ఒక జాతి జీవితంలో ఒకోసారి తీవ్రమైన పరీక్షా కాలం ఎదురవుతుంటుంది. అది ఆ జాతి కన్న కలలను, భవిష్యత్ లక్ష్యాలను పరీక్షకు నిలబెడుతుంది. అటువంటి క్లిష్ట స్థితిలో ఆ జాతి తగు వివేకంతో కూడిన నిర్ణయాలను సాహసోపేతంగా తీసుకోవలసి వస్తుంది. ఆ క్లిష్ట స్థితి నుంచి బయటపడేందుకూ, తన కలలు, లక్ష్యాలు నెరవేరేందుకూ ఆ విధమైన నిర్ణయాలు తప్పనిసరి. లేనట్లయితే ఆ జాతి వర్తమానంతో పాటు భవిష్యత్తు కూడా చేజారిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. ఇవన్నీ మానవజాతికి చరిత్ర చెప్పిన పాఠాలు.
కేసీఆర్ కొంతకాలంగా పదే పదే అంటున్న మాటలలో ఈ అర్థాలన్నీ దాగి ఉన్నాయి. తాను ప్రతిపాదిస్తున్నది గతంలో జరిగిన విధంగా కేవలం అధికార మార్పిడులు
కావని, దేశానికి కావలసిన, ప్రజలు కోరుకుంటున్న అభివృద్ధి సంబంధమైన సమూల- సమగ్ర మార్పులను సాధించగల ప్రత్యామ్నాయ అజెండా అన్న మాట
ఇప్పటికే మన ముందుకువచ్చింది.
ప్రస్తుతం మన భారతజాతికి ఎదురవుతున్న తీవ్రమైన పరీక్ష కాలాన్ని మనం మొదట అర్థం చేసుకోవాలి. వేల సంవత్సరాల చరిత్ర గల ఈ జాతి మధ్యయుగాల కాలంలో రాచరిక వ్యవస్థలతో, ఆధునిక కాలంలో విదేశీ వలస పాలనతో పోరాడి, ఎన్నెన్నో ఆశలతో స్వాతంత్య్రాన్ని సాధించుకున్నది. మొదటిసారిగా ఆధునిక పార్లమెంటరీ ప్రజాస్వామిక వ్యవస్థలోకి అడుగుపెట్టి, యావత్ ప్రపంచంలోనే అత్యుత్తమమైన, ప్రజలకు అనుకూలమైన వాటిలో ఒకటిగా పేరుబడిన రాజ్యాంగాన్ని రూపొందించుకున్నది.
ఆ విధమైన స్వాతంత్య్రానికి 75 సంవత్సరాలు, రాజ్యాంగానికి 72 సంవత్సరాల సుదీర్ఘమైన దశ పూర్తయి, మూడు తరాలు కూడా గడిచిపోయిన ఈ సమయానికి, మన భారతజాతి మహోజ్వలంగా విలసిల్లవలసింది. ప్రకృతి సహజ వనరులు, మానవ వనరుల విషయంలో మొత్తం ప్రపంచంలోనే అగ్రభాగాన నిలవగల ఈ దేశం, ఈ సరికి ఆర్థికాభివృద్ధిలో, మానవాభివృద్ధిలో కూడా ప్రథమ శ్రేణిలో ఉండవలసింది. కాని, ఇపుడు అందుకు విరుద్ధంగా జరుగుతుండటమన్నదే మనం మొదట అనుకున్న తీవ్రమైన పరీక్షా కాలం. మన భారతజాతికి ఆ పరీక్షను మరింత సంక్లిష్టంగా మార్చుతున్న విషయం మరొకటి ఉంది. అది, మనను ఈ సంకట స్థితి నుంచి బయటపడవేయగల, ఉజ్వలమైన భవిష్యత్తు వైపు నడిపించగల శక్తులేవీ ఎటుచూసినా కనిపించకపోవటం.
ప్రజలకు లెక్కలేనన్ని హామీలు ఇస్తూ అనేక పార్టీలు గడిచిన దశాబ్దాలలో దేశాన్ని పాలించాయి. ఒకరికి మరొకరం ప్రత్యామ్నాయమన్నాయి. కాని అవన్నీ చివరికి అధికారం కోసం పరస్పర ఘర్షణలుగా మిగిలి విఫలమయ్యాయి తప్ప, పైన చెప్పుకున్నట్లు, ఆర్థికాభివృద్ధి సూచీలను గాని, మానవాభివృద్ధి సూచీలనుగాని ముందుకు తీసుకువెళ్లలేకపోయాయి. అది చాలదన్నట్లు, వేర్వేరు ప్రజావర్గాల మధ్య ఆర్థిక వ్యత్యాసాలను, అభివృద్ధి తారతమ్యాలను మనకన్నా పెద్ద దేశాలతో పోల్చినా, అతి చిన్న దేశాలతో పోల్చినా హీనమైన స్థాయిలో నిలబెట్టాయి. ఆయా సూచీలలో మన ర్యాంకులు నానాటికి ఇంకా పతనమవుతుండటం ఒక అంతులేని విషాదంగా మారింది.
పాలించే పార్టీ ఏదైనా పరిస్థితి ఇదే. పుష్కలంగా ఉన్న వనరులు వినియోగంలోకి రావు. అభివృద్ధి జరగదు. సాటి దేశాలు ముందుకుపోతుంటాయి. మనం కనీసం ఉన్నచోటనైనా ఉండక వివిధ ర్యాంకులలో పతనమవుతుంటాము. ఒక్క ధనిక-పేద వ్యత్యాసాలలో తప్ప. మన భారతజాతికి ఇప్పుడు ఎదురవుతున్న పరీక్షాకాలం సరిగా ఇదే.
ఇంకా చెప్పాలంటే, ఎటుచూసినా ఆవేదనలమయంగా మారిన ఈ జాతిలో, ఈ రోజున, ఒక ఉత్తేజపూరితమైన జాతిస్ఫూర్తి కొరవడింది. స్వాతంత్య్రోద్యమ కాలం నాటి స్ఫూర్తి నాయకుల దయ వల్ల ఎన్నడో అంతరించిపోయింది. ఆ ఉద్యమ స్ఫూర్తిని నవ భారత నిర్మాణ స్ఫూర్తిగా మలిచి నడపగల దార్శనికత నాయకత్వాలకు లేకపోగా, స్వార్థంతో కూడిన పెడదారులకు అంతులేకుండాపోయింది. మనతోపాటు స్వతంత్రమై, అభివృద్ధిలో మనస్థాయికి మించని అనేక దేశాలు ఉత్తేజపూరితమైన జాతిస్ఫూర్తిని ఆవహింపజేసుకొని, అంకితభావంతో పట్టుదలతో కృషిచేస్తూ మనకన్న ఎంతో ముందుకుపోతుండగా, మనం అసలు ఏ స్ఫూర్తీ లేక, ఈ దయనీయ స్థితిలో ఉన్నాము. చారిత్రకమైన క్లిష్టస్థితి అని, పరీక్షా కాలమని అంటున్నది దీనినే.
ఇంతవరకు పాలించిన వారందరూ, వివిధ వైఫల్యాలకు ఎదుటివారిని వేలెత్తి చూపటంలో వెనుకబడలేదు. ఆయా వైఫల్యాలను సరిదిద్దగలమని ప్రజలకు హామీ ఇవ్వటంలోనూ వెనుకబడలేదు. వీరందరూ ప్రజలను ఎప్పటికప్పుడు నమ్మిస్తూ అధికారపు రంగుల రాట్నంలో తిరుగుతూ వస్తున్నవారే. ఆ విధంగా గడిచిన ఇన్ని దశాబ్దాల చరిత్రను చివరికి సమీక్షిస్తే, అందరికందరూ ఒకరికొకరు ప్రతిరూపాలే తప్ప, ఏ ఒక్కరూ ప్రత్యామ్నాయంగా తేలలేదు. సోషలిజం అన్న కాంగ్రెస్ నుంచి, జాతీయవాదం అనే బీజేపీ వరకు, ఇంకా ఇటువంటివే ఏవో మాట్లాడి భ్రమింపజేస్తూ వస్తున్నవారి దాకా, అందరివీ ఆ ముసుగులో అధికారం కోసం పెనగులాటలే తప్ప, ఈ దేశం కోసం ఒక దార్శనికతతో, సమగ్రమైన ఆర్థికాభివృద్ధి, మానవాభివృద్ధి ప్రత్యామ్నాయ అజెండాతో నిజాయితీగా ప్రజల ముందుకు వచ్చినవారు ఎవరూ లేకపోయారు.
దేశంలోని సహజవనరులను, మానవ వనరులను వినియోగంలోకి తెస్తూ, ఒకవైపు ఆర్థికాభివృద్ధి మరొకవైపు మానవాభివృద్ధితో, ఈ దేశపు సమస్త రంగాలను ముందుకు తీసుకుపోతూ, దేశాన్ని అగ్రరాజ్యాల సరసన నిలబెట్టగలమనే ఉత్తేజకరమైన ప్రత్యామ్నాయ అజెండా, లేదా సరికొత్త అజెండాతో దేశ ప్రజల ముందుకువచ్చిన దార్శనికుడు ఎవరూ ఇంతవరకు లేకపోయారు. అధికార ఘర్షణలకు అతీతంగా, సంకుచితమైన, తిరోగామి బీజేపీ వాదనలకు భిన్నంగా దేశం కోసం మౌలిక దృష్టితో ఆలోచించినవారు ఎవరూ మన దృష్టికి కన్పించరు. ఈ పరీక్షా సమయంలో కావలసింది విశాల దృష్టి, సమగ్ర దృష్టి, దీర్ఘకాలిక దృష్టి, నిర్మాణాత్మక దృష్టి.
ఆ విధంగా కశ్మీర్ నుంచి కేరళ వరకు, గుజరాత్ నుంచి అస్సాం వరకు తేరిపార జూస్తే, అటువంటి దృష్టితో ముందుకువచ్చి, కొంతకాలంగా పట్టుదలతో స్పష్టమైన అవగాహనతో మాట్లాడుతున్న నాయకుడు టీఆర్ఎస్ అధ్యక్షుడైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మినహా మరొకరు కన్పించరు. సమగ్రమైన ప్రత్యామ్నాయ అభివృద్ధి అజెండాలతో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఈ దేశానికి అవసరమని కొన్ని సంవత్సరాలుగా అంటూ వస్తున్నారాయన. 2018లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆరంభించి, ఆ విషయమై కొన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రులను, ఇతర నాయకులను, మరొకస్థాయిలో వివిధ రంగాల నిపుణులను, ఇతర అనుభవజ్ఞులను సంప్రదిస్తూ వస్తున్నారు. ఇప్పుడిది దాదాపు ఒక కొలిక్కి వస్తూ, కొద్ది రోజుల క్రితం ఆయన కొత్త జాతీయ పార్టీ ప్రస్తావనను నేరుగా ముందుకు తెచ్చారు. 75 సంవత్సరాల స్వాతంత్య్రం, 75 సంవత్సరాల వైఫల్యాల తర్వాత ఈ దేశం, ఈ జాతి ఎదుర్కొంటున్నాయని మొదట అనుకున్న క్లిష్ట స్థితికి, పరీక్షా కాలానికి ఆ వేదిక ఒక సమగ్రమైన ప్రత్యామ్నాయ అభివృద్ధి అజెండాతో సమాధానాన్ని కనుగొనాలన్నది ఆయన ఆలోచన. కనుగొనగలదన్నది గట్టి నమ్మకం.
అటువంటి వేదిక నిర్మాణాలకు సంబంధించిన సాధ్యాసాధ్యాలు, ప్రత్యామ్నాయ అజెండా ఏమిటి, దాని వాస్తవమైన ఆచరణ ఏ విధంగా అన్నవి ఈ సందర్భంగా ఎదురయ్యే ప్రశ్నలు. వినేందుకు చాలా బృహత్తరం అనిపించే ఈ కార్యభారాన్ని కేసీఆర్
ఏ విధంగా నెరవేర్చగలరన్నది మరొక ప్రశ్న.
వేదిక నిర్మాణం సులభం కాదన్నది నిజం. ఇది చాలా పెద్ద దేశం, అనేక వైవిధ్యతలతో కూడుకున్నది కావటం ఒక స్థితి. కాంగ్రెస్, బీజేపీల స్థానంలో భిన్నకూటముల నిర్మాణాలు గతంలో జరిగినా అది విఫలం కావటం వల్ల ప్రజలకు ఆ తరహా ప్రయత్నాల పట్ల నమ్మకం సన్నగిల్లిందన్నది మరొక స్థితి. ఈ రెండు కారణాల వల్ల ఈ రోజున ఒక వేదిక నిర్మాణం ఒక పెద్ద సవాలు వంటిది. అయితే, ఇక్కడ మనం గ్రహించవలసిన రహస్యం ఒకటున్నది. ప్రత్యామ్నాయ వేదికలు లోగడ విఫలం కావటానికి కారణం ప్రజలు తమంతట తాము వాటిని వద్దనుకోవటం కాదు, ఆయా వేదికలలోని పార్టీలు, నాయకులు తమ అధికార కాంక్షతో పరస్పర కలహాలకు పాల్పడ్డారు. ప్రజలు తమను ఆదరించింది అప్పటి అధికార పార్టీలు ప్రజలు ఆశించిన అభివృద్ధిని సాధించలేకపోవటం, స్వార్థమే పరమార్థంగా ప్రవర్తించటం వల్లనేనని ఈ కొత్త నాయకులు గ్రహించలేకపోయారు. ఈ కొత్త పార్టీలకు ప్రజలు కోరుకునే అభివృద్ధిని సాధించి సుపరిపాలనను అందించగల ప్రత్యామ్నాయ అజెండాలు అన్నవే లేకపోయాయి. వారి పతనానికి మూలం అక్కడున్నది. వారికి అటువంటి అజెండా ఉండి ఉంటే, అది ప్రధానంగా మారి, అధికార కాంక్షలు-కలహాలు వెనుకకు పోయేవి. అపుడు నిజమైన ప్రత్యామ్నాయాలు అవతరించి, గుణాత్మకమైన పరిణామాలతో దేశం కొత్త మలుపు తిరిగేది.
అంటే, కేవలం అధికార పార్టీలు, నాయకులు మారటంగాక, అటువంటి మార్పే ప్రత్యామ్నాయం అనుకోవటం గాక, దేశానికి అవసరమైన ప్రత్యామ్నాయ అభివృద్ధి అజెండాను ముందుకు తేవటంలోనే అసలు రహస్యం దాగి ఉందన్నమాట. ఇంకా చెప్పాలంటే, అటువంటి అజెండాను రూపొందించి పనిచేసే పార్టీలు దానిచుట్టూ పరిభ్రమిస్తూ, పరస్పర కలహాలకు బదులు పరస్పర ఐక్యతతో స్థిరంగా ఉంటాయి.
అటువంటి పనితీరుకు బలమైన ప్రజాదరణ అనివార్యంగా లభించి, ఆ వేదిక సుస్థిరత మరింత బలపడుతుంది. ఈ అంశాలన్నీ పరస్పర ఆధారితం అవుతాయి. ప్రత్యామ్నాయ వేదిక అన్నది నిజమైన అర్థంలో ప్రత్యామ్నాయం కావటానికి, అది సుస్థిరత్వాన్ని పొందటానికి, ప్రజల విశ్వాసాన్ని సంపాదించటానికి, దేశానికి అవసరమైన లక్ష్యాలను సాధించటానికి ఆ విధంగా ప్రత్యామ్నాయ అజెండా శ్రీరామరక్ష అవుతుంది.
కేసీఆర్ కొంతకాలంగా పదే పదే అంటున్న మాటలలో ఈ అర్థాలన్నీ దాగి ఉన్నాయి. తాను ప్రతిపాదిస్తున్నది గతంలో జరిగిన విధంగా కేవలం అధికార మార్పిడులు కావని, దేశానికి కావలసిన, ప్రజలు కోరుకుంటున్న అభివృద్ధి సంబంధమైన సమూల- సమగ్ర మార్పులను సాధించగల ప్రత్యామ్నాయ అజెండా అన్న మాట ఇప్పటికే మన ముందుకువచ్చింది. కనుక ఇదంతా ఇక్కడ కొత్తగా చెప్తున్న విషయం కాదు. కేసీఆర్ మాటలు ఏవైనా ఎంత స్పష్టంగా, బలంగా ఉంటాయో తెలియనివారు లేరు. అందువల్ల, ఆయన ఒక కొత్త జాతీయ పార్టీ ఆలోచన చేస్తున్న ఈ సమయంలో మనం చేయవలసింది తన మాటలను, వివరణలను మరింత జాగ్రత్తగా విని అర్థం చేసుకోవటమే.
కొత్త ప్రత్యామ్నాయానికి ఇది సూత్రరీత్యా, లేదా థియరెటికల్గా సుస్థిరతను ఇవ్వగా, ఒక స్థాయిలో వేర్వేరు వర్గాల ప్రజాదరణ ప్రశ్న, మరొకస్థాయిలో భౌగోళికతల ప్రశ్న తలెత్తుతాయి. నిజానికి ఈ ప్రశ్నలు రెండింటికీ ప్రత్యామ్నాయ అజెండా అన్న మాటలోనే సమాధానాలు లభిస్తాయి. మన దేశంలో కేంద్రంలోనూ, రాష్ర్టాలలోనూ ఈ 75 సంవత్సరాల కాలంలో ప్రజలు అనేక పార్టీలను, ప్రభుత్వాలను, పాలనలను చూశారు. వాటిని ఆదరించే సమయంలో ఆదరించారు, తిరస్కరించే సమయంలో తిరస్కరించారు. ప్రతి ఆదరణ వెనుక ఆశలు, ప్రతి తిరస్కరణ వెనుక నిరాశలున్నాయి. కేంద్రమైనా, రాష్ర్టాలైనా ఇందులో తేడాలు లేవు. అనగా ప్రజల ఓటింగ్ వ్యవహరణ (ఓటింగ్ బిహేవియర్)కు సంబంధించిన స్థితి దేశమంతటా ఒకటే. వర్గాలు ఏవైనా, భౌగోళికతలు ఏవైనా. కనుక, పై రెండు ప్రశ్నలకు కూడా కలిపి మనకు ప్రత్యామ్నాయ అజెండా అన్న దానిలో సమాధానం లభించినట్లే.
-టంకశాల అశోక్