స్థిరచిత్తంతో, కార్యదక్షతతో ముందడుగు వేసినట్లయితే సత్ఫలితాలు లభించడం తథ్యం. చిత్తశుద్ధితో సంకల్పించినట్లయితే, కార్యదక్షత ఉన్నట్లయితే సాధించలేనిదేమీ ఉండదని కూడా కేటీఆర్ గత ఎనిమిదేండ్లుగా నిరూపిస్తున్నారు. కేటీఆర్ నీతి, నిజాయితీలతో పాటు నిర్మొహమాటం, నిర్భీతి ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ప్రజలకు మంచి చేయడం కోసమే, రాజకీయాల్లోకి వచ్చిన ఆయన తనకు కేటాయించిన ఐటీ శాఖకు వన్నె తెచ్చారు. అసమాన ప్రతిభా సంపత్తితో పరిపూర్ణ వ్యక్తిత్వంతో నడిపించే నాయకుడిగా, లక్షల కోట్ల పెట్టుబడుల సాధనలో సూరీడుగా భాసిల్లుతున్నారు.
అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ తెలంగాణ. వ్యాపారాలకు, పరిశ్రమలకు నెలవు. రంగం ఏదైనా అందులో తెలంగాణకు స్థానం ఉండాల్సిందే. అందుకే ప్రపంచంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రంలో పెట్టేందుకు ముందుకువస్తున్నారు. అందుకు తగ్గట్లే తెలంగాణ ప్రభుత్వం కూడా అందరికీ అవసరమైన అవకాశాలను ఇస్తున్నది. ఐటీ రంగంలో విప్లవాత్మక, వినూత్న సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ఆదర్శప్రాయుడు కేటీఆర్. ఆకట్టుకునే వాగ్ధాటే కాదు, రాష్ర్టాన్ని అభివృద్ధిపథంలో నడిపేందుకు ఎన్నో వినూత్నమైన ఆలోచనలను ఆచరణలో పెట్టిన ఘనత కేటీఆర్ సొంతం. ఆయన ఒక్కో ఆలోచన ఇవ్వాళ లక్షలాది మంది యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తున్నది. ఒక రాష్ట్రంలో మంత్రిగా కేటీఆర్ ఇటు తెలంగాణలోనేగాక అటు పలు రాష్ర్టాల్లో అనితరసాధ్యుడిగా పేరు తెచ్చుకున్నారు.
ప్రపంచాన్ని తలకిందులు చేసిన కరోనా ప్రభావం నుంచి వేగంగా కోలుకున్న తెలంగాణ మునుపటితో పోల్చితే పెట్టుబడుల సమీకరణలో మరింత దూసుకుపోతున్నది. దేశ, విదేశీ పెట్టుబడులకు కేంద్ర బిందువుగా మారుతూ యావత్ భారతానికే బ్రాండ్ ఇమేజ్‌లా నిలుస్తున్నది. ఈ క్రమంలో రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగనంత భారీ స్థాయిలో పెట్టుబడులు వెల్లువెత్తున్నాయి. ఇటీవల కేటీఆర్ దావోస్ పర్యటన సందర్భంగా వెల్లువెత్తిన రూ.4200 కోట్ల పెట్టుబడులు తాజాగా రూ.24 వేల కోట్ల పెట్టుబడులు అందుకు నిదర్శనం.
కేటీఆర్ విశేష కృషి ఫలితంగానే ప్రపంచంలోని అగ్రశేణి ఐదు ఐటీ సంస్థలైన గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఫేస్బుక్, సేల్స్‌ఫోర్స్ తమ రెండో అతిపెద్ద కార్యాలయాలను మన దగ్గర ఏర్పాటు చేశాయి. దేశీయ ఐటీ దిగ్గజాలైన ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, టెక్ మహేంద్ర వంటి కంపెనీలెన్నో తెలంగాణలో ఉన్నాయి. ప్రముఖ ఐటీ దిగ్గజం గూగుల్ సంస్థ వారు రూ.1,000 కోట్ల పెట్టుబడితో తమ క్యాంపస్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పటం గమనార్హం. గూగుల్ సంస్థ అమెరికా బయట, అదీ హైదరాబాద్‌లో ఇంత పెద్ద ఎత్తున తమ కార్యకలాపాలను విస్తరించడం విశేషం.
కేటీఆర్ కృషి వల్ల రాష్ట్రంలో ఐటీరంగం అద్భుతంగా వృద్ధి చెందుతున్నది. 2014లో తెలంగాణ ఐటీ ఎగుమతులు రూ.57,258 కోట్లుగా ఉంటే, 2021-22లో అవి రూ2.32 లక్షల కోట్లకు చేరాయి. 2014 లో రాష్ట్రంలో 3.2 లక్షల మంది ఐటీ రంగ ఉద్యోగులు ఉంటే, ఇప్పుడు ఈ సంఖ్య 16.48 లక్షలకు పెరిగింది. ఐటీని హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా రాష్ట్రంలోని ఇతర ప్రధాన నగరాలకు కూడా విస్తరిస్తున్నారు. రాష్ర్టానికి ఉన్న సానుకూల పరిస్థితులు, ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహాన్ని వివిధ అంతర్జాతీయ సంస్థలకు వివరించడంలో కేటీఆర్ విజయవంతమవుతున్నారు. రాష్ర్టాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో కేటీఆర్‌కు ఉన్న అంకితభావమే దీనికి కారణం. కేటీఆర్ సారథ్యంలో తెలంగాణ ఐటీ ప్రగతి అప్రతిహతంగా కొనసాగాలని ప్రపంచలోనే ఐటీకి తెలంగాణ తలమానికంగా నిలు స్తుందనటంలో సందేహం లేదు.
-పువ్వాడ అజయ్ కుమార్