లింగాయత్ ధర్మ సృష్టికర్త అయిన మహాత్మా బసవేశ్వరుడు వీరశైవ సంప్రదాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన మహనీయుడు. ఆయన గొప్ప మానవతావాది, సంఘ సంస్కర్త. కుల, వర్గ, వర్ణ వ్యవస్థను రూపుమాపడానికి క్రీ.శ.12వ శతాబ్దంలోనే పూనుకున్న సాం ఘిక విప్లవకారుడు. స్త్రీ పురుష అసమానతలను తొలగించడానికి కృషిచేసిన అభ్యుదయవాది. క్రీ.శ.1134లో నేటి కర్ణాటక బీజాపూర్ జిల్లా బాగేవాడిలో ఆయన జన్మించారు. కులాలు, మూఢనమ్మకాలు, దురాచారాలు స్వార్థపరుల సృష్టి అంటూ వాటిపై సమరభేరి మోగించారు. సర్వ మానవ సమానత్వమే శాంతికి మూలమని బసవేశ్వరుడు ఉపదేశించారు.
జాతి, వర్గ భేదం లేకుండా అందరూ దీక్షా సంస్కారం పొందవచ్చునని చెప్పిందే లింగాయత ధర్మం. మూఢాచారాలకు,కులవ్యవస్థకు వ్యతిరేకంగా తిరుగుబాటు బావు టా ఎగురవేసిన మొదటి సాంఘిక విప్లవకారుడు బసవేశ్వరుడు. నాటి సామాజిక జీవితంలో వెలుగులు నింపిన చింతనాపరుడాయన. సామాజిక వ్యవస్థలో సమానత్వం ఉండాలని ఆయన ఆకాంక్షించారు. నేటి మన పార్లమెంటరీ వ్యవస్థకు సమానమైన ‘అనుభవ మంటపాన్ని’ నాడే స్థాపించి అందులో జాతి, కుల, వర్గ, వర్ణ బేధాలు లేకుండా అందరికీ సమాన అవకాశం కల్పించిన గొప్ప ప్రజాస్వామ్యవాది బసవన్న. మనుషులు శాంతి సామరస్యాలతో సహజీవనం చేయాలని బోధించారు.
కష్టపడి పనిచేస్తూ, నిరాడంబర జీవితం గడపాలనీ, అప్పుడే జీవితంలో నిజమైన సంతోషం వెల్లివిరుస్తుందని ఉపదేశించారు.తెలంగాణ ఆవిర్భావ అనంతరం రాష్ట్ర ప్రభుత్వం బసవేశ్వరుడి ఆశయాలను గుర్తించి అనుసరిస్తున్నది. 2015 లో ఇచ్చిన మాట ప్రకారం సీఎం కేసీఆర్ అధికారికంగా బసవేశ్వర జయంతిని ప్రకటించారు. హైదరాబాద్ నడిబొడ్డున ట్యాంక్‌బండ్‌పై బసవేశ్వరుడి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటుచేసి, ఏటా ఆయన జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నది.దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ లింగాయత్ జాతి గౌరవాన్ని మరింత పెంచారు. లింగాయత్‌ల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు, కోకాపేటలో బసవ భవన్ ఏర్పాటుకోసం స్థలం కేటాయించి రూ.10 కోట్ల నిధులను సమకూర్చారు. ప్రభుత్వం బసవేశ్వరుడి చరిత్రను పాఠ్యపుస్తకాలలో చేర్చి నేటి పౌరులకు ఆయన గొప్పతనాన్ని తెలియజేయటం ముదావహం.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం లింగాయత్‌లను నిర్లక్ష్యం చేస్తున్నది. వారిని కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చమని కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అనేకసార్లు ప్రతిపాదనలు పంపినా పట్టించుకోవటం లేదు. లింగాయత్‌లను ఓబీసీ జాబితాలో చేర్పించేందుకు.. రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడిగా నేను, ఎంపీ బీబీపాటిల్‌తో కలిసి గత ఏడాది డిసెంబర్ 22న ఢిల్లీకి వెళ్లాం. కేంద్ర బీసీ కమిషన్ ముం దు తెలంగాణలో లింగాయత్‌ల సామాజిక, ఆర్థిక, రాజకీయ వెనుకబాటుతనం గురించి నివేదించాం. ఓబీసీలో చేర్చడానికి అన్ని అర్హతలు లింగాయత్ సమాజానికి ఉన్నాయి. ఓబీసీలో లేకపోవటం వల్ల జాతీయస్థాయిలో విద్య, ఉద్యోగ, అవకాశాలను కోల్పోతున్నారు.
బసవేశ్వరుడు తన ప్రవచనాలతో మానవతా ధర్మాన్ని బోధిస్తే, సీఎం కేసీఆర్ నేడు అన్ని వర్గాల అభివృద్ధి, సమా నత కోసం కృషి చేస్తున్నారు. కుల నిర్మూలన, సమానత కోసం పాటుపడిన బసవేశ్వరుడు ఇప్పటికీ దేశానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
-శుభప్రద్ పటేల్ నూలి, 97010 69698
(వ్యాసకర్త: రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు)