Leopard : అటవీ జంతువులు ప్రజల నివాసాల్లోకి రావడం చాలా మామూలు విషయంగా మారింది. సింహాలు, చిరుతలు, పులులు సహా అనేక జంతువులు నివాసాల్లోకి చొరబడిన ఘటనలు అనేకం. తాజాగా కేంద్ర పాలిత ప్రాంతమైన నాని డామాన్ ఏరియలో ఒక చిరుత స్వీట్ షాపులోకి ప్రవేశించింది. ఈ ఘటన మంగళవారం ఉదయం 11.30 గంటలకు జరిగింది. స్థానిక అటవీ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నాని డామన్ ప్రాంతంలోని ఒక స్వీట్ షాపులోకి ఉదయం చిరుత చొరబడింది.
వెంటనే స్థానికులు అటవీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. డిప్యూటీ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ హర్ష రాజ్ ఇతర సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని చిరుతను బంధించే ప్రయత్నం చేశారు. ఈ ప్రాంతం ముంబైకి దగ్గరగా ఉంటుంది. మహారాష్ట్రలోని డాహను ప్రాంతానికి చెందిన స్పెషల్ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ ఈ ప్రాంతానికి చేరుకుంది. ట్రాంక్విల్లైజర్ గన్స్, నెట్స్, కేజ్ సహా ఇతర సామగ్రితో అక్కడికి చేరుకుని చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నించారు. చిరుత మాత్రం వారికి చిక్కకుండా అటూ ఇటూ పరుగెడుతూ ఇబ్బంది పెట్టింది. ఒక బిల్డింగ్ థర్డ్ ఫ్లోర్లోకి చేరుకున్న సమయంలో ట్రాంక్విల్లైజర్ గన్ ద్వారా మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. అనంతరం ఆ చిరుతను బంధించారు. తర్వాత చిరుతను సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు అధికారులు చెప్పారు.
అయితే, ఈ ఆపరేషన్ ఎనిమిది గంటలపాటు సాగింది. ఈ సందర్భంగా సిబ్బంది ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అతడు క్షేమంగానే ఉన్నట్లు చెప్పారు. అయితే, ఆ చిరుత సిటీలోకి ప్రవేశించడానికి రెండురోజుల ముందే పలు చోట్ల కనిపించినట్లు తమకు సమాచారం అందిందని అధికారులు తెలిపారు.