అదిగదిగో గణగణమని
మోగుతోంది బడిగంట
బిరబిర బిర చరచర చర
రారండీ బాలల్లారా
పోదాం పదండి బడికి
చదువులు నేర్పే గుడికి..!
॥పోదాం॥
ఆడుదాం పాడుదాం
నేస్తాలతో కలిసి
పాఠాలు నేర్చుకుందాం
పొత్తాలు తెరిచి..!
॥పోదాం॥
కొత్త పుస్తకాలకు
అట్టలేసుకుందాం
కొత్త నేస్తాలతో
ఆడిపాడి అక్షరాలు నేర్చుదాం..!
॥పోదాం॥
గురువులు చెప్పినవన్నీ
బుద్ధిగా విందాం
జ్ఞానవంతులని
పేరు తెచ్చుకుందాం..!
॥పోదాం॥
సైన్సులో ప్రయోగాలు చేద్దాం
లెక్కల్లో చిక్కులు విడదీద్దాం
సాంఘికంతో ప్రపంచయాత్ర చేద్దాం
హిందీ,ఆంగ్ల భాషలు నేర్చుకుందాం
మన తెలుగు భాషను
మరువక మననం చేద్దాం..!
కళలను అభ్యసిద్దాం
కలలను సాకారం చేద్దాం
కలిసిమెలిసి ఉందాం
కళకళలాడుతు సాగుదాం..!
॥పోదాం॥
మూఢ విశ్వాసాలను
వీడనాడుదాం
శాస్త్రీయ భావాలతో
ప్రపంచ గతిని తెలుసుకుందాం..!
॥పోదాం॥
భావిపౌరులం మనం
భవిత బాటలో సాగుదాం
ప్రగతి సౌధాలు నిర్మిద్దాం
దేశ గౌరవం నిలుపుదాం..!
॥పోదాం॥
-చంద్రకళదీకొండ
93813 61384