన్ని తెచ్చారు. ఈ విషయంలో దేశానికే ఆదర్శప్రాయంగా నిలిచారు. ఈ చట్టం కింద 2014-15 నుంచి 2021- 22 మధ్యకాలంలో 18,761 పారిశ్రామిక అనుమతులు లభించాయి. దాదాపు రూ.2,26,806 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 16.32 లక్షల మందికి ఉపాధి లభించింది.
ఒక ప్రాంత అభివృద్ధి ఆ ప్రాంతంలోని మహిళలకు ఉన్న గౌరవం, గుర్తింపు మీదే ఆధారపడి ఉంటుందన్న అంబేద్కర్ మాటను పాటించడంలో తెలంగాణ సీఎం కేసీఆర్ అందరికన్నా ముందే ఉన్నారు. ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల కోసం ‘వి హబ్’ ఏర్పాటు చేశారు. ఇది మొదలైన మూడేండ్లలోనే 1,495 స్టార్టప్‌లతో రూ.56.8 కోట్ల నిధులను సమకూర్చుకొని 2,800 ఉద్యోగాలను సృష్టించింది. ఈ పరిస్థితిని గుర్తించిన కేసీఆర్.. ఉపాధి భద్రతలో కుల వృత్తులకు మునుపటి కళను తేవడం సబ్బండవర్ణాల ఆర్థిక ప్రగతికి ఒక బాట అని నమ్మారు. రైతులకు ట్రాక్టర్లను మంజూరు చేశారు. గొర్రెల పంపిణీ పథకంతో యాదవ, గొల్లకుర్మ సామాజికవర్గాల 3.81 లక్షల మంది లబ్ధిదారులకు 79.98 లక్షల గొర్రెలను పంపిణీ చేశారు.
ముదిరాజ్, గౌడ్, రజక, నాయీబ్రాహ్మణ తదితర వర్గాల కులవృత్తులకు పూర్వ వైభవం తెచ్చేందుకు అండగా నిలుస్తున్నారు. దళితుల కోసం ‘దళితబంధు’తో కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థికసాయాన్ని అందిస్తున్నారు. ఈ సమగ్ర చర్యలతో ఆయా సామాజిక వర్గాలు స్వావలంబన సాధించి మిగతా సామాజిక వర్గాలతో సమానంగా రాణిం చే సామర్థ్యాన్ని పొందుతారు. ఇప్పటికే ఆ మార్పు మొదలైంది. అనేక ఉన్నత హోదాల్లో బీసీ, దళిత, మైనారిటీవర్గాల వారు కనిపిస్తున్నారు. ఈ మార్పు బంగారు తెలంగాణ సాధనలో భాగమే. శాంతిభద్రతలు మరో ముఖ్యమైన అంశం. గతంలో తెలంగాణ పల్లెలు పోలీసుల పదఘట్టనల మధ్య అట్టుడికిపోయేవి. ఇప్పుడా దృశ్యాల్లేవు. దీనికి శాంతిభద్రతల నిర్వహణ పట్ల కేసీఆర్ తీసుకున్న చర్యలు కారణం. పోలీస్ శాఖను పీపుల్ ఫ్రెండ్లీగా మార్చారు. హిందు, ముస్లిం సంగమమైన హైదరాబాద్ లాంటి
చోట్ల మత ఘర్షణలకు చెల్లుచీటి పలికేలా చేశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్, ఇంత చక్కటి శాంతిభద్రతల నిర్వహణ దేశంలోని మరే రాష్ట్రంలోనూ కనిపించదు.
ఒక కుటుంబ పెద్ద తన ఇంటిని.. ఇంటిసభ్యుల అవసరాలను కనిపెడుతూ.. ఆ అవసరాలను తీరుస్తూ కుటుంబాన్ని ఏ విధంగా నడిపిస్తుంటాడో అదేతీరున కేసీఆర్ ఈ రోజు తెలంగాణను ముందుకు ఎలా నడిపిస్తున్నారు. ఎన్నో రంగాల్లో దేశంలోనే ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. తెలంగాణ అభివృద్ధి పట్ల కేసీఆర్‌కు ఉన్న విజన్, లక్ష్యాలే అనతికాలంలోనే రాష్ర్టాన్ని ప్రగతిపథంలో దూసుకుపోయేలా చేస్తున్నాయి. ఇలాంటి దూరదృష్టితో కూడిన సుస్థిరపాలనను తెలంగాణ ఒక్కటే కాదు యావత్ భారతదేశం కూడా ఆశిస్తున్నది. దానికి అర్హులు, సమర్థు లు.. కేసీఆర్ ఒక్కరే. అందుకే తమ అభినవ నాయకుడిగా.. ఈ ఒకే ఒక్కడివైపు దేశం చూస్తున్నది.
(వ్యాసకర్త: డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు , 92465 26899, తెలంగాణ మాజీ ప్రధాన సమాచార కమిషనర్)