ఇంద్రవెల్లి : మండలంలోని ఆదివాసీ గిరిజనుల ఆరాధ్యధైవం కేస్లాపూర్ నాగోబా జాతర ( Nagoba Jatara) లో మెస్రం వంశీయుల పూజలు (Pujas) శుక్రవారంతో ముగిసాయి. ఈ సందర్భంగా నాగోబాను దర్శించుకునేందుకు వందలాది భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి.

మెస్రం వంశీయుల ఆధ్వర్యంలో మండగాజిలింగ్ పూజలతోపాటు భేతాల్ పూజలు ఘనంగా నిర్వహించారు. ముందుగా వారి సంప్రదాయ పద్ధతిలో మెస్రం వంశీయుల పెద్దల చేతి కర్రలను, పాదాలను మహిళలు నీటితో కడిగారు. నాగోబాను దర్శించుకున్న భక్తులు సతీక్ దేవతకు వేసిన కానుకలను పటేల్ కిత, కటోడ కిత, పర్ధాంజీ కితల వారీగా డబ్బులు పంచుకున్నారు. మహాపూజలకు ఉపయోగించిన మట్టికండలు 22 కితల వారీగా పంపిణీ చేశారు. ఈ పూజలతో మెస్రం వంశీయుల పూజలు ముగిసాయి. అధికారికంగా ఈనెల 25వ తేదీవరకు పూజలు జరుగుతాయని నిర్వాహకులు వెల్లడించారు.

అనంతరం సంప్రదాయ వాయిద్యాలు వాయిస్తు మహిళలు. పురుషులు వేర్వేరుగా భేతాల్ నృత్యాలు చేశారు. సాయంత్రం కేస్లాపూర్ నుంచి కుటుంబ సమేతంగా ఉట్నూర్ మండలంలోని శ్యామ్ పూర్ గ్రామంలోని భుడుందేవ్ పూజల కోసం బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో మెస్రం వంశీయుల పీఠాధిపతి మెస్రం వెంకట్ పటేల్ రావ్, చిన్నుపటేల్, బాజీరావ్ పటేల్, లింబారావ్ పటేల్, కటోడ కోసేరావ్ , కటోడ హనుమంత్ రావ్, నాగోబా పేన్ కోత్వాల్ తిరుపతి, నాయికి ధర్ము , పర్ధాంజీ దాదారావ్, శేఖర్ బాబు, దేవ్ రావ్, సోనేరావ్, గణపతి, తదితరులు పాల్గొన్నారు.