‘భాష’ ఒక ప్రాంతానికి జీవం. ఒక్కో ప్రాంతానికి ఒక్కో భాష, ఒక్కో యాసలుంటాయి. భిన్న సంప్రదాయాలు, భిన్న భాషలు, భిన్న సంస్కృతులు. ఇదే భారతదేశం, భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశం. కానీ.. స్వార్థ రాజకీయాల వల్ల ఇప్పుడు మన భాషపై పెత్తనం చెలాయించాలని కొందరు చూస్తున్నారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ర్టాలపై ఆధిపత్యం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. బలవంతంగా హిందీ భాషను రుద్దాలని ప్రణాళికలు రచిస్తున్నారు. ఇటీవలి పరిణామాలు, రాజకీయనేతల నుంచి సినీ నటుల దాకా చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనం.
హిందీ మాట్లాడేవాళ్లు ఎంతమంది?: దేశంలో హిందీ భాష మాట్లాడేవాళ్ల కంటే ప్రాంతీయ భాషలు మాట్లాడే వారి జనాభానే ఎక్కువ. దేశంలో జనసాంద్రత ఎక్కువగా ఉండే పదికి పైగా రాష్ర్టాల్లో హిందీనే మాతృభాష అని చెప్తుంటారు. కానీ, ఆ రాష్ర్టాల్లో వివిధ భాషలు మాట్లాడే ప్రజలున్నారు. హిందీకి దగ్గరగా ఉండే బ్రజ్, ఛత్తీస్‌గఢీ, హర్యాన్వీ వంటి 49 రకాల భాషలు చెలామణిలో ఉన్నాయి. పాలకులు చెప్తున్న హిందీ.. ఆయా రాష్ర్టాల్లో కేవలం పాఠ్యపుస్తకాలు, ప్రభుత్వ లావాదేవీలకు మాత్రమే పరిమితమైంది.
ఉత్తరాది రాష్ర్టాలతో పోలిస్తే.. దక్షిణాదిలో భాష విషయంలో భిన్నత్వం కనిపిస్తుంది. దక్షిణాదిలో ఒక్కో రాష్ర్టానికి ఒక్కో భాష ఉన్నది. అన్ని రాష్ర్టాల్లోనూ హిందీ భాష మాట్లాడే వారున్నా, అక్కడి ప్రజలు ఎక్కువ మాట్లాడే భాష లే అధికారిక భాషలుగా ఉన్నాయి. అధికారిక కార్యకలాపాలన్నీ స్థానిక భాషలోనే జరుగుతున్నాయి. ఇది ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బీజేపీకి నచ్చడం లేదు. అందుకే అన్ని రాష్ర్టాల్లో హిందీ భాషను రుద్దాలనే ప్రయత్నాలు చేస్తున్నది. హిం దీని అధికారిక భాషగా ప్రకటించాలని అనేక ప్రణాళికలు రచిస్తున్నది.
‘దేశమంతా ఒకే భాష ఉండాలని, ఒకే దేశం-ఒకే భాష విధానం ఉంటే బాగుంటుంది’ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో దక్షిణాది రాష్ర్టాలు భగ్గుమన్నాయి. తమపై హిందీని బలవంతంగా రుద్దకండంటూ నటులు కమల్‌హాసన్, రజినీకాంత్ సహా, ఇతర దక్షిణాది రాష్ర్టాలు ముక్తకంఠంతో ఖండించాయి. దీంతో అమిత్ షా దిగిరాక తప్పలేదు. తాను హిందీని ద్వితీయ భాషగా నేర్చుకుంటే బాగుంటుందని మాత్రమే అన్నానని, కొందరు దీనిపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని, తన మాతృభాష కూడా హిందీ కాదని ఆయన చెప్పుకొచ్చారు.
అమిత్ షా తన వ్యాఖ్యల మీద వివరణ ఇచ్చి నా.. బీజేపీకి బాకాలూదే కొందరు నటులు, నాయకులు మాత్రం తమ నోటి దురద తీర్చుకుంటూనే ఉన్నారు. ఈ విషయంలో అజయ్ దేవ్గన్, కిచ్చా సుదీప్‌ల మధ్య యుద్ధమే జరిగింది. ఈ విషయంలో అనూహ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రమైన కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కూడా ప్రాంతీయ భాషకే ఓటేశారు. ప్రాంతీయ భాషలు దేశానికి చాలా ముఖ్యమన్నారు. మాజీ సీఎం సిద్ధరామయ్య, జేడీఎస్ నేత కుమారస్వామి సుదీప్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ వివాదంలో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది సూపర్స్టార్లను చూస్తే బాలీవుడ్ స్టార్లకు అసూయ అన్నారు. కన్నడ హీరో సుదీప్‌కు ఆయన మద్దతు పలికారు. కాంట్రవర్సీకి కేరాఫ్‌గా మారిన కంగనా రనౌత్ కూడా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నారు. హిందీనే మన జాతీయ భాష అని వ్యాఖ్యానించారు. హిందీని జాతీయభాషగా అంగీకరించకపోవడమంటే రాజ్యాంగాన్ని ధిక్కరించడమేనని ఆమె చెప్పుకొచ్చారు.
అసలు రాజ్యాంగం ఏం చెప్తున్నది..?: మన దేశానికి జాతీయ భాష లేదు. కేంద్రస్థాయిలో అధికార భాషగా హిందీ, ఇంగ్లిషులున్నాయి. రాష్ర్టాల్లో అక్కడి ప్రాంతీయ భాషలు అధికార భాషలుగా ఉంటున్నాయి. మన రాజ్యాంగం ఏ భాషకూ ‘జాతీయ భాష’ హోదా ఇవ్వదని, 8వ షెడ్యూల్లో 22 అధికారిక భాషలున్నాయని, అధికారిక భాషల చట్టం-1963, కేంద్ర ప్రభుత్వ అధికారిక ప్రయోజనాల కోసం ఇంగ్లిషు, హిందీని సిఫారసు చేస్తున్నదని విశ్లేషకులు చెప్తున్నారు. కేంద్రం హిందీ ని బలవంతంగా దక్షిణాదిపై రుద్దాలనుకోవడం భాషా సామ్రాజ్యవాదం తప్ప మరొకటి కాదు.
1960 ప్రాంతంలోనూ దేశంపై హిందీని రుద్దాలనే ప్రయత్నాలు జరిగాయి. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ దక్షిణాది రాష్ర్టాల్లో, ముఖ్యంగా తమిళనాడులో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. తర్వాత 1963లో అధికార భాషల చట్టం వచ్చింది. అధికార లావాదేవీలన్నిటిలో హిందీతో పాటు ఇంగ్లిషును తప్పనిసరి చేస్తూ చట్టం తీసుకొచ్చారు. తెలుగు, కన్నడం, తమిళం, మలయాళం, ఒడియా, గుజరాతీ, పంజాబీ, బెంగాలీ వంటి 22 భాషలను ఆయా ప్రాంతా ల్లో అధికార భాషలుగా రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ గుర్తించింది. హిందీ అధికార భాషగా లేని రాష్ర్టాలతో కేంద్రం ఇంగ్లిషులో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపాలని నిర్దేశిస్తూ 1967లో అధికార భాషల చట్టాన్ని సవరించారు.
దక్షిణాది రాష్ర్టాలకు ఏం నష్టం అంటే..: హిందీ భాషతో మన సంస్కృతీ సంప్రదాయాలకు విఘా తం ఎర్పడే పరిస్థితి వచ్చింది. ఇదొక్కటే కాదు, ఉత్తరాది పాలకుల తీరుతో.. మన రాష్ర్టాలు ఆర్థికంగానూ నిండా మునుగుతున్నాయి. బీహార్, యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లాంటి అత్యధిక జనాభా గల రాష్ర్టాల నుంచి కేంద్రానికి వచ్చే పన్నులు తక్కువ. కానీ కేంద్రం ఆ రాష్ర్టాల్లోనే అత్యధికంగా నిధులను ఖర్చు చేస్తున్నది. అభివృద్ధి చెందే దక్షిణాది రాష్ర్టాలపై కావాలనే వివక్ష చూపిస్తు న్నది. దీనివల్ల రెండు రకాల నష్టాలు. అభివృద్ధి చెందే రాష్ర్టాలు వెనకబడిపోవడం ఒక సమస్య అయితే.. ఏ అభివృద్ధి లేని రాష్ర్టాల్లో పెట్టుబడి పెట్ట డం ఆర్థికవ్యవస్థకు భారం మరో సమస్య. ఈ పద్ధ తి మారాలని దక్షిణాది నేతలంతా పార్టీలకు అతీ తంగా గళమెత్తారు.
ఇప్పుడు భాష పేరుతో మనపై మొదలైన దండయాత్రను సమర్థవంతంగా తిప్పికొట్టాలి. మన భాష, మన యాస, సంస్కృతిని కాపాడుకోవాలి. కేంద్రానికి బానిసలుగా మారి మనల్ని ప్రమాదంలో పడేస్తున్న వారికి బుద్ధిచెప్పాలి. మన భాషా సంస్కృతులనే కాదు, మన నిధులనూ కాపాడుకోవాలి. లేకపోతే ఈ కేంద్రంలోని పాలకులు సుసంపన్నంగా ఉన్న దక్షిణాది రాష్ర్టాలను బికారీలను చేసేందుకు కూడా వెనుకాడరు.
-(వ్యాసకర్త: టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్)
వై.సతీష్‌రెడ్డి 96414 66666