Intestines | మన శరీర ఆరోగ్యం మన పేగుల ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. శరీరంలో బలమైన రోగనిరోధక శక్తి, స్థిరమైన శక్తి ఉండాలన్నా, మనం తిన్న ఆహారం జీర్ణం కావాలన్నా ఆరోగ్యకరమైన పేగులు చాలా ముఖ్యమైనవి. పేగులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం తినే ఆహారంలో ఉండే పోషకాలు శరీరానికి చక్కగా అందుతాయి. తద్వారా శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది. కనుక పేగుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా అవసరం. తాజా పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాలు, ఫైబర్ ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల పేగుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వీటిని తీసుకోవడం వల్ల పేగుల కదలికలు మెరుగ్గా ఉంటాయి. పేగులు ఆరోగ్యంగా ఉండాలంటే 25 నుండి 30 గ్రాముల ఫైబర్ ను రోజూ తీసుకోవడం చాలా అవసరం. మనం తీసుకునే ఆహారాల ద్వారానే మనం మన పేగుల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. సహజంగా పేగుల ఆరోగ్యాన్ని కాపాడే ఆహారాలేమిటో.. ఇప్పుడు తెలుసుకుందాం.
పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఓట్స్ మనకు ఎంతో సహాయపడతాయి. వీటిలో కరిగే ఫైబర్ తో పాటు బీటా గ్లూకాన్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన జీర్ణాశయ బ్యాక్టీరియాకు మద్దతు ఇస్తుంది. ఓట్స్ ను తీసుకోవడం వల్ల పేగుల ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు శరీరానికి కూడా మేలు కలుగుతుంది. కాయధాన్యాల్లో కరిగే, కరగని రెండు రకాల ఫైబర్ లు ఉంటాయి. ఇవి పేగులకు స్నేహపూర్వక ఆహారాలని చెప్పవచ్చు. ఇవి సులభంగా జీర్ణం అవ్వడంతో పాటు శరీరానికి కావల్సిన పోషకాలను కూడా అందిస్తాయి. ఆపిల్స్ కూడా చక్కటి పేగుల ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. వీటిలో పెక్టిన్ అనే కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది ప్రీబయోటిక్ గా పని చేస్తుంది. ఆపిల్స్ ను తీసుకోవడం వల్ల పేగుల ఆరోగ్యంతో పాటు మొత్తం జీర్ణ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
చిన్నగా ఉన్నప్పటికీ చియా విత్తనాలను తీసుకోవడం వల్ల పేగుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వీటిలో కరిగే ఫైబర్ ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల మలబద్దకం వంటి సమస్యలు తగ్గి పేగులు ఆరోగ్యంగా ఉంటాయి. ఇక బ్రోకలి కూడా చక్కటి పేగుల ఆరోగ్యానికి సహాయపడుతుంది. దీనిలో కరాగిన ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల ఆహారం జీర్ణవ్యవస్థ ద్వారా సజావుగా కదులుతుంది. ఫైబర్ కలిగి ఉండే ఆహారాల్లో బీన్స్ ఒకటి. వీటిలో కరిగే, కరగని ఫైబర్ లు రెండూ ఉంటాయి. ఇవి ప్రయోజనకరమైన జీర్ణాశయ బ్యాక్టీరియాకు ఇంధనంగా పని చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల పేగుల ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. పేగుల ఆరోగ్యాన్ని పెంపొందించడంలో రాస్ప్ బెర్రీస్, బ్లూబెర్రీస్, బ్లాక్ బెర్రీస్ కూడా ఎంతో సహాయపడతాయి. వీటిలో క్యాలరీలు తక్కువగా ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణాశయ బ్యాక్టీరియాకు మద్దతు ఇస్తాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్ నుండి పేగుల ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడతాయి.
తృణధాన్యాలను తీసుకోవడం వల్ల కూడా పేగుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వీటిలో ఉండే ఫైబర్ పేగుల క్రమబద్దతకు సహాయపడుతుంది దీర్ఘకాలిక జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే గింజలను తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. వీటిలో కొవ్వులు, ప్రోటీన్, ఖనిజాలతో పాటు ఫైబర్ కూడా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియకు మద్దతు లభించడంతో పాటు మేలు చేసే పేగు బ్యాక్టీరియా కూడా పెరుగుతుంది. ఇక క్యారెట్ లలో కరగని ఫైబర్ ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల మలబద్దకం సమస్య తగ్గుతుంది. క్యారెట్ లలో బీటా కెరోటీన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి జీర్ణాశయ లైనింగ్ కు మద్దతు ఇస్తాయి. ఈ విధమైన ఆహారాలను తీసుకోవడం వల్ల పేగుల ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు జీర్ణ వ్యవస్థ కూడా చక్కగా పని చేస్తుంది. తద్వారా మొత్తం ఆరోగ్యానికి మేలు కలుగుతుంది.