బీహార్, జూన్ 9.. కన్నకొడుకు అగ్గివెడితే తల్లిదండ్రులకు పున్నామ నరకం తప్పుతుందని ఓ నమ్మకం. అది సరే, ఇగ ఓసారి బీహార్ రాష్ట్రంలకు వొయ్యొద్దాం. సూసేది సూడంగనే సమస్తిపూర్ అనే ఊరి పేరు సామాజిక మాధ్యమాల్లో మార్మోగిపోయింది. మన సోషల్ మీడియా
నెటిజన్లకున్నంత దయ, జాలి.. బీహర్ పాలకులు గాని, సమస్తపూర్ దవాఖాన సిబ్బంది గాని ఉంటె అంత గోరం జరగకపోతుండె.
సంజీవ్ ఠాకూర్ అనే 25 ఏండ్ల పడుసు పిల్లగాడు మే 25 నుంచి కనవడకుండా వోయిండు. ఆ బాధల్నే ఆ పిల్లగాని తల్లిదండ్రులకు బుక్కెడు బువ్వ నోట్లెకు వోతలేదు. ఒక్కసారిగా సమస్తిపూర్ దవాఖాన నుంచి వాళ్లకు ఫోనొచ్చింది ‘మీ కొడుకు సంజీవ్ ఠాకూర్ సమస్తిపూర్ దవాఖానలో సచ్చిపోయి ఉన్నడు’ అని ఫోన్ల ఔతలివైపోళ్లు జెప్తే ఆ తల్లిదండ్రుల గుండెలు తల్లడిల్లినయి. కొడుకెప్పుడు ఇంటికస్తడోనని ఎదురుచూసిన వాళ్ల ఆశలు అడియాసలైనయి. దేవుడా.. ఫోన్ల జెప్పిన వార్త తప్పు గావాల్నని మొక్కుకుంటా ఆ తల్లిదండ్రులిద్దరూ ఆత్రం గా దవాఖానకు ఏడ్సుకుంట ఉరికిండ్రు. పోస్టుమార్టం రూముల శవం మొహం సూసిన ఆ తల్లిదండ్రుల ఆశలు ఆవిరైపోయినయి.
అంతే… ఆ దవాఖాన సిబ్బంది మొహాన మాత్రం నవ్వులు విరబూసినయి. ఒక్కసారి మనుషులు గోతికాడి నక్కల్లా మారిపోయిండ్రు. ‘మీ కొడుకు శవాన్ని అప్పజెప్పాల్నంటే యాభై వేలు గావాల్న’ని లంచమడిగిర్రు. కాయాకట్టం జేస్కుంటె గానీ పూటగడవని మా దగ్గెర గన్నిగనం పైసలెక్కడియని ఆ తల్లిదండ్రులు లబోదిబోమన్నరు. అయినా వాళ్ల మన్సు కర్గలె. దిక్కులేక వాళ్లూరికి వొయ్యిర్రు. భుజం మీద తువ్వాలేసి ‘తలా ఇన్ని పైసలెయ్యిర్రవ్వా.. నా కొడుకు శవాన్ని కొనుక్కచ్చుకుంటమని’ బిచ్చం అడుక్కున్నరు. ‘అయ్యో… దేవుడా ఈ కట్టం పగోనిగ్గూడ రావొద్దని’ బిచ్చమేసేటోళ్లు జాలివడ్డరు. కన్నీళ్లు దెప్పించే ఈ వీడియోను దీసి ఎవ్వలో ఫేస్బుక్, వాట్సాప్లళ్ల వైరల్ జేసిండ్రు. అంతే… ఆ దవాఖాన సిబ్బందిని, బీహార్ పాలకులను పొట్టు పొట్టు తిట్టని నెటిజన్ లేడు. పాపం తనకే అగ్గివెడుతడునుకున్న కొడుకుకు తనే అగ్గివట్టాల్సిన కర్మ వొచ్చిందని ఠాకూర్ తండ్రి ఏడ్సుకుంటా ఇంటింటికి తిరుగుతా ఉన్న వీడియోను జూసి కండ్లళ్లకెల్లి నీళ్లు దియ్యని నెటిజన్ లేడు. అయినా కఠినాత్ములైన బీహార్ పాలకులకు, సమస్తిపూర్ దవాఖాన సిబ్బందికి కొంచెమైనా సిగ్గనిపించలేదు.
ఇక మన తెలంగాణ రాష్ర్టానికొద్దాం..
పోయిన నెల.. మే 29, ఆదివారం.. వరుసకు ఇద్దరన్నదమ్ములు.. రెండుగీరల బండిమీద మెల్లగనే అస్తున్నరు. మనం మెల్లగవోయినా అచ్చేటోడు సక్కగ రావాలెగా..? సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ దాటినంక పందిల్ల ఊరుంటది. ఆ ఊరికి చేరిర్రో లేదో… ఎదురంగ ఓ బండోడచ్చి మెల్లగవోతున్న ఆ ఇద్దరన్నదమ్ముల్ని లగాంచి గుద్దిండు. అన్న కూడాల ప్రశాంత్‌కు 22 ఏండ్లు.. తమ్ముడు కర్రెవత్తుల హర్షవర్ధన్‌కు పదిహేడేండ్లుంటయి. అన్న కాలిరిగి కిందవడ్డడు, క్యాలిదప్పింది. తమ్మునికి తొంటి పొంటి ఉన్న మాంసం అంతా కొట్టుకపొయ్యి రక్తం కాలువోలె వారుతున్నది. సూసినోళ్లెవ్వలో అంబులెన్స్‌కు ఫోన్జేత్తే ఆ ఇద్దర్ని హైద్రావాద్ పట్నంలోని నిమ్స్ దవాఖానకు ఏస్కచ్చిర్రు. ఏస్కచ్చిన రోజే తమ్మునికి ఆప్రీషనైంది. క్యాలిదప్పిన అన్నను అబ్జర్వేషన్ల ఉంచిర్రు డాక్టర్లు.
ఆప్రీషనైన రోజు హర్షవర్ధన్ వాళ్ల బాపు రఘు 5 వేలు కట్టిండు దవాఖాన్ల. ఆ రోజు నుంచి డిశ్చార్జయ్యేదాన్క డాక్టర్లు పైసలడిగింది లేదు, వీళ్లు పైసల్ గట్టింది లేదు. హర్షను మాత్రం మంచిగ చూస్కుంటున్నరు నిమ్స్ డాక్టర్లు. జూన్ 10 శుక్లారం పొద్దున డాక్టరొచ్చి ‘మీ కొడుకు పానం మంచిగైందయ్యా, ఇయ్యాళ్ల ఇంటికి తోల్కపోవచ్చ’ని చెప్తే హర్ష వాళ్ల అమ్మాబాపులు అమ్మ య్యా.. అని ఊపిరి పీల్సుకున్నరు. హర్ష వాళ్ల అమ్మ కవిత స్కూళ్ల వంట పన్జేస్తది. బీదోళ్లే అని తెలిసి ఎవ్వలో ఉపాయం జెప్తే గవర్నమెంటుకు లెటర్ వెట్టుకున్నరు. జూన్ 10 నాడు తెలంగాణ గవర్నమెంటు నిమ్స్ దవాఖా నకు లెటర్ పంపింది.
ఫలానా హర్షవర్ధన్ వాళ్ల బాపు దగ్గర ఒక్క రూపాయి తీస్కోవద్దు, తీస్కున్న పైసల్ గూడ వాపసియ్యిర్రని ఆ లెటర్ల రాసున్నది. అంతే.. హర్షవర్ధన్‌ను డిశ్చార్జి చేసిన నిమ్స్ సిబ్బంది తీస్కున్న 5 వేల రూపాలు ఉల్టా రఘుకు తిరిగిచ్చిర్రు. ఆ ఐదు వేలను జూసిన కవిత ‘అబ్బా.. నా ఒక్క నెల జీతం మిగిలిందుల్లా..’ అంటే.. ‘తొవ్వ కర్సులకు పైసలెట్లా అని నిన్నటిసంది ఆలోచిస్తున్న’ అని రఘన్నడు. నిమ్స్ దవాఖాన గేటు ముందు కొబ్బరికాయ కొట్టి కొడుకును ఇంటికి తోల్కపోయిర్రు. రఘు కొట్టిన కొబ్బరికాయ రెండు ముక్కలయ్యేసరికి నాకు ఒక్కసారిగా బీహార్ల ఉన్న ‘డబుల్ ఇంజిన్ సర్కారు’ యాదికొచ్చింది. రఘు సంతోషం జూసి నవ్వాల్నో.. బీహార్‌లోని ఠాకూర్ తల్లిదండ్రుల యాతన జూసి ఏడ్వాల్నో ఏం అర్థం గాలె.
-గడ్డం సతీష్ 99590 59041